రాష్ట్రంలో పెరుగుతున్న కొరోనా వైరస్ బాదితుల సంఖ్యనుబట్టి చూస్తే మరి కొంతకాలం లాక్డౌన్ పొడిగింపు అనివార్యంగా కనిపిస్తున్నది. దేశ, రాష్ట్రాలతో సంబంధాలను కట్టడిచేసిన నేపథ్యంలో ఒక కొలిక్కివచ్చిందను కుంటున్న కొరోనా వైరస్, లాక్డౌన్ సడలించిన క్రమంలోనే పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. గొలుసుకట్టుగా ఎక్కడినుండో ఎక్కడికో పాకుతున్న దీన్ని సమూలంగా నియంత్రించడం ప్రభుత్వాలకు సాధ్యపడడంలేదు. ఈలాంటి పరిస్థితిలో మరికొంత కాలం లాక్డౌన్ పొడిగించడంతప్ప మరో మార్గంలేదు. దేశంలో నాలుగు విడుతలుగా లాక్డౌన్ను పొడిగిస్తూ పోయారు. మే 30 నాటికి నాల్గవ విడుత లాక్డౌన్ పూర్తి కావాల్సి ఉండగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెరుగుతున్న కొరోనా కేసుల దృష్ట్యా జూన్ వరకు పొగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాగా దేశవ్యాప్తంగా కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఈ వ్యాధికి గురైనవారి సంఖ్య లక్ష 45 వేలుగా నమోదయింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆరున్నర వేలకు పైగా కొత్తగా కేసులు నమోదవడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే మనదేశం కొరోనా కట్టడిలో ప్రగతి సాధించిందని చెప్పుకుంటున్నా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదయిన దేశాల జాబితాలో మొదటి పదవస్థానంలో ఉంది. అన్నిరాష్ట్రాలకన్నా ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నది మహారాష్ట్ర. ఇక్కడ తీవ్రంగా కొరోనా విజృంబిస్తున్నది. ఈ వ్యాధి బారిన ఇప్పటివరకు పదిహేడు వందల మంది మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికంగా దేశ ఆర్థిక నగరంగా చెప్పుకునే ముంబై నగరానికి చెందినవారుకావడం గమనార్హం . ఇంకా ఇక్కడ అనేక కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. విచిత్రకర విషయమేమంటే దేశంలో కొరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్న క్రమంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతూ వొచ్చింది. ఏ ఒక్క వ్యక్తిని అనవసరంగా రోడ్లపై తిరుగకుండా గట్టి పోలీసు భద్రను ఏర్పాటు చేశారు. కాని, కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో లాక్డౌన్ సడలింపులు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఇదే ఇప్పుడు ముప్పును తెచ్చి పెడుతున్నది. లాక్డౌన్ సందర్భంగా ఆర్థిక లావాదేవీలన్నీ స్థంబించిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సడలిస్తూ వొచ్చారు . కాని, సడలిస్తున్నప్పుడు చెప్పిన జాగ్రత్తల పట్ల అటు అధికార యంత్రాంగం కాని, ఇటు ప్రజలు కాని ఏమాత్రం శ్రద్ద చూపించడంలేదన్నది పెరుగుతున్న కేసులను బట్టి స్పష్టమవుతున్నది. వాటితోపాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతూనే ఉంది. ఇదిలానే కొనసాగితే మరో నెల రోజుల్లోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్లు ఓ అద్యయనంలో వెల్లడయింది.
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సిసిఎంబి) అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం ఈవ్యాధి బారిన పడినవారి సంఖ్య లక్షా 45 వేలు కాగా, జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకునే ప్రమాదం ఉందని తమ అధ్యయనం ద్వారా తెలుస్తున్నట్లు చెబుతున్నది. దేశ, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తీవ్ర విఘాతం కలుగటం, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుండడంతో కొన్ని నిబంధనలతో లాక్డౌన్ సడలింపు అనివార్యంగా భావించారు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు అవుతున్న క్రమంలోనే వేలాదిమంది నిబంధనలు ఉల్లంఘించారు. ఇప్పుడు ప్రభుత్వం సడలింపుతో రోడ్లమీద, షాపుల్లో జనం రద్దీ విపరీతమైంది. కనీస దూరాన్ని పాటించడమన్నది లేకుండా పోయింది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేనప్పుడే కాలినడకన తమ ప్రాంతాలకు తరలివెళ్ళడానికి సిద్దపడిన వలసకార్మికుల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేయడంతో కార్మికుల రాకపోకల సందడి ఏర్పడింది. ఇప్పుడు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు వలస కార్యికులవేనన్న వార్తలు వొస్తున్నాయి. ఇప్పుడు విమాన రాకపోకలతోపాటు, అన్ని రాష్ట్రాల్లో రవాణా సదుపాయాలను కలిగించారు. అయితే ఈ మధ్యకాలంలోనే వైరస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరోనా వైరస్ అన్నది ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో పోయే అవకాశాలు లేవంటున్నారు. కనీసం మూడు నాలుగు ఏళ్ళపాటు ప్రజల మద్యనే బతికే అవకాశముందని చెబుతున్నారు. అందుకే కొరోనా తో సహజీవనం చేయకతప్పదం టున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే లాక్డౌన్ పేర ప్రజలంతా ఇంటికే పరిమితమవటం కారణంగా అన్నిరంగాలు దెబ్బతినిపోయాయి. ఉద్యోగులకు ముప్పు ఏర్పడింది. కార్మికులకు పనిలేకుండా పోవడంతో ప్రభుత్వం విధించిన సడలింపు విఘాతంగా మారే ప్రమాదాన్ని సూచిస్తున్నది. అయితే ఈ పరిణామంనుండి బయట పడాలంటే రాత్రిపూట కర్ఫ్యూను అలానే కొనసాగిస్తూనే మరికొంతకాలం లాక్డౌన్ పొడిగించాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర వుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంతకాలం లాక్డౌన్ పొడిగింపు అనివార్యంగా భావిస్తున్నా, అది దేశ వ్యాప్తంగా అమలవుతేనే నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల్లో పూర్తికానున్న నాల్గవ లాక్డౌన్ను మరి కొంతకాలం పొడిగిస్తారా లేక లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ ఇతర నిబంధనలేవైనా కొత్తగా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వాలున్నాయా అన్నది తేలాల్సిఉంది.