Take a fresh look at your lifestyle.

అజరామరం నేతాజీ పోరాటం

 నేడు  సుభాస్ చంద్రబోస్ జయంతి
భారతదేశ స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గంలోనే మాత్రమే కాదు పోరాట (సాయుధ) మార్గంనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన సమర సేనాని నేతాజీ సుభాష్. వలస వాదాన్ని ప్రతిఘటించడంలో ధైర్యంగా పోరాడ‌టం చేయడంలో సుభాష్‌ చంద్రబోస్‌కు చేసిన కృషి అపూర్వం, అనన్య సామాన్యం, అజరామరం. ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైనప్పటికీ తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తేవడమే ప్రధమ కర్తవ్యం అని ఉద్యమంలోకి అడుగుపెట్టిన స్వాతంత్య్ర పిపాసి. భారతీయుడు గౌరవప్రద జీవితాన్ని గడపేలా చేసేందుకు తనను తాను కట్టుబడి ఉన్న ఒక అద్భుత‌మైన వ్య‌‌క్తి.
“ఆజాద్ హిందూ ఫైజ్” ను స్థాపించి భారత్ కు స్వాతంత్ర్యం తీసుకు రావడంలో కీలకపాత్ర వహించాడు. స్వాతంత్ర్యం రావాలంటే సొంత సైన్యంతో పాటు ఇతర దేశాల సహకారం కూడా అవసరమని భావించాడు. సుభాష్‌ బాబు మేథో పరాక్రమం, సంస్థాగత నైపుణ్యాలకు కూడా ప్రసిద్ది చెందారు. ప్రతి భారతీయుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడపేలా చేసేందుకు గాను తనను తాను కట్టుబడి ఉన్న ఒక అద్భుత‌మైన వ్య‌‌క్తి. సుభాష్‌ బాబు మేథో పరాక్రమం, సంస్థాగత నైపుణ్యాలకు కూడా ప్రసిద్ది చెందారు.

2021నుండి నేతాజీ జన్మదినమైన జనవరి 23న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్‌’గా జరపాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి  అహింస మార్గంలో గాంధీ మార్గంలో  కొందరు నాయకుల  పొరాటం ఎంత ముఖ్యమో,  సుభాస్ బోస్ పోరాట పటిమ అంతే ప్రధానం. తన జీవితంలో స్వార్థం లేకుండా దేశ స్వాతంత్య్ర సాధనే పరమార్థం గా, 12 దేశాలు తిరిగి అతి పెద్ద సైనిక బలగాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన ఒక గొప్ప యుద్ధ వీరుడు సుభాష్ చంద్రబోస్. నివృత్తి కాని సందేహంగా ఆయన అదృశ్యం జరగక పోయి ఉంటే 1947 కంటే రెండు సంవత్సరాల ముందే  స్వాతంత్ర్యం వచ్చి ఉండేదని చాలా మంది నమ్ముతారు.

సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించాడు. బాల్యం నుండే ఎక్కడ అన్యాయం జరిగిన ఎదురు నిలిచి అడిగేవాడు. ఇంటర్ చదివే రోజుల్లో “స్వేచ్చా సేవ సంఘ్” అనే సంస్థ ఏర్పాటు చేసి యువకులకు సమాజ సేవ, ధ్యానం, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం వంటి అనేక అంశాల పైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. బోస్ కు స్వామి వివేకానంద అంటే ఎంతో ఇష్టం. ఇక 1919లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉత్తమ ర్యాంక్ సాధించి శిక్షణ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. 1920 లో ఇంగ్లాండ్ లో జరిగిన పరీక్షలో మెరిట్ లో ఉత్తీర్ణుడైనాడు. అయితే జలియన్ వాలా భాగ్ వార్త తెలిసిన అతడికి మనసులో ఆవేదన కలిగి దానిని మధ్యలోనే వదిలేసి 1921 లో ఇండియా తిరిగి వచ్చాడు. తరువాత గాంధీజీ కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు. చిత్తరంజన్ దాస్ వద్ద పనిచేసే వాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశానికి వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధించారు. ఇక అయన జైలు నుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు. జైలులో నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించడం చూసి బ్రటిష్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తు ఆయనను విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్  అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అలా దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో బోస్ ను నిర్బంధించడం కాకుండా దేశ బహిష్కరణ కూడా చేసారు.

ఆ సందర్భంలో అయన యూరప్ లో పర్యటించి హిట్లర్, ముస్సోలిని వంటి మహానీయులను కలిసాడు. అయితే బోస్ హిట్లర్ ని కలసిన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. హిట్లర్ కోసం వేచి చూస్తుండగా ఒక వ్యక్తి వచ్చి  విషయం ఏమిటి అని అడుగగా నేను మీ బాస్ హిట్లర్ తో మాట్లాడా లని జవాబిచ్చాడు. అయితే కొద్దిసేపటికి వచ్చిన హిట్లర్ బోస్ తో చర్చలు చేసి వెళుతుండగా నీ వద్దకు “ముందుగా వచ్చిన వ్యక్తి హిట్లర్ కాదని నీకెలా తెలిసింది అని ప్రశ్నించిగా, నా భుజాన్ని తట్టే ధైర్యం హిట్లర్ కు తప్ప మరెవ్వరికీ లేదని” ఆయన జవాబిచ్చాడు. అయితే 1934 వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు పాలై, ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స నిమిత్తం ఆయనని ఆస్ట్రియాకు తరలించారు. ఇలా ఆస్ట్రియలో చికిత్స పొందుతున్న ఆయన యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించాడు.

