Take a fresh look at your lifestyle.

పీడిత ప్రజల గొంతుక మహాకవి దాశరథి

“చలిగాలిని చెలిగాలి తో పోలుస్తూ.. అది చిరు వెచ్చదనాన్ని గుండెలలో నింపితే ఎలా ఉంటుందోనని తన పక్కన ఉన్న స్నేహితుడు జంగారెడ్డిని చెలికాడ అని సంబోధించాడట, అయితే జంగారెడ్డి చావ బోతుంటే పద్యాలు ఏంటయ్యా కవి అని అనగానే దాశరథి అన్నాడట ….ఇక్కడ కాగితం లేదు ,కలము లేదు ,దీపం లేదు ..కానీ గళం ఉంది ,కోపం ఉంది .మృత్యువు ముఖాన ఉమ్మేసి శాశ్వత చైతన్య పదాల మీద అమర ప్రయాణం చేయాలనే తెగువ ఉంది. ఇక దిగులేల? మనం బ్రతకడానికి కాదు కదా! ఉద్యమంలో దూకింది..”

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారగా మలిచి నిరంకుశ పాలన పై తన పదునైన పద్యాలు ఆయుధంగా ఎక్కుపెట్టి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ధీరుడు, తెలుగు సమాజంలో ,తెలుగు సాహిత్యంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని మహాకవి, కొందరి దృష్టిలో అభ్యుదయ కవి ,మరి కొందరి దృష్టిలో అద్భుత సినీ కవి గా, మొత్తం మీద అందరి దృష్టిలో మహాకవి గా పేరుగాంచిన ప్రజల కవి, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటి చెప్పిన విప్లవ దివిటీ దాశరథి కృష్ణమాచార్యులు… ఆయన ఎంత గొప్ప కవో ,అంత గొప్ప ప్రజాస్వామికవాది, స్వతంత్ర సమరయోధుడు , తాడిత,పీడిత ప్రజల గొంతుకైన దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్‌ ‌జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో దాశరథి వెంకటమ్మ, వెంకటాచార్యులు దంపతులకు జన్మించారు. వీరి సోదరుడు దాశరథి రంగాచార్యులు కూడా గొప్ప కవి. దాశరథి బాల్యం అంతయు ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది . ఉర్దూలో మెట్రిక్యులేషన్‌, ‌భోపాల్‌ ‌యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ . ఇంగ్లీష్‌ ‌లిటరేచర్‌ ‌చదివారు. సంస్కృతం ,ఆంగ్లం మరియు ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా దాశరధి చిన్నతనం నుండి పద్యం అల్లడంలో మహా దిట్ట… ఒకవైపు బ్రిటిష్‌ ‌వలస పాలన ,నిజాం నిరంకుశ పాలనలకు వ్యతిరేకంగా సాహితీ క్షేత్రంలో కృషి చేయగా మరోవైపు ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో నిజాం అనిచివేతలు ఎదిరించి ప్రజలతో కలిసి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న మహనీయుడు. ఏకకాలంలో సాహితీవనంలో , పోరుబాటలో రెండింటిలో పాల్గొన్న సవ్యసాచి మన దాశరథి.. నిజాం రాజు పాలన, రజాకార్ల రాక్షసత్వం, దోపిడీలు , గృహ దహనాలు,దారుణ మారణకాండ చూసి చలించిపోయి…

మా నిజాము రాజు తరతరాల బూజు ….అంటూ రాజు పరిపాలన వదిలిపెట్టాలని ఎద్దేవా చేస్తూ పద్యం అనే కత్తికి రెండు వైపులా పదునే ఉంటుందని నిరూపించిన ఏకైక కవి దాశరధి… బ్రతుకు భారంతో కుంగిపోతున్న పేదవాళ్ళు ఉన్న ఈ లోకానికి అగ్గిరాజెసి ఇప్పుడున్న అసమ సమాజానికి బదులుగా తన మనసులో మెదిలాడు ఊహలకు రూపాన్నిచ్చి నవ సమాజాన్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఆకలితో బాధపడే పేదల తలరాతలు మారాలని తలచి జీవిత కాలం శ్రామికులకు కార్మికులకు బాధితుల పక్షాన కష్టం వచ్చినప్పుడు వారికి చేదోడువాదోడుగా వారి పక్షాన నిలిచిన కవి యోధుడు.. నైజాం రోజులలో వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైల్‌ ‌లో ఉన్న రాజకీయ ఖైదీల అందరికీ తమ తమ వస్తువులు సర్దుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశం, ఉన్నఫళాన రాజకీయ ఖైదీల అందర్నీ మూట ముల్లె సర్దుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో గుండెల్లో గుబులు పుట్టింది. రాత్రికి రాత్రి ఏ అడవికో తీసుకెళ్లి చంపేస్తారేమో అని భయంతో ఖైదీలు అందరూ సామాన్లు సర్దుకుని జైలు బయట ఉన్న వ్యాన్లు ఎక్కారు .30 మంది ఖైదీలు ఉంటే 60 మంది సాయుధ పోలీసులు కాపలా గా ఉన్నారు. ఎన్నో రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు గా ,బయట చలి గాలి తాకగానే దాశరథికి ఉత్సాహం వచ్చింది .చలి గాలి అన్న పదం తో ప్రారంభమయ్యే కంద పద్యాలు ఆశువుగా చెప్ప నారంభించాడు.

