Take a fresh look at your lifestyle.

నవ యుగ శరథి దాశరథి.. నేడు దాశరథి జయంతి

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి దాశరథి కృష్ణమాచార్యుల జీవిత సారానికి అద్దం పడుతోంది. నూనూగు మీసాల ప్రాయంలోనే పాండిత్యంపై అపార తెలివితేటలు సంపాదించిన జ్జాని. అన్యాయం, అక్రమం, ధౌర్జన్యాలను ఎదురించే తత్వం కలిగిన ధీశాలి దాశరథి. తెలంగాణ స్వాప్నికుడు, నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు , స్వ రాష్ట్ర సాధనకు కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకున్న పోరాడిన ఘనుడు. నవ భారత యువకులారా.. కవులారా కథకులారా భవితవ్యపు హవనానికి హూతలు నూతన భూతల నిర్మాతలు మీరే. మీరేనని విజయ గీతికను వినిపించాడు. అందుకే ఈ నవయుగపు కవితా శరథిలా మారాడు దాశరథి కృష్ణమాచార్యులు. జులై 22 ఆయన జయంతి సందర్భంగా..

జననం… విద్యాభ్యాసం..
మహబూబాబాద్‌ ‌జిల్లా ప్రస్తుత చిన్నగూడూరు మండలం కేంద్రంలో దాశరథి కృష్ణమాచార్యులు , వెంకటాచార్యులు- వెంకటమ్మ పుణ్యదంపతులకు 1925 జులై 22న జన్మించారు. పూర్వికులు భద్రాచలం పరివాహక ప్రాంతంలో నివసించారు. తల్లిదండ్రుల ప్రొత్సహంతో సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు . ఖమ్మం జిల్లాలోని ఉస్మానియా పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. ఇంటి వద్ద సంసృతంపై అవగాహన పెంచుకుంటూ పాఠశాలలో ఆంగ్లం, ఉర్దూ భాషలపై పట్టుసాధించారు. సంసృతం, తెలుగు భాషలను అమితంగా ఇష్టపడేవారు. బాల్యదశలోనే ఆయన చదువుకుంటున్న పాఠశాలలో ప్రతి రోజు ఉర్దూలో ప్రతిజ్ఞ చేయించడాన్ని వ్యతిరేకించాడు. తెలుగు విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, తెలుగు విద్యార్థులతో ఉర్దూలో ప్రతిజ్ఞ ఏమిటని ఉపాధ్యాయులను ప్రశ్నించిన తీరు తోటి విద్యార్థుల్లో సైతం ఆవేశభావాలను కల్పించాడు. ఇలా ఆయనకు పాఠశాల స్థాయినుంచే ఎదురించే మనస్తత్వం కలిగి ఉండేది. విద్యార్థి దశలో మంచి క్రీడాకారుడిగా ఉస్మానియా పాఠశాలలో నిర్వహించిన బస్తా పరుగులో పాఠశాల స్థాయిలో నెగ్గి ఆ తరువాత జిల్లా స్థాయి(వరంగల్‌) ‌పోటీలకు హాజరయ్యారు.

