Take a fresh look at your lifestyle.

నెలకొక్కమారు…

నెలకొక్కమారు నీవు
ఉదయించలేని సూర్య బింబాన్ని విసర్జిస్తావు
బొట్లు బొట్లుగా….

నెలకొక్కమారు నీవు
శిశిరాన్ని వదిలి వసంతాన్ని ఆహ్వానిస్తావు
మారాకులాగా…

అప్పుడప్పుడు
కడుపునెవరో మెలిపెట్టినట్టు ఉండచుట్టుకుపోతావు
అనుమానపు చూపు తాకితే
తప్పేదో చేసినట్టు తలదించుకుంటావు

అప్పుడు నీలో
పై నుండి గంగా,సింధు నదులు
కింద నుండి ఎర్ర సముద్రం
సమాంతరంగా ప్రవహిస్తాయి

నిజమమ్మా…
నీవిపుడు
చూడకూడని దానినేదో దాచినట్టు
కొంగు చాటుకో,చున్నీ మాటుకో
ఇంకెంతమాత్రం దాచనక్కర్లేదు
వినకూడని మాటేదో పలికినట్టు
గుసగుసగానోభయం భయంగానో
ఇంకేమాత్రం మాట్లాడనక్కర్లేదు

అనుమానపు చూపుల బాణాల్ని
అవమానపు మాటల ఈటెల్ని ఆపుటకు
శానిటరీ ప్యాడ్లే మనకు రక్షణ బళ్లాలిపుడు

,అమ్మా..అక్కా..చెల్లీ..వదినా...
నెలసరి గుడ్డలన్నీ భద్రంగా దాచిపెట్టండి

ఒట్టు తల్లీ..
ముట్టు గుడ్డలన్నీ ఒక్కొక్కటిగా ముడేసి
ఉరితాళ్ళు పేనుదాం
అశుద్ధం అన్న ఆచారాలనీ
ఊపిరాగే దాకా ఉరితీద్దాం!!

దిలీప్.వి
మానవ హక్కుల కార్యకర్త
మల్లంపల్లి,ములుగు
సెల్:8464030808

Leave a Reply