Take a fresh look at your lifestyle.

రైతులకు తిలోదకాలు వదిలే కొత్త వ్యవసాయ చట్టాలు

‘విచారకరమైన విషయమేమంటే, కొన్ని రాష్ట్రాలలోని రైతులు, రైతుసంఘాలు మాత్రమే తమ శక్తి మేరకు ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ, పార్లమెంట్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా వోటు వేసిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఒక బలమైన నిరసనను కూడా వ్యక్తం చేయలేదు. కారణం ఏమిటి? పార్లమెంట్ లో వ్యతిరేకించాము కాబట్టి ఇక్కడ అవసరం లేదనుకుంటున్నారా? అసలు ఆ పార్టీ వర్గాల్లో ఆ చర్చే లేదు. పైగా, ఒప్పంద వ్యవసాయం అమలులోకి వస్తే తమకే లాభం అని ఆ పార్టీలోని ఆధిపత్యశక్తులు అనుకుంటున్నాయా? గత ఆరు సంవత్సరాల పాలనలో వ్యవసాయం గురించి తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదే అనిపిస్తోంది..’

sanketham sajayaకరోనా పాండమిక్ సమయాన్ని అడ్డుపెట్టుకుని తమకు కావాల్సిన విధంగా కేంద్రప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకువస్తోంది. ఇప్పుడు తాజాగా చర్చకు కూడా ఆస్కారం లేకుండా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ వ్యవసాయ బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చాయి. గత ఆరేళ్ల కేంద్రప్రభుత్వ ధోరణి గమనిస్తే చర్చించటం అనే అంశమే వారి విధానాల్లో లేదని ఎవరికైనా అర్థమవుతుంది. అది కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన విషయం కావొచ్చు, పౌరసత్వ చట్ట సవరణ కావొచ్చు, కార్మిక చట్టాల్లో మార్పులు కావొచ్చు, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసంచేసి, కార్పొరేట్ రంగానికి, బహుళజాతి సంస్థలకు దేశ వనరులను అప్పజేప్పటం కావొచ్చు, ఇప్పుడు ‘రైతుకు సాధికారత’ పేరుతో వ్యవసాయ చట్టాలు కావొచ్చు. పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోనూ చర్చ వుండదు. కాదు, ఉండనివ్వరు. వీటిని ప్రశ్నించే గొంతులకు ఎన్ని విధాలుగా నిర్బంధం అమలుచేస్తారో కూడా ఎవరికీ తెలియని విషయం కాదు.

ఇప్పుడు సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అపరిమితమైన స్వేచ్చ వచ్చి తాము పండించిన పంటను ఎక్కడైనా తనకు నచ్చిన ధరకు అమ్ముకోవడం అనేది ఈ శతాబ్దపు అద్భుతంగా నిర్వచించడం, దాన్ని వారి వందిమాగధులు ప్రచారంలో పెట్టడం వంటివి అన్నీ జరుగుతున్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో కోవిద్ భయాన్ని కూడా తోసిరాజని రైతులు రహదారులు దిగ్బంధం చేయటం, రైల్ రోకోలు నిర్వహించడం, రోజుల తరబడి నిరసనలు కొనసాగిస్తూ వుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలన్నీ చట్టాల పేరుతో కేంద్రప్రభుత్వం తలపెట్టిన రైతు హననాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం పతాకస్థాయికి చేరి.. నిరంతర రైతు ఆత్మహత్యలతో “వర్ధిల్లుతోంది”. సంవత్సరాల తరబడి లక్షలాది మంది చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వాల, రాజకీయ పార్టీల చదరంగంలో పావులై చనిపోతున్నారు. ఎన్నికల సమయంలో తప్పించి ఎప్పుడూ ఈ అంశం చర్చకు కూడా రాదు. రాజకీయ పార్టీల నేతలు ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవటం తప్పించి ఏనాడూ ఈ సమస్యకు గల మూలాల గురించి చర్చించటం గానీ, పరిష్కారం కోసం ఆలోచించడం గానీ చేయలేదు. చనిపోయిన రైతు కుటుంబాలకు ఎంతోకొంత ఇప్పుడు నష్టపరిహారం ప్రభుత్వాల నుంచీ అందడం అనేది పౌరసమాజం వత్తిడి, ఆందోళనల వల్లే సాధ్యమయింది. అంతేగానీ అవి ఆయా పార్టీల భిక్ష కాదు. సమస్య తీవ్రరూపం దాల్చినప్పటికీ చట్టసభల్లో దీని గురించి నిర్దిష్టంగా చర్చించాలన్న ఇంగితాన్ని ఏ ప్రభుత్వమూ ప్రదర్శించలేదు. అవి కేంద్రప్రభుత్వాలు కావొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావొచ్చు.

