“గతంలో ఎన్నడూ లేని విధంగా ఓలీ నేతృత్వంలోని నేపాల్ భారత్ పట్ల విదేశాంగ విధానంలో వివాదాస్పద వైఖరిని అవలంబించింది. మన దాయాది దేశం చైనాతో అంటకాగటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేసింది. భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై ఓలీ తీసుకున్న నిర్ణయాలు సొంత పార్టీలోనే విమర్శలకు గురయ్యాయి. ఈ మధ్యకాలంలో ఓలీ చేసిన ఓ వివాదాస్పద కామెంట్ రెండు దేశాల సంబంధాలు లేదా భారత్ పట్ల ఓలీ వైఖరిని తెలుపుతుంది. తనను పదవి నుంచి దించటానికి భారత్, నేపాల్‌లలో కుట్రలు జరుగుతున్నాయని ఓలీ చేసిన ప్రకటన విదేశాంగ వ్యవహారాల వర్గాల్లో సంచలనం సృష్టించింది.”
రాజకీయ సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్‌గా అనిపించే నేపాల్‌లో మరోసారి సంక్షోభ వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఏకపక్షంగా పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఆదివారం ప్రధాని నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి సమావేశమై పార్లమెంటును రద్దుచేయాలని తీర్మానం చేసింది. అనంతరం దేశాధ్యక్షురాలు విద్యాదేవీ భండారీకి సిఫారసు చేసింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే అనూహ్యం అనుకుంటే అంతే వేగంగా అధ్యక్షురాలు విద్యాదేవీ కూడా ఈ సిఫార్సును ఆమోదించారు. విపక్షాలు, అధికార పక్షంలోని అసమ్మతి నేతలు స్పందించి మరో అడుగు వేసే లోపే మధ్యంతర సాధారణ ఎన్నికల తేదీలు కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది 2021 ఏప్రిల్ 30న తొది దశ, మే 10న తుది దశ ఎన్నికలు నేపాల్‌లో జరుగనున్నాయి. నేపాల్ పార్లమెంట్లో 275 మంది సభ్యులుంటారు. నేపాల్‌లో దిగువ సభను(అంటే మన దగ్గర లోక్‌సభ అన్నమాట) ప్రతినిధుల సభ అంటారు. ఇక ఎగువ సభను (మన రాజ్యసభ) నేషనల్ అసెంబ్లీగా వ్యవహరిస్తారు. ప్రతినిధుల సభకు 2017లో ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ కాలం 2022 వరకు ఉంది.
ఆధిపత్య పోరు-సంక్షోభం…
నేపాల్‌లోని ప్రస్తుత ప్రధాని ఓలీ పట్ల సొంత పార్టీలో కూడా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి, మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్(ప్రచండ)ల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటు ప్రధాన ప్రతిపక్షమైన నేపాలి కాంగ్రెస్‌తో పాటు అధికార పక్షంలోని అసమ్మతి వాదులు విమర్శించారు. పార్టీ స్టాండింగ్ కమిటీ కూడా ఓలి నిర్ణయాన్ని తప్పుబట్టడమే కాదు ఏకంగా ఓలిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. అసలు ప్రస్తుత సంక్షోభానికి కారణం తెలియాలంటే నేపాల్ రాజకీయాల్లో మూడేళ్ళ వెనక్కి వెళ్లాలి. 2017లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యూఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఓలీ-ప్రచండల కూటమి మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పూర్తి స్థాయిలో విలీనం దిశగా ఈ రెండు పార్టీలు అడుగులు వేశాయి.
2018లో ఓలి నాయకత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) విలీనమై ఎన్సీపీగా-నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది. ఇరు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఓలీకు దేశ ప్రధాన మంత్రి పదవి దక్కింది. ప్రచండ సంఘటిత సీపీఎన్ పార్టీకి కో-చైర్మన్ అయ్యారు. క్రమంగా పార్టీపై ప్రచండ పట్టు పెంచుకోవటం ప్రారంభించారు. పార్టీలోని అత్యున్నత విభాగం సెక్రటేరియట్లో ప్రచండదే పైచేయిగా ఉండటం ఓలీ వర్గానికి మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఆధిపత్య పోరు మొదలయ్యింది. ప్రచండ వర్గంపై పైచేయి సాధించటానికి ఓలీ ఈ మధ్య ఒక వివాదాస్పద ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం కీలకమైన నియామకాలు చేసే అధికారాన్ని ప్రధాని హోదాలో కేపీ శర్మ తనకే కట్ట బెట్టుకున్నారు. ఆ ఆర్డినెన్స్ ప్రకారం పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభ, నేషనల్ అసెంబ్లీల స్పీకర్లు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి అంగీకారం అవసరం లేకుండా వివిధ రాజ్యాంగ సంస్థల అధిపతులను, సభ్యులను నియమించే అధికారం ప్రధానికి దఖలవుతుంది. ఈ ఆర్డినెన్స్ నిరంకుశత్వ ధోరణులకు అవకాశం కల్పిస్తుందని, ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని సొంత పార్టీ సీనియర్ నేతలు, సభ్యులు కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చెయాలని, కేపీ ఓలీ పీఎం పదవినుంచీ లేదా పార్టీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలన్న డిమాండ్ కూడా పెరిగింది. కొంత సంప్రదింపులు, చర్చల తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశం డిమాండ్‌ను పార్టీ సభ్యులు వెనక్కు తీసుకునేటట్లు, ఓలీ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకునేట్లు ఒప్పందం కుదిరింది. అయితే ఈ పరస్పర అంగీకారాలు ఆచరణలోకి రాకుండానే అందరికి షాక్ ఇస్తూ ప్రధాని ఓలీ ఏకంగా పార్లమెంటే రద్దు అయ్యేవిధంగా వేగంగా పావులు కదిపారు.