“ద ఇండియన్ స్ట్రగుల్” అనే  పుస్తకం రాసే సందర్భంలో ఇంగ్లీష్ వచ్చి టైప్ చేయగలిగే ఒక వ్యక్తిగా  పరిచయమైన  23 ఏళ్ల ఎమిలీ షెంకెల్ అనే ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలిగా నియమించు కోగా, ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌తో కలిసి పని చేయగా, వారి మధ్య ప్రేమ చిగురించిందని చెపుతారు.
స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేని బోస్ 1934-36 లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాక దేశమంతా తిరుగుతూ తన ఉపన్యాసాలతో దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నాయకు డయ్యాడు. ఇలా గొప్ప నాయకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ లో అంతర్గతగా జరిగిన కుట్రల కారణంగా 1939 లో ఆయనను కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. ఆ తరువాత వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని స్థాపించి దేశం అంతటా పర్యటించగా ఆయనకి మద్దతుగా కొన్ని లక్షల్లో జనాలు అయన వెంట నడిచారు. ఇలా ఉద్యమ కారుడిగా ప్రజల్లో చైతన్యం నింపుతుండగా 1941 అరెస్ట్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ అయన పథకం ప్రకారం హమ్మద్ జియా ఉల్ హక్ అనే మారు పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి కాబుల్ కి వెళ్ళాడు. అక్కడ ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకి ఆశ్రయం కల్పించగా అక్కడ ఉంటూనే రష్యా, జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలు చేసాడు.

1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకొని జపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసు కున్నాడు. ఇలా చేరుకున్న బోస్ ను వారు స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు. ఆ తరువాత బోస్ అక్కడే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. 1941 ఫిబ్రవరి 27 న బోస్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం యావత్ దేశాన్ని కదిలించింది. ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బోస్ ను అక్కడికి ఆహ్వానించగా 45 రోజుల పాటు జలాంతర్గామిలో ప్రయాణించి అక్కడ మత్సుడ అని పేరు మార్చు కున్నాడు. అక్కడ బోస్ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో హింద్ ఫౌజ్ లో తండోప తండాలుగా సైనికులు చేరారు. ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.

ఇలా ఎంతో శక్తివంతమైన సైన్యాన్ని తయారుచేసి చలో ఢిల్లీ అనే నినాదంతో ప్రత్యక్ష యుద్దానికి దిగి జపాన్ సహకారంతో ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. తనకు అండగా నిలిచినా జపాన్ దేశం యుద్ధంలో ఓటమికి చేరువైంది. ఇక బర్మాలో వరదల కారణంగా ఆరోగ్యం క్షీణిస్తూ అనేక మంది సైనికులు మరణించారు. ఆ సమయంలో రష్యా  దాడికి దిగి, అణుబాంబు వేయడంతో జపాన్ అతలాకుతలం అయింది. అప్పటివరకు తనకు అండగా ఉన్న జపాన్ అలా అవ్వడంతో బోస్ నిస్సహాయు డైనాడు. ఆ తరువాత సింగపూర్, రంగూన్ సైనిక దళాలకు బ్రిటిష్ దళాలు దగ్గర య్యాయి. 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 1945 ఆగస్టు 18 వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో అయన మరణించి నట్లుగా రేడియో లో ప్రకటించారు.

ఇక తైవాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాష్ లో చంపేశారని కొందరు, ఆగస్ట్ 1945 తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నాడని చెప్పడం వల్ల ఆయన చనిపోలేదని మరికొందరు, సుభాష్ చంద్రబోస్ మారువేశంలో మన దేశం లోనే ఉన్నాడని ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. సైన్యానికి శిక్షణ ఇచ్చేప్పుడు… “నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి. మీకు స్వతంత్రాన్ని ఇస్తాను”… అని సైన్యంలో విశ్వాసాన్ని చిగురించేలా చేసేవాడు. దేశం కోసం ఎవరు చేయని విధంగా అహింస వలన కాదు,  పోరాడితేనే స్వాతంత్య్రం వస్తుందని కట్టు బట్టల్తో జపాన్ వెళ్లి ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసి బ్రిటిష్ సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి చివరికి స్వాతంత్ర్య చూడ కుండానే కనుమరుగైన యోధుడు బోస్. నేతాజీ సుభాస్ చంద్రబోస్ యొక్క విలువైన వారసత్వాన్ని, చ‌రిత్ర‌ను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం అనేక ర‌కాల చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. న్యూ‌ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నేతాజీపై మ్యూజియం ఏర్పాటు చేశారు. దీనిని 23.01.2019న ప్రధాని ప్రారంభించారు. దేశంలో చారిత్రాత్మక విక్టోరియా మెమోరియల్ భవనంలో కోల్‌కతాలో నేతాజీపై లైట్ అండ్ సౌండ్ షో శాశ్వత ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేయ బడింది. అండమాన్, నికోబార్‌లోని 3 ద్వీపాలకు పేరు మార్చి ప్రధాని మోదీ రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్‌ “చంద్రబోస్ ద్వీపంగా” పేరు మార్చారు.

-రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply