Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కొత్త కేసులు

  • తాజాగా 43,263 మందికి పాజిటివ్‌..338 ‌మంది మృతి
  • ఆందోళనకు గురి చేస్తున్న కేరళ కేసుల సంఖ్య
  • ముంబైలో మళ్లీ పెరుగుతున్న కొరోనా కేసులు

‌దేశంలో కొరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా 40 వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు..మళ్లీ ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. కేరళలో కొరోనా కేసులు మళ్లీ పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 43,263 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 37,875తో పోలిస్తే దాదాపు 6 వేల కేసులు పెరగడం గమనార్హం. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇదే సమయంలో 338 మంది కొరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,41,749 మంది కొరోనాతో మరణించారు. కేరళలో రెండుమూగు రోజుల క్రితం వరకు 20 వేలకు దిగువన ఉన్న కేసులు తాజాగా మళ్లీ 30 వేలు దాటడం కలవర పెడుతున్నది. ఆ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 30,196 కేసులు బయటపడ్డాయి. 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ముంబయిలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండగా..బుధవారం రికవరీలు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 40,567 మంది వైరస్‌ ‌నుంచి కోలుకోగా..ఇప్పటి వరకు దేశంలో 3.23 కోట్ల మంది కోవిడ్‌ ‌నుచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.48శాతంగా ఉంది. అటు కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్‌ ‌కేసులు మళ్లీ 4 లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,93,614 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.19శాతంగా ఉంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ‌పక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. నిన్న మరో 86.51 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 71.65కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave a Reply