Take a fresh look at your lifestyle.

నీ పై సవారి చేస్తూనే ఉంటాను

నా చేతిలోని కొరడా నీ ఒంటిపై
ఝుళిపించడానికి
నాకున్న బలమేమిటి

బిగించాల్సిన పిడికిలిని బిడియంతో సడలించిన ఫలితమిదని
తెలుసు కుంటేనా?

అజ్ఞానపు మబ్బు తెరలతో మసకబారిన నీ మనోస్థైర్యం
నా చేతలకు బలమిస్తుంటే
నా చేతులు చేష్టలుడిగిన అచేతనా స్దితిలోకి దోర్లుతాయనే
నీ భ్రమలకు నేను బాధ్యునెట్లౌతా

చరిత్రను మలుపు తిప్పిన కరాల సత్తువ
కథలు కథలుగా కళ్ళ ముందు సుడులు తిరుగుతున్న
కదలిక లేని నీ అశక్తతే కదా
నన్ను కఠిన పాషాణంగా మార్చినది

ఉక్కు సంకల్పం ముందు మట్టి కరిచిన ఉన్మాదం
సమాధులు గా మారిన సంకేతాలున్నను
చలించని దుర్బలత్వం
నిన్ను నీడలా వెంటాడుతుంటే
ఆకాశమే హద్దుగా ఎదిగిన నా అధికార బలం
నీ ఆశలను చిదిమేస్తున్న క్రౌర్యానికి
నన్ను నిందించిన ఫలమేమి

నాజీలు నవాబుల చరిత ఆనవాళ్ళుగా
దమన నీతిని పుక్కిట పట్టిన
నా దగాకోరు తనానికి
తాళం వేస్తూ తలలు ఊపే బానిసలు
నీ అస్థిత్వాన్ని సవాల్‌ ‌జేస్తుంటే
నా పై అలక బూనడం లో అర్థమేమున్నది

నీ స్వేదం తో పోగుపడిన సంపదను లాఘవంగా లాగుతున్న
నా ఎత్తుగడలకు చిత్తవుతూ మత్తులో జోగుతున్న నీ వికృత చేష్టలకు కాస్త విరామం ఇచ్చి చూడు

ఆక్టోపస్‌ ‌లా అల్లుకున్న నా ఆకృతికి అంతం పలికే ఆలోచనలు నీ అంతరంగాన్ని పట్టి ఊపిన క్షణాన
నేనెంతో కాలము నిలువననీ నాకు మాత్రము తెలియనిదా?
నీ నిష్క్రియాపరత్వమే నాకున్న బలమని నీకు తెలియనంత కాలం
నీ పై సవారి చేస్తూనే ఉంటాను
– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply