Take a fresh look at your lifestyle.

నవ్వు నవ్వించు

“మనిషి ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా అర్థం అయ్యే భాష నవ్వు  మాత్రమే. నవ్వుకు కులం, మతం, ప్రాంతం అనే బేదం లేదు. ప్రతి ఒక్కరిని అందంగా ,ఆనందంగా  ఉంచే ఒకే ఒక ఆయుధం నవ్వు మాత్రమే. ఒక చిరునవ్వు కొత్త వారిని సైతం పరిచయం చేస్తుంది. ఆత్మీయంగా నవ్వితే ఇతరుల మనస్సు మన సొంతమవుతుంది. శత్రువునైనా ఆకట్టుకునేది మన చిరునవ్వు మాత్రమే.”

నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం

‘‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’’ను 1998లో నవ్వు యోగా ఉద్యమ స్థాపకుడు డాక్టర్‌ ‌మదన్‌ ‌కటారియా ప్రారంభించారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. నవ్వడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరు తుందని నిపుణుల అభిప్రాయం. మనిషి ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా అర్థం అయ్యే భాష నవ్వు మాత్రమే. నవ్వుకు కులం, మతం, ప్రాంతం అనే బేదం లేదు. ప్రతి ఒక్కరిని అందంగా ,ఆనందంగా ఉంచే ఒకే ఒక ఆయుధం నవ్వు మాత్రమే. ఒక చిరునవ్వు కొత్త వారిని సైతం పరిచయం చేస్తుంది. ఆత్మీయంగా నవ్వితే ఇతరుల మనస్సు మన సొంతమవుతుంది. శత్రువునైనా ఆకట్టుకునేది మన చిరునవ్వు మాత్రమే. అవ్వడానికి చిన్న నవ్వే అయినా చాలా సందర్భాల్లో పవర్‌ ‌ఫుల్‌ ‌గా పనిచేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో నవ్వు అనేది నేడు అడ్రస్‌ ‌లేకుండా పోయింది. వాట్సాప్‌, ఇన్స్టాగ్రామ్‌,‌ఫేస్‌ ‌బుక్‌ ‌లైక్‌ ‌లలో ఎమోజిగా మాత్రమే నవ్వు కనిపిస్తున్నది.

నిజ జీవితంలో నవ్వు కనుమరుగై పోతున్నది.మన జీవన శైలిలో యంత్రాలు భాగమై నట్లే మన వ్యక్తిత్వంలో కూడా అనునిత్యం యాంత్రికత భాగమైపోయింది. రోజుకు కనీసం నాలుగైదు సార్లయినా నవ్వుతున్నామా అనేది ఆలోచించాల్సిన విషయం. 1950లలో రోజు కనీసం 20 నిమిషాలకు పైగా నవ్వేవారట. ఇప్పుడు కనీసం రెండు మూడు నిమిషాలు నవ్వడం కూడా గగనమైపోయింది. నవ్వు అనేది చాలా చిన్న పనే అయినప్పటికీ మనం చాలా సందర్భాల్లో దాన్ని మరచి పోతున్నాం. గతంలో పరిచయస్తుల్ని చిరునవ్వుతో పలకరించే వాళ్ళం. ప్రస్థుత ఉరుకుల పరుగుల జీవితంలో పరిచయస్తులు కనపడినా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో సభ్యులందరూ ఏదో ఒక సమయంలో ఒకచోట చేరి నవ్వుతూ ఆనందంగా నవ్వు కుంటు మాట్లాడుకునేవారు. నలుగురు స్నేహితులు కలిస్తే నవ్వి నవ్వి దవడలు నొప్పి పుట్టేలా కబుర్లు చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు స్నేహితులు కలిసిన చిరునవ్వుకే దిక్కులేదు.

