న్యూ దిల్లీ, జనవరి 21 : స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూ దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్‌తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకోవటం తనకు సంతోషంగా ఉందని ప్రధాని ఓ ట్వీట్లో తెలిపారు. ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని తెలిపారు.
దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని తెలిపారు. మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ 1943లో ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. నేతాజీ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనే విధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు.