Take a fresh look at your lifestyle.

నేతాజీ దేశ్ నాయక్….. మోడీకి గుర్తు చేసిన మమత

నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉంది. నేతాజీ జయంతిని పరాక్రమ దివస్ గా పాటించాలని మోడీ ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. మోడీ ఆంతర్యాన్ని గ్రహించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నేతాజీ జయంతి పరాక్రమ దివస్ కాదు. దేశ్ నాయక్ దివస్ అనాలని సూచించారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాల్లో అతివాద వర్గం నాయకుడైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా దేశం కోసం కుల,మతాలకు అతీతంగా పోరాడిన యోధుడు. ఆ విషయాన్ని గుర్తు చేయడానికే మమత ఆయన పుట్టినరోజును దేశ్ నాయక్ దివస్ గా అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాస్ చంద్రబోస్ వంటి యోధులంతా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల ద్వారానే తమ కార్యకలాపాలను ప్రారంభించారు.అయితే, సర్దార్ పటేల్ ను బీజేపీకి చెందిన వాడిగా ప్రచారం చేయడానికి మోడీ శతవిధాల ప్రయత్నించారు.

ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ పట్ల,ఆయన కుటుంబం పట్ల భారతీయ జనసంఘ్ కి మొదటి నుంచి ద్వేషం ఉంది. స్వాతంత్ర్యం వొచ్చిన నాటి నుంచి వారి కుటుంబానికి చెందిన వారే అధికారాన్ని అనుభవిస్తున్నారనీ, అనువంశిక రాజకీయాలను ప్రవేశపెట్టారని భారతీయ జనసంఘ్, బీజేపీ నాయకుల ఆరోపణ. వారి ఆరోపణల్లో నిజానిజాల తర్కంలోకి పోకుండా ఆలోచిస్తే మహాత్మాగాంధీ మాటే శిరోధార్యంగా భావించిన తరానికి చెందిన నాయకులు నెహ్రూ తమ హక్కులను హరించేస్తున్నారని ఎన్నడూ భావించలేదు. నెహ్రూ కేబినెట్ లో పటేల్ ఉపప్రధానిగా, హోం మంత్రిగా వ్యవహరించారు. నేతాజీ అంతకుముందే దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో తన మార్గంలో పోరాడారు. ఆయనకు పదవీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు. పరాయి పాలకుల నుంచి దేశాన్ని విముక్తం చేయడమే ఆరోజుల్లో అందరి లక్ష్యం.

గాంధీగారు కూడా ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలో వారికి ఇచ్చి ప్రోత్సహించారు. నేతాజీ జయంతిని బెంగాల్,అసోంలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఉపయోగించుకోవాలన్న ఆరాటంతోనే మోడీ శనివారంనాడు బెంగాల్, అసోంలలో పర్యటించారు.ఈ రెండు సరిహద్దు రాష్ట్రాల్లో విదేశీయుల సమస్యను లేవనెత్తి హిందూ మెజారిటీ వర్గం వోట్ల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఇప్పటికీ అదే పంథాలో ప్రచారం సాగిస్తోంది. నేతాజీ దేశభక్తుడు, జాతీయవాది అంతేకాని, మత పరమైన భావజాలం ఉన్న నాయకుడు కాదు. ఆయన ప్రసంగాల్లో మత ప్రస్తావన ఎప్పుడూ ఉండేది కాదు. ఆయన అఖండ భారత్ ను కోరుకున్నాడు.అంటే ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలు కలిసి ఉన్న అఖండ్ భారత్ నన్న మాట. బీజేపీ నాయకులు నేతాజీని తమ వాడని ప్రచారం చేసుకునే ముందు ఆయన జాతీయ భావాలు ఒక్క మతానికో వర్గానికో పరిమితం కావన్న విషయాన్ని గుర్తించాలి. ఈ దేశంలో ముస్లింలు అంతా ఇక్కడి వారేననీ, వారిని వేరుగా చూడటం తగదని బోస్ ఆనాడే స్పష్టం చేశారు. ఆయన రామకృష్ణ పరమహంస-వివేకానందుల స్ఫూర్తితో మత సామరస్యం కోసం పాటు పడిన నాయకుడు. ఆయన సమాజంలో అన్ని వర్గాలూ కలిసిమెలిసి ఉంటేనే భారత్ కి స్వాతంత్ర్యాన్ని సాధించగలమని బోస్ ప్రగాఢంగా విశ్వసించారు.

- Advertisement -

ఈ విషయాన్ని పాత తరం స్వాతంత్ర్య యోధులు తమ పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వారితో సాన్నిహిత్యం ఉండి ఇప్పటికీ సజీవంగా ఉన్నవారు బోస్ జాతీయ భావాల గురించి తరచూ ఉద్బోధ చేస్తుంటారు.అందువల్ల బోస్ ని ఒక పార్టీకో, మతానికో పరిమితం చేయడం సరైంది కాదు. మమతా బెనర్జీ కేంద్రానికి చేసిన సూచనలోని అంతరార్ధం ఇదే. బోస్ దేశనాయక్ అని ఆమె సంబోధించారు. బీజేపీ రాజకీయ సిద్ధాంతం నెహ్రూ వ్యతిరేకత లేదా ద్వేషం పునాదులపై నిర్మితమైంది. నిజానికి నెహ్రూ కొన్ని తప్పులు చేసి ఉండవొచ్చు కానీ, గాంధీ మార్గాన్ని వీడలేదు. అంతవరకూ ఎందుకు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సలహాదారుల సూచనలతో ఎమర్జెన్సీ విధించినప్పటికీ తర్వాత దానిని ఎత్తివేయడమే కాకుండా, తన నిర్ణయం సరికాదని తెలుసుకున్నారు. అలాంటి విశాల దృక్పథం కరుడు కట్టిన సంఘ్ పరివార్ భావజాలంలో పెరిగిన వారికి లేదు. నెహ్రూ వరకు ఎందుకు బీజేపీకే చెందిన మాజీ ప్రధాని వాజ్ పేయి ఉదార స్వభావాన్ని కలిగి ఉండటం కూడా ఆనాటి భావజాల వారసత్వమే కారణం. బీజేపీ నాయకులు, సంఘ్ పరివార్ నాయకులు ఇప్పుడు అయోధ్యలో రామాలయం కోసం విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని కూడా తమ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు.

రాముణ్ణి ఎన్నికల ప్రచారాంశంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అదే వారికి ప్రచారాంశం. అందుకు స్థానిక బీజేపీ నాయకుల ప్రసంగాలు సంకేతమని చెప్పవొచ్చు. తెలుగురాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల దూకుడు ఇందుకు అద్దం పడుతోంది. మతాన్నీ, రాముణ్ణి ప్రస్తావించకుండా కమలనాథులు వోట్లు అడగలేరన్న విషయం ఎప్పుడో రుజువైంది. మోడీ ఇతర నాయకుల మాదిరిగా బయటపడకపోయినా, ఆయన అంతరంగం అదే.అందుకే, అసోం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నేతాజీ సేవలను ప్రస్తుతించడం ద్వారా ప్రారంభించారు.దీనిని గ్రహించే మమతా బెనర్జీ ఘాటైన రీతిలో సమాధానమిచ్చారు. బెంగాల్ లో తృణమూల్ ఎమ్మెల్యేలూ,ఎంపీలను తమ వైపు లాక్కుంటున్న కమలనాథులకు ఇటీవల సి-ఓటర్ సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.అందుకే, బెంగాలీలకు ఎంతో ఆరాధ్యులైన విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్, నేతాజీ సుభాస్ చంద్ర బోస్ లకు తాము వారసులమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు భారత దేశానికే వారసులు. ఏ ఒక్క వర్గానికో, పార్టీకో కాదు.

Leave a Reply