భారత్‌తో దుస్సాహసం…
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓలీ నేతృత్వంలోని నేపాల్ భారత్ పట్ల విదేశాంగ విధానంలో వివాదాస్పద వైఖరిని అవలంబించింది. మన దాయాది దేశం చైనాతో అంటకాగటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేసింది. భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై ఓలీ తీసుకున్న నిర్ణయాలు సొంత పార్టీలోనే విమర్శలకు గురయ్యాయి. ఈ మధ్యకాలంలో ఓలీ చేసిన ఓ వివాదాస్పద కామెంట్ రెండు దేశాల సంబంధాలు లేదా భారత్ పట్ల ఓలీ వైఖరిని తెలుపుతుంది. తనను పదవి నుంచి దించటానికి భారత్, నేపాల్‌లలో కుట్రలు జరుగుతున్నాయని ఓలీ చేసిన ప్రకటన విదేశాంగ వ్యవహారాల వర్గాల్లో సంచలనం సృష్టించింది. 2015లో వచ్చిన నేపాల్ కొత్త రాజ్యాంగం సందర్భంగా కూడా మాధేషి, తారు వంటి మైనార్టీ తెగల డిమాండ్లను రాజ్యాంగంలో చేర్చే అంశంపై ఇరు దేశాల సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మన దేశం నుంచి నేపాల్‌కు పెట్రోలు, మందులు, ఇతర సామాగ్రి సరఫరా నిలిచిపోయింది అప్పట్లో. 135 రోజులపాటు ఆర్ధిక దిగ్బంధనం కొనసాగింది. ఈ వ్యవహారంలో కూడా ఓలీ భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. అంతే కాదు భారత్-నేపాల్ మధ్య 1950లో జరిగిన ఒప్పందంలోనూ తమ దేశానికి అన్యాయం జరిగిందని ఓలీ చాలా సార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంటే ఒకరకంగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని ఓలీ ముందు నుంచీ అవలంబిస్తూ వస్తున్నారని అర్థం అవుతుంది.
అంతెందుకు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌లను భారత్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సందర్భంలో విడుదల చేసిన మ్యాప్‌పై కూడా నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను భారత్ తన ప్రాంతాలుగా చూపించింది. ఇవి తమ దేశంలోని భాగాలని ఓలీ ప్రభుత్వం వితండ వాదం ఎత్తుకోవటమే కాదు…మన భూభాగాలను తమ దేశ పటంలో చేర్చుతూ పార్లమెంట్ కూడా తీర్మానం చేసి దుస్సాహసనికి పూనుకుంది. అంతేకాదు కరోనా విషయంలోనూ ఓలీ మన దేశంపై నోరు పారేసుకున్నారు. భారతదేశం నుంచి అక్రమంగా వస్తున్న వారివల్లే నేపాల్‌లో వైరస్ వ్యాప్తి చెందుతోందని, చైనా, ఇటలీలకన్నా భారత వైరస్ ప్రమాదకరం అని ఓలీ వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఆక్షేపణీయం.
రద్దు చెల్లుతుందా?
ప్రధాని ఓలీ పార్లమెంట్‌ను రద్దు చేయటం అసలు చెల్లుతుందా లేదా అన్న ప్రశ్న కూడా నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం మారింది. నేపాల్ రాజ్యాంగంలో పార్లమెంట్ రద్దుకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలేమీ లేవు. ఆర్టికల్ 85 ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తరువాత పార్లమెంట్ రద్దవుతుంది. లేదంటే ఆర్టికల్ 76 ప్రకారం ప్రధాని విశ్వాస పరీక్షలో విఫలమైతే రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. తరువాత ఆరు నెలల్లోగా ఎన్నికల తేదీని నిర్ణయించాలి. ప్రస్తుత సందర్భంలో ఈ రెండు జరగలేదు. మరి ఇలా క్యాబినెట్ సిఫార్సుతో పార్లమెంట్ రద్దు అవుతుందా అనేది తేలాల్సి ఉంది. అందుకే నేపాల్‌లోని కొందరు రాజ్యాంగ నిపుణులు ఓలీ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ రద్దు వ్యవహారం కోర్టు వరకు వెళితే…ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు కీలకంగా మారుతుంది.