Take a fresh look at your lifestyle.

నవరత్నాలు

Andhra Pradesh Chief
వృద్దులకు ఇంటివద్ద పెన్షన్‌ అం‌దిస్తున్న చిత్రం

ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు అందించిన సేవలు, చూరగొన్న ప్రజాదరణ ఆయనకు పరోక్షంగా ఉపయోగపడి ఉండవచ్చు. తండ్రి ఉండగా కడప ఎంపీగా వ్యవహరించిన జగన్‌కు మంత్రిగా ఎటువంటి అనుభవం లేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన అసెంబ్లీకి కానీ, సచివాలయానికి కానీ ఎన్నడూ రాలేదు. బెంగళూరులో ఉండేవారు.అయినప్పటికీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయిల ఆస్తులను సంపాదించారంటూ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రతిపక్షాలే కాకుండా, కాంగ్రెస్‌లో అధిక సంఖ్యాకులు అభాండాలు వేసి వ్యతిరేక ప్రచారం చేయడంతో, ఆయన ప్రారంభించిన ఓదార్పు యాత్రలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ ‌నుంచి వైదొలగి వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నెలకొల్పారు. దాంతో ఆయనను అవినీతి కేసులు పెట్టి జైలుకి పంపారు. ఆ కేసుల్లో ఇప్పటివరకూ ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఆయనపై కేసులు పెట్టిన సీబీఐ అధికారి గత పార్లమెంటు ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత జగన్‌ ‌నిత్యం ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటూ వారి సమస్యలను చాలా దగ్గర నుండి చూశారు. 3,600 పైగా కిలోమీటర్లు ఇడుపులపాయి నుంచి ఇచ్ఛాపురం వరకూ పాద యాత్ర చేసి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకున్నారు. ఆ సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు జేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రణాళికలో వాటిని చేర్చారు. ఇలా అందరూ చేరుస్తారు కానీ, పార్టీ ప్రణాళికలోని వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాలన్న దృఢ సంకల్పం, పట్టుదల ప్రదర్శిస్తుండటం వల్లనే జగన్‌ను ప్రజలు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయి. ఆయన ప్రకటించిన నవరత్నాల్లో ఇప్పటికే చాలా వరకూ అమలులో పెట్టారు.

Andhra Pradesh Chief2
దివ్యాంగులకు ఇంటివద్ద పెన్షన్‌ అం‌దిస్తున్న చిత్రం

నవరత్నాలంటే ఏమిటి
నవ్వితే నవరత్నాలు అని తెలుగులో నానుడి ఉంది. నవరత్నాలు ప్రజల ముఖాల్లో ఆనందాన్ని తెస్తాయని స్థూలంగా అర్ధం చెప్పుకోవచ్చు. ప్రజలను సంతోష పెట్టడమే పాలకుల బాధ్యత. వాగ్దానాలను అమలు జేసే వారే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ‌ప్రమాదంలో దుర్మరణం పాలై పదకొండేళ్ళు కావస్తున్నా, ఆయన గురించి ఇప్పటికీ ప్రజలు ఎంతో ప్రేమాస్పదంగా చెప్పుకుంటుంటారు. తండ్రి కీర్తిని నిలబెట్టడమే కాకుండా, అంతకన్నా ఎక్కువ ప్రజాభిమానాన్ని పొందడానికి జగన్‌ ‌నవరత్నాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలులో పెట్టారు. ఆయన మీద నమ్మకంతోనే గత ఎన్నికలో ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అసెంబ్లీలోని 175 సీట్లలో 151 సీట్లను వైసీపీకి అందించారు. ఇంతటి ప్రజాభిమానం ఉన్న నాయకులు ఇప్పట్లో ఎవరూ లేరు. ప్రజల అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి జగన్‌ ‌నవరత్నాలను అమలులో పెడుతున్నారు. ఆయన మాటకు నిలబడే వ్యక్తిగా ప్రజలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. దాంతో ప్రతిపక్షాలు ఓర్వలేక ఆయనకు అడుగడుగునా అడ్డుపడుతూ ఆయన చేపట్టిన ప్రతికార్యక్రమంలోనూ కంతలు వెదుకుతున్నారు.

