Take a fresh look at your lifestyle.

నేటి ని(ఇ)జం

నేటి ప్రేమలు నీటిపై బుడగలే
నరుల నవ్వులు ప్లాస్టిక్‌ ‌పువ్వులే
ఆత్మీయతలన్నీ అవసర అస్త్రాలే
మాటలు తేనె పూసిన కత్తులే కదా !

ధన, అధికారాల చుట్టు..
రక్షణ కవచాలే కదా చట్టాలు
అక్రమార్కుల క్రీడా మైదానాలే..
నవ్య రాజకీయ కుళ్లు కుతంత్ర క్షేత్రాలు !

రెక్కలు తొడిగిన అయ్యవ్వలే..
రెక్కలుడిగినాక అక్కరకురాని అనాథలై..
వాడి నలిపి పడేసిన విస్తరాకులైన..
డిజిటల్‌ ‌యుగపు డేంజరస్‌ ‌పోకడలు !

వ్యాపార వాణిజ్యాల్లో కల్తీల లీలలు
ఉద్యోగాల్లో అమ్యామ్యాల లాలూచీలు
నిన్నటి పునాదుల్ని మరిచి నేటి జగత్తులో..
ఈ క్షణం జీవించడమే నవ్య ఇజమైంది !

పగలే పడకేసే నిశాచర నవ యువత..
ఫిజ్జా, బర్గర్లే నమిలే నడవంత్రపు నడత..
ఫేస్‌బుక్‌, ‌వాట్సాప్‌, ‌ట్విట్టర్లలో మునిగే నేత్రాలు
స్మార్ట్ ‌ఫోనే మరో శాశ్వత అంగమైన అకాలాలు !

విలువల వలువలు వివస్త్రలై..
మానవీయతలు ఇంకిన బావులై..
సంబంధాలన్నీ లాభనష్టాల లెక్కలై..
బతక నేర్చుకోవడమే నేటి ఇ(ని)జమైంది !

-మధుపాళీ
                 కరీంనగర్‌ – 9949700037

Leave a Reply