ఉద్యమ స్వభావి..
1940 సంవత్సరంలో అతని మెట్రిక్యులేషన్‌ అయిపోయింది. ఆతరువాత తెలంగాణ ఉద్యమంపై ఆకర్శితులయ్యారు. చదువుకునే రోజుల్లోనే తిరుగుబాటు ధోరణి ఉన్న ఆయన దృష్టి రాజకీయ పార్టీలపై పడింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ పార్టీలు ప్రముఖ పాత్ర పోషించేవి. ఈ రెండు పార్టీలు ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో సదరు పార్టీలను ఆ సమయంలో అప్పటి నిజాం రాజు వాటిని నిసేధిస్తున్నట్లు పర్మాణాను జారీ చేశారు. దీంతో దాశరథి పలువురు తెలంగాణ వాదులు అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. నిజాంకు వ్యతిరేకంగా అనేక గేయాలు రాశారు. అందులో ఒకటి‘‘ అనాదిగా సాగుతోంది- అనంత సంగ్రామం అనాథునికీ ఆగర్భ-శ్రీనాథుడికి మధ్య సేద్యం చేసే రైతుకు -భూమిలేదు పుట్రలేదు రైతుల రక్తం త్రాగే-జమీందార్ల కెస్ట్రేట్లు కర్షకులు కార్మికులు మధన పడే మేధావులు తమ శ్రమకు తగిన ఫలం ఇమ్మంటే తిరుగుబాటు. షావుకారు వడ్డీలకు జమీందార్ల హింసలకు వేగలేక ఆగలేక – తిరగబడితే అతివాదం’’ ఇలా అనడంలో దాశరథి సామ్యవాద దృక్పథం స్పష్టమవుతోంది. శ్రామిక జాతి పక్షం వహించి ఆయన రాసిన ‘రుద్రవీణ’లో సమరగీతిలా ప్రవచించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్యాయంపై అక్షర శస్త్రాలను ఎక్కుపెట్టిన విలుకాడు అతడు. దోపీడీ పాలనపై అలుపెరగని పోరు సల్పిన ఉద్యమకారుడు. నిజాం, భూస్వామ్య పాలనపై ధిక్కార స్వరం వినిపించారు. తెలంగాణ సమాజపు చారిత్రక పరిణామంలో ప్రగతిశీలమైన పాత్రను నిర్వహించిన దాశరథి చరితార్థమైన సంఘటనలను వెలువరించారు. ఇలా వెలువరించిన ‘ అగ్నిధార’ కవిత ప్రజా హృదయాల్లో సజీవమై, శాశ్వతంగా భాసించింది.

ఓరుగల్లు వేదికపై రాళ్ల వర్షం..
1944లో ఓరుగల్లు జిల్లాలో ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవం కవి సమ్మేళనాన్ని ఆపేందుకు రజాకారులు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు, కవులు వేదికపై ఆసీనులై ఉన్నారు. కవి సమ్మేళనం ప్రారంభానికి వేదిక సిద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా సభా ప్రాంగణంలోకి రజాకారులు ప్రవేశించారు. వేదిక దగ్గరలో ఉన్న పందిర్లను తగులబెట్టారు. ఓ వైపు అగ్ని జ్వా)లా ఎగిసిపడుతోంది. ఈ నేపథ్యంలో కవులు జ్వాలలో ఆహుతి అయిపోతాము కాని కవి సమ్మేళనం ఆపే ప్రసక్తి లేదని భీష్మించుక కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో దాశరథి అందుకున్నారు ఓ పద్యరూపం.. ఓ పరధీను మానవా.. ఓపరాని దాస్యం విధల్చలేని శాంతమ్ము మాని తలపులను ముష్టిబంధాన కలచి వలచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్రమ్ము స్వర పురమ్ము…. ఇలా ధారాళంగా పద్యాలు చదువడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మరో కవి సురవరం ప్రతాపరెడ్డి సభకు అధ్యక్షత వహిస్తున్నారు. దాశరథి పద్యాన్ని ఉద్ధేశిస్తూ ఇలా అన్నాడు. .. నాయనా దాశరథి… సింహపు గర్జన చేశావు అంటూ కీర్తించారు. దాశరథిని స్ఫూర్తిగా తీసుకున్న ఇతర తెలుగు కవులు పద్యాలు పాడుతూ ప్రజలను ఉత్తేజపరచారు. ఓ వైపు మరో మారు రజాకారుల వేదికపైకి రాళ్లు రువ్వుతున్నారు. రజాకారులు వేస్తున్నవి రాళ్లు కావు అవి పూలుగా భావించాలని చెబుతూ కవులకు భరోసానిస్తూ, మీరు ధిక్కార కవితా గళాలను వినిపించాలని దాశరథి కవులను చైతన్యపరచిన తీరు ప్రజ)ను ఆకర్శించింది. బీభత్సమైన ఈ పోరాటంలో చివరకు రజాకారులు వెనుతిరిగారు.

ఇదే సంవత్సరంలో మానుకోట తాలూకా(ఇప్పటి మహ బూబాబాద్‌) ‌జిల్లాలోని మారుమూల గ్రామమైన జయ్యారంలో ఆంధ్రమహాసభ నిర్వహించారు. ఈ సభకు కవులు, మేథావులు హాజరయ్యారు. ఇక్కడే నిజాంకు వ్యతిరేక నినాదాల బీజం పడింది. ఓ వైపు స్వాతంత్య్రపోరాటం, మరో వైపు నైజాం పాలన విముక్తి అనే అంశంపై హోరాహోరిగా