మళ్లీ ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుకోవాలంటే, మనకో సామెత వుంది ‘పెనం మీద నుంచీ పొయ్యిలో పడినట్లు’ అని.. అలాగే తయారయ్యింది రైతుల పరిస్థితి. ఈ మూడు చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇవి చాలా గొప్పగా వున్నాయంటూ కొంతమంది చేసే వాదన ‘నేతి బీరకాయలో నెయ్యి’ చందమే అనటంలో సందేహపడాల్సిన అవసరం లేదు. మనదేశ వ్యవసాయాన్ని, ఆహార భద్రతను నిలబెడుతున్నది మెజారిటీ చిన్న సన్నకారు రైతులే. అందులో కూడా దాదాపు డెబ్భై శాతం మహిళలు. వీరందరి హక్కులను, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో ముడిపడి వున్న వారి జీవనోపాధులను దెబ్బతీసే చట్టాలు ఇవి. స్థానికంగా ఎక్కడికక్కడ అన్ని రకాల పంటలకు భరోసా నిస్తూ, మార్కెట్ సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని అడుగుతుంటే, దేశంలో ఎక్కడికైనా వెళ్లి రైతులు అమ్ముకోవచ్చు అంటూ చేసిన చట్టం వెనుక దాగిన అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికే సరళీకృతం పేరుతో విదేశీ బహుళజాతి కంపెనీలు రిటైల్ రంగంలోకి దూసుకు వచ్చేసాయి. కొనుగోలు శక్తి ఉన్నవాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ తో ఇంట్లోకి సరుకులు రావటం అత్యంత సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ వాటిని సరఫరా చేసేది, ఆ ఆదాయాన్ని అందుకునేది ఎండనక, వాననక.. బురదలో వంగుని పనిచేసే రైతులు కాదు. పండించిన పంటను దాచిపెట్టి తమకు ఇష్టం వచ్చిన సమయంలో అమ్ముకునే వెసులుబాటు ఏ రైతులకు వుండదు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఊపిరి తీసుకోనివ్వవు. పైగా అవి పెరిగి పెరిగి ఊపిరి తీస్తాయి కూడా! ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి కన్నా ప్రైవేటు వ్యక్తుల నుంచీ అధిక వడ్డీకి తీసుకునే అప్పులే ప్రధానంగా వుంటాయి. సాధారణంగా, పండిన పంటను ఇచ్చిన అప్పుకు బదులుగా తక్కువ రేటుకు తీసుకునే వ్యాపారస్తులే ఎక్కువగా వుంటారు. ఇప్పుడు రైతు సాధికారత పేరుతో తెచ్చిన ఈ చట్టం వల్ల జరగబోయేదేమిటంటే అత్యధిక శాతం మంది చిన్న సన్నకారు రైతులు అప్పు పేరుతో పండిన పంటను సంపూర్తిగా వ్యాపారస్తుల చేతికి అప్పజెప్పటం. మద్ధతు ధర అంటూ ఏదీ వుండదు కాబట్టి, వ్యాపారస్తులు ఏంచెబితే అదే నడుస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నామమాత్రమవుతాయి లేదా అసలు ఉనికినే కోల్పోతాయి. అంటే, వ్యవస్థలను ప్రజలకు పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావటానికి బదులు వాటిని సమూలంగా నాశనం చేయటం జరుగుతుంది. ప్రభుత్వ మద్ధతు ధరలంటూ ఏమీ వుండవు కాబట్టి వాటిని అమలుచేసే వ్యవస్థలు కూడా వుండవు.

