- తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం
- మాజీ గవర్నర్ విద్యాసాగరరావు
త్వరలో తెలంగాణ, ఏపీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఏపీలోనూ కొత్త అధ్యక్షుని త్వరలోనే పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని చెప్పారు. తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. విపక్షాలు రాజకీయ అవసరాల కోసమే సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370, సిఏఏ రామ మందిరం, ట్రిపుల్ తలాక్ వంటి అంశాల విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. దీనిని తట్టుకోలేక ప్రతిపక్షాలు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల ఆరోపణలు దేశానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. జాతి సమైక్యతకు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ల అవసరం ఎంతో ఉందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ముస్లిం యువత జాతీయ జెండాతో బయటకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న యుస్లిం యువత వందేమాతరం, జనగణమణ గీతాలను ఆలపించి ముగించాలని సూచించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికం గానిర్వహిం చాలని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో నిర్వహించకపోవడం వెనక టీఆర్ఎస్ ఎంఐఎం హస్తం ఉందని విమర్శించారు. మాతృభాష ప్రాధాన్యతను చాటి చెప్పేలా శుక్రవారం హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భాష విషయంలో విద్యార్థుల్లో సంఘర్షణ లేకుండా చూడాలన్నారు.