చలిగాలి పలుకు వార్తలు
చెలి గాలిని బోలి వలపు చిరు వెచ్చదన మ్ములు గుండెలలో నింపెను మా
చెలి కాడ! జైలు బయట చిత్తమ్మలరేను
ఈపద్యంలో చలిగాలిని చెలిగాలి తో పోలుస్తూ.. అది చిరు వెచ్చదనాన్ని గుండెలలో నింపితే ఎలా ఉంటుందోనని తన పక్కన ఉన్న స్నేహితుడు జంగారెడ్డిని చెలికాడ అని సంబోధించాడట, అయితే జంగారెడ్డి చావ బోతుంటే పద్యాలు ఏంటయ్యా కవి అని అనగానే దాశరథి అన్నాడట ….ఇక్కడ కాగితం లేదు ,కలము లేదు ,దీపం లేదు ..కానీ గళం ఉంది ,కోపం ఉంది .మృత్యువు ముఖాన ఉమ్మేసి శాశ్వత చైతన్య పదాల మీద అమర ప్రయాణం చేయాలనే తెగువ ఉంది. ఇక దిగులేల? మనం బ్రతకడానికి కాదు కదా! ఉద్యమంలో దూకింది .జంగారెడ్డి భయపడకు ,చావు కూడా పెళ్లి లాంటిదే నని ఏకబిగిన చావుకు ఎదురుగా 27 పద్యాలను అశువుగా చెప్పాడట. విక్రమార్క దేవ చరిత్రను రాసిన బిల్వహనుడులా దాశరథి తన సహచరులను ఉద్దేశించి చైతన్య పరచడం జరిగింది. దాశరథి కవిత్వాలు చాలా సునాయాసంగా పండితుల నుండి నుండి పామరుల వరకు అర్థం చేసుకోవచ్చు. తన అగ్నిధార కావ్య ఖండికలో మానవ పరిణామాన్ని అద్భుతంగా వివరించారు. అదేవిధంగా దాశరథి ఉపాధ్యాయుడిగా ,పంచాయతీ ఇన్స్పెక్టర్‌ ‌గా ,ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. .సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేశారు .సినిమా పాటలు, కథలు, నాటికలు, కవితలు ఎన్నో రాశాడు. ఆయన రాసిన కవితా సంపుటాల లో అగ్నిధార ,మహాంధ్రోదయం ,రుద్రవీణ మార్పుల నా తీర్పు ,ఆలోచనలోచనలు ధ్వజమెత్తిన ప్రజ ,కవితాపుష్పకం, తిమిరంతో సమరం ,నేత్రపర్వం ,పునర్నవం గాలిబ్‌ ‌గీతాలు ప్రసిద్ధి చెందినవి. 1961లో ఖుషి ఖుషి గా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అంటూ …ఇద్దరు మిత్రులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్య సేవ చేశారు. వారు చేసిన సాహితీ సేవకు 1967లో ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ బహుమతి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, ఆంధ్రప్రదేశ్‌ ‌విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డి.లీట్‌ అవార్డులు లభించాయి. 1977 ఆగష్టు 15 నుండి 83 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఆస్థానకవిగా పనిచేశారు.

ఆనాడు దాశరథి తెలంగాణ విముక్తి కోసం ఏ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారో ప్రస్తుత సమాజంలో కూడా ఆ సమస్యలే ప్రజలను పట్టి పీడిస్తుండటం బాధాకరం… రాజులు సంస్థానాధీశుల తో నిండిన గత చరిత్ర నుండి నేటి వర్తమాన సమాజం వరకు యుద్ధాల వలన అనేక మంది ప్రజలు బలి అవుతూనే ఉన్నారు. అలాగే కులాల మతాల పేరిట అనేక మంది అమాయకులు బలహీన వర్గాలకు చెందిన వారు హత్యలు చేయబడుతుండటం , ఆకలి కేకల ఆక్రందనలతో సతమతమవుతుండటం లాంటి సమస్యలు నేటికి కొనసాగుతుండటం ఒక చారిత్రక వాస్తవం. దాశరథి ఆశించినట్లు విముక్తి సాధించిన తర్వాత తెలంగాణ రైతులకు చెందాలని, అలా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వాలు దృష్టి సారించి వ్యవసాయ రంగం పైన, రైతుల సమస్యల పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉండగా, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత విధానాలతో రైతులను ఆఘాతం లోకి నెట్టి వేసే విధంగా చర్యలు ఉండటం బాధాకరం.. దాశరథి ఏకరువు పెట్టిన సమస్యలు, బాధలను పరిష్కరించే దిశగా మంచి పాలన లక్ష్యంగా ఉండాలని అన్నార్తులు ,అనాధలు ఉండని ఆ నవయుగమదెంత దూరం అంటూ కరువు కాటకాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ,కలిగించకుండా పాలన సాగాలని భారత పౌరులు భవిష్యత్తుకు భరోసా ఉండాలని కాంక్షించాడు . తల్లడిల్లుతున్న తెలంగాణ తల్లి గాయాలను మాన్పే0దుకు అగ్నిధార కురిపించి రుద్రవీణ లు పలికించి తన 62 సంవత్సరాల జీవన ప్రస్థానం లో నిరంతరం తెలంగాణ ధ్యాస తోనే శ్వాసించిన సాహితీ స్రవంతి ,కవి సింహం , అభ్యుదయ కవితా చక్రవర్తి సారధి ,ఆంధ్రకవితా సారధి దాశరథి 1987 నవంబర్‌ 5 ‌న కన్నుమూశారు. ఆ మహాకవి భౌతికంగా దూరమైనా సమాజ హితం కోసం పరితపించి, తన కవిత కావ్యాలతో పీడిత ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటి, వాటి పరిష్కారం కోసం, .కలలు కన్న నవయుగం కోసం మనమందరం పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
– తండ సదానందం, టీ పీ టి ఎఫ్‌ ‌జిల్లా ఉపాధ్యక్షుడు మహబూబాబాద్‌ ‌జిల్లా

Leave a Reply