రాజధాని సమస్య
రాష్ట్రంలోని మూడుప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతోనే మూడురాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. ఇది జగన్‌ ‌సొంత అభిప్రాయం కాదు జిఎన్‌ ‌రావు నేతృత్వంలోని కమిటీ, బోస్టన్‌ ‌కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీదికి తెచ్చింది.అయితే, దీనిని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌వ్యతిరేకిచడమే కాకుడా జగన్‌పై బురదజల్లుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ ‌రాజధానిగానూ, కర్నూలును జ్యుడిషియల్‌ ‌రాజధానిగానూ, అమరావతిని లెజిస్లేటివ్‌ ‌రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం, ఇతరపార్టీలు రైతులను రెచ్చగొట్టి నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేయిస్తున్నాయి. కాగా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం ముందు నిర్ణయించిన తేదీల ప్రకారమే జగన్‌ ‌నవరత్నాలను అమలు జేస్తున్నారు.నవరత్నాల్లో ముఖ్యమైనవి….రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌, ‌రైతుల కోసం మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆక్వారైతులకు యూనిట్‌కు రూపాయికే కరెంట్‌, ‌రైతులకు 12,500 వంతున నాలుగు దఫాల్లో 50 వేల రూపాయిలు పంపిణీ, రైతుల కుటుంబాలకు ఏడు లక్షలతో బీమా, రైతులకు సున్నా వడ్డీతో రుణాలు, వైద్యం ఖర్చు వెయ్యి దాటితో ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకుని రావడం ముఖ్యమైనవి. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచారు. మరిన్ని రోగాలకు, సమాజంలో మరిన్ని వర్గాలకు వర్తించేరీతిలో దీనిలో మార్పులు చేశారు. ఆరోగ్య శ్రీ వల్లే రాజశేఖరరెడ్డికి మంచి పేరు వచ్చింది. ఆయన హయాంలో ఆరోగ్య శ్రీ పథకం కింద ఎంతో మంది గుండె ఆపరేషన్లు చేయించుకున్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా జగన్‌ ‌ప్రభుత్వం ప్రత్యేక చికిత్సనూ, సందుపాయాలను కల్పిస్తోంది. ఇందుకు గాను శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కిడ్నీసహా దీర్ఘ కాలిక రోగులకు నెలకు 10వేల రూపాయిల పెన్షన్‌, ‌వృద్ధాప్యపు పెన్షన్‌ను 2,500లకు పెంపు, పెన్షన్‌ అర్హత 65 సంవత్సరాల నుంచి 60సంవత్సరాలకు తగ్గింపును గత వారం అమలు చేశారు. పెన్షన్‌ను లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దనే చెల్లించే ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా ఈ పద్దతి లేదు, దళారీల బారిన వృద్ధులు పడకుండా ఈ పద్దతిని ప్రవేశపెట్టారు. లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ హామీలో ఇప్పటికే అమలులో పెట్టారు. ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళ నిర్మాణం చేస్తామని వాగ్దానం చేశారు. సంవత్సరాది నాటికి లక్ష ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడులకు పంపే పథకం కింద తల్లులకు 15 వ్ఱేల రూపాయిల ఆర్థిక సాయం అందించనున్నారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ ‌టెండరింగ్‌ ‌ద్వారా వెయ్యి కోట్లు ఆదా చేశారు. ఇంకా ఇతర పథకాల్లో కూడా రివర్స్ ‌టెండరింగ్‌ అమలు ద్వారా ప్రభుత్వ నిధులను ఆదా చేశారు. పిల్లలకు మద్యాహ్నభోజన పథకం కింద నాణ్యమైన బియ్యంతో, గుడ్లు, కూరగాయలతో ఆహారం సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అదే గ్రామంలో పది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. బీసీల అభ్యున్నతికి ఏడాదికి 15వేల కోట్ల చొప్పున ఐదేళ్ళలో 75 వేలకోట్లను కేటాయించనున్నారు. ప్రమాద వశాత్తు మరణించిన మత్స్య కారుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ ‌గ్రేషియా, మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి 24 వేల రూపాయిల ప్రోత్సాహం చిరు వ్యాపారులకు గుర్తిపు కార్డులు, సున్నా వడ్డీకి పదివేల రుణం అందిస్తున్నారు. పథకాల అమలుకు 56వేలకోట్ల రూపాయిలు ఖర్చు కానుంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. శాశ్వతప్రాతిపదికపైన బీసీ కార్పొరేషన ఏర్పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్‌ ఏర్పాటు, అర్చకులకు రిటైర్మెంట్‌ ‌విధానం రద్దు, మొదలైన వాగ్దానాల అమలుకు జగన్‌ ‌చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. అన్నింటికన్నా పేద ప్రజలకు ఆంగ్ల భాషలో బోధన జరిపించేందుకు. జగన్‌ ‌తీసుకుంటున్న చర్యలు విద్యాధికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. ఆంగ్ల మాధ్యమం ఉన్నా, తెలుగు తప్పని సరి అని జగన్‌ ‌పదే పదే స్పష్టం చేస్తున్నా, ప్రతిపక్ష తెలుగుదేశం ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటోంది.

పేదలకు నేరుగా వారింటి వద్ద పింఛన్‌ అం‌దించే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు జగన్‌ ఎం‌తో ఆనందాన్ని వ్యక్తంచేశారు. ‘ఇది నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పేదల కోసమే ప్రభుత్వం పథకాలను అమలు జేయాలన్న నియమాన్ని తు.చ తప్పకుండా అమలు జేస్తున్నది జగన్‌ ‌ప్రభుత్వమే. దళారుల వ్యవస్థ రద్దు కోసమే పించన్లు ఇళ్ళకు అందించే ఏర్పాటు చేశారు. పొరుగురాష్ట్రాలతో తగాదాల వల్ల నష్టపోవల్సి వస్తోందన్న వాస్తవాన్ని అవగతం చేసుకోవడం వల్లే తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలు, కుల విద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు. బ్రాహ్మణులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఎస్టీల కార్పొరేషన్‌ ‌బిల్లును, ఆంగ్లమాధ్యమం బిల్లును శాసనమండలిలో ప్రతిపక్షం అడ్డుకుంది. అలాగే, మూడు రాజధానుల బిల్లును అడ్డుకుంది. అందుకే మండలి రద్దుకు అసెంబ్లీ చేత తీర్మానాన్ని ఆమోదింపజేశారు.అయితే, మండలిలో మెజారిటీని ఉపయోగించుకుని తెలుగుదేశం అడ్డుకుంది. ఆ బిల్లును సెలక్టు కమిటీకి పంపింది. అడుగడుగునా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సృష్టిస్తున్న అవరోధాలను దాటుకుని జగన్‌ అభివృద్ధిపథంలో అడుగులు వేస్తున్నారు. తనది పేదల ప్రభుత్వమన్న మాటను అక్షరాలా అమలు చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గతంలో అమలు జేసిన పథకాల కన్నా మరో అడుగు ముందుకు వేసి నిరుపేద వర్గాలకు మేలు చేకూర్చే కార్యక్రమాలను జగన్‌ అమలు జేస్తున్నారు. ఆయనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నా, ప్రజల అండదండలు ఉన్నాయి.ఆ ధైర్యంతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు.

Leave a Reply