తక్కువ ధరలకు పంటలను కొని, నిల్వచేసే సామర్ధ్యం ఎవరికి వుంటుంది? చిన్న సన్నకారు రైతులకైతే ఉండదనేది స్పష్టం. అందులో మహిళా రైతుల గురించి ఇంక చెప్పేదేముంది! రైతులుగా గుర్తింపు గానీ, నిర్ణయాధికారం కానీ వుండదు. నిర్దాక్షిణ్యమైన పురుష వ్యాపారస్వామ్య ఆధిపత్యం వివిధ సమూహాల్లో అనేక విధాలుగా రుద్దబడుతుంది. రైతుల దగ్గర నుంచీ స్వాధీనం చేసుకున్న పంటను స్థానిక వ్యాపారస్తులు కార్పోరేట్ కంపెనీలకు అందజేస్తారు. ఎంత కొన్నా, ఎంత గోడౌన్ లో దాచినా చట్టపరంగా ప్రశ్నించే వీలు ఉండదు. వాటి మీద ఏ రకమైన పన్నులూ వుండవు. నిత్యావసర వస్తువుల జాబితాలోంచి పప్పులు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, చిరుధాన్యాలను తొలగించారు కాబట్టి వాటికి సంబంధించిన ధరలు ఎంత పెరిగినా మొత్తుకోవటానికి కూడా వినియోగదారులకు అవకాశం వుండదు.

ఇదే కాకుండా, కార్పొరేట్ వ్యవసాయం ఇప్పటికంటే మరింత శరవేగంతో స్థిరపడుతుంది. పెట్టుబడి, పండిన పంటను తక్షణం ఒక రేటు ఇచ్చి కొనే ఒప్పందం పేరు మీద చిన్న సన్నకారు రైతుల భూములన్నీ కంపెనీల పరమవుతాయి. వినడానికి ఇది ఒక ఒప్పందం లాగా ఏ సమస్య లేనిదిగానే ఉండొచ్చు కానీ, అందులోని కంటికి కనిపించని నిబంధనలు, వైకుంఠపాళి ఆటలో లో పాములలాగా భవిష్యత్తులో మారతాయనటానికి అనేక ఉదాహరణలు వున్నాయి. అన్ని పాములనూ దాటుకుని వెళ్ళగలిగేది ఒకరిద్దరు కూడా ఉండరు.

విచారకరమైన విషయమేమంటే, కొన్ని రాష్ట్రాలలోని రైతులు, రైతుసంఘాలు మాత్రమే తమ శక్తి మేరకు ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ, పార్లమెంట్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా వోటు వేసిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఒక బలమైన నిరసనను కూడా వ్యక్తం చేయలేదు. కారణం ఏమిటి? పార్లమెంట్ లో వ్యతిరేకించాము కాబట్టి ఇక్కడ అవసరం లేదనుకుంటున్నారా? అసలు ఆ పార్టీ వర్గాల్లో ఆ చర్చే లేదు. పైగా, ఒప్పంద వ్యవసాయం అమలులోకి వస్తే తమకే లాభం అని ఆ పార్టీలోని ఆధిపత్యశక్తులు అనుకుంటున్నాయా? గత ఆరు సంవత్సరాల పాలనలో వ్యవసాయం గురించి తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదే అనిపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, రైతుసంఘాలు ఎక్కడికక్కడ ఒక రోజో, రెండు రోజులో టోకెన్ గా నిరసన తెలియజేసారు గానీ బలమైన రైతుల ఉద్యమాన్ని మాత్రం నిర్మించలేదు. కారణమేమిటి? లోపం ఎక్కడుంది? ఆయా పార్టీలు కొంచం బలంగా వున్న ఒకటి రెండు ప్రదేశాల్లో కొంచం చెప్పుకోదగిన సంఖ్యలో ప్రదర్శనలు జరిగినట్టున్నాయి. అంతే తప్ప, ఒక బలమైన రైతుగళం వినిపించలేదు. ప్రతిపక్షాలను, చోటా మోటా రైతు సంఘాలను పక్కన పెడదాం కాసేపు. రైతు ఆత్మహత్యల పునాది మీద ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించిన ప్రజాస్వామిక శక్తుల సహకారంతో అధికారంలోకి వుచ్చినవారు ఫెడరలిజం స్పూర్తికి, రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకంగా, కేంద్రప్రభుత్వం ఇక్కడి రైతుల జీవితాలను శాశ్వతంగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుంటే ఏం చోద్యం చూస్తున్నట్టు? పార్లమెంట్లో వ్యతిరేకించారు సరే, రైతులను సంఘటిత పర్చి మరణ శాసనం లిఖిస్తున్నకొత్త చట్టాలకు వ్యతిరేకంగా నిలబెట్టాల్సిన అవసరం లేదా?

Leave a Reply