Take a fresh look at your lifestyle.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ప్రతి ఉద్యోగి విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి తప్ప నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ‌కె నిఖిల అన్నారు. జిల్లాలో జరుగుతున్న పల్లెప్రగతి పనులలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ‌శుక్రవారం దేవరుప్పుల మండల కేంద్రంతోపాటు కామారెడ్డి గూడెం, బంజారా, చిన్న మడూర్‌ ‌గ్రామాలలో పర్యటించి గ్రామాలలోని వైకుంఠదామం, డంపింగ్‌ ‌యార్డ్, ‌నర్సరీ, తడి,పొడి చెత్తషెడ్స్ ‌నిర్మాణాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలించగా ఎంపీవో పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి విధులు సరిగ్గా నిర్వహించడం లేదని సస్పెండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ అధికారి నిర్లక్ష్యం వల్ల గ్రామాభివృధ్ధి కుంటు పడుతుందని, అయిల్బాల్స్, ‌డ్రైనేజీ క్లీనింగ్‌ ‌లేదని, శానిటరీ పనుల నిర్లక్ష్య వలన వర్షాకాలం సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో తమ విధులను నిర్వహించాలన్నారు. గ్రామాల అభివృధ్ధి కోసం డంపింగ్‌ ‌యార్డ్, ‌వైకుంఠదామం, రైతు వేధికలు ఈ నెల చివరి వరకు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అలాగే తడి,పొడి చెత్త వేరు చేయడానికి రెండు రోజుల ట్రెయినింగ్‌ ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. తడి,పొడి చెత్త సేకరణకు గ్రామాలలో చెత్త సేకరణకు చెత్త బుట్టలను పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ రాంరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply