- తాజాగా 24 గంటల్లో 46759 మందికి పాజిటివ్..509 మంది మృతి
- కేరళలో అత్యధికంగా 32801 కేసులు
దేశవ్యాప్తంగా శుక్రవారంతో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కొరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే 31,374 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 46,759 కాగా అందులో ఒక్క కేరళ రాష్టంలోనే 32,801 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,49,947కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ప్రస్తుతం 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కొరోనాతో 4,37,370 మంది మృతి చెందారు. 62,29,89,134 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
కేరళలో నమోదవుతున్న కేసులు దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమవుతాయే మోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కేరళలో వరుసగా మూడో రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు, శుక్రవారం 32,801 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,70,703 కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. టెస్టు పాజిటివిటీ రేటు ఏకంగా 19.22 శాతం నమోదైంది. మొత్తం కేసుల్లో 73.45శాతం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కొరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.