ఒకచోట కలిసిన ఎవరికి వారే సెల్‌ ‌ఫోన్‌ ‌లలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఆధునిక యుగంలో అలసి పోతున్న మనిషి ఒత్తిళ్లకు లోనై చిరునవ్వు మరచిపోతున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాప్తితో అల్లకల్లోలమైన ప్రజల ఆర్థిక సామాజిక జీవితంలో ఎనలేని మార్పు వచ్చింది. దీనితో మనిషి అనునిత్యం నిరాశా నిస్పృహలకు, ఆందోళనలకు లోనవుతున్నాడు. సంతోషాన్ని,ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. ఇలాంటి సందర్భంలో చిన్న నవ్వు ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి సోపానం అని చెప్పవచ్చు. మానసిక ధైర్యానికి కూడా నవ్వు ఎంతో అవసరం. ఈ ఆపత్కాల సమయంలో నవ్వు యొక్క ఆవశ్యకత ఎంతగానో కలదు.ప్రతి ఒక్కరూ రోజులో కొంత సేపు అయిన నవ్వ వలసిన అవసరం కలదు. మనసు ఆనందంగా, సంతోషంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోజు వారి జీవితంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం కాసేపు ఓ కార్డున్‌ ‌కానీ, జోక్‌ ‌కానీ, కామెడీ సీన్‌ ‌కానీ చూసి నవ్వుకోండి. లేదా కుటుంబ సభ్యులతో ఆనందంగా ,సంతోషంగా నవ్వుతూ గడపండి దానితో ఆ పూటకి సరిపోయే హార్మోన్‌ ‌డోస్‌ ‌విడుదలవుతుంది. మనసంతా ఆనందమయం అవుతుంది .

నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఉద్యోగుల వల్ల 20 శాతం పైగా ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి .మార్కెటింగ్‌ ‌విభాగంలో సిబ్బంది చిరునవ్వుతో అమ్మకాలు చేస్తే ఏకంగా 37 శాతం అమ్మకాలు పెరుగుతాయని నిపుణుల నమ్మకం. నవ్వుతూ సంతోషంగా ఉన్నవారు పనులన్నీ సకాలంలో సమర్థవంతంగా చేయగలుగుతారు ఇలాంటి వారి జీవితంలో మధురానుభూతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సమాజంలోని తోటి మనుషులతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తే మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని ప్రకృతి చికిత్స నిపుణులు అంటుంటారు .లేదంటే కృత్రిమ నవ్వుల కోసం’’లాఫింగ్‌ ‌క్లబ్‌’’ ‌లను విధిగా ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నవ్వు శరీరంలోని ఆక్సిజన్‌ ‌శాతాన్ని పెంచుతుంది. నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది. నవ్వుతూ ఉండే వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. నవ్వు శరీరానికి మనసుకు మంచి వ్యాయామం లాంటిది.

నవ్వు కండరాలను రిలాక్స్ ‌చేసి ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.దానితో పాటుగా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నవ్వు ఎన్నో అనుబంధాలను పెంచుతుంది .అందంగా అలంకరి ంచుకున్న వారి కన్నా అలంకరణ లేకపోయినా చిరునవ్వులు చిందించే వారిలో ఎక్కువ ఆకర్షణ స్థాయి ఉంటుందని వారిని చాలామంది ఇష్టపడతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మనిషిలో ‘‘సంతోషానికి సూచిక చిరునవ్వు’’ చిరునవ్వు ముఖం మీద పరుచుకునేది ఒక్క క్షణమే అయిన దానికి జీవితాన్ని మార్చగల శక్తి ఉంది. తీరని నిర్వేదంలో ఉన్న వ్యక్తి కాసేపు నవ్వితే అతడి ఆలోచన మారవచ్చు. తీసుకునే నిర్ణయాలు మారవచ్చు.అవి అతడి జీవితాన్ని మార్చవచ్చు. అందుకే నవ్వండి నవ్వించండి అంటున్నారు నిపుణులు మరియు సామాజిక వేత్తలు. – పుల్లూరు వేణుగోపాల్‌ 9701047002

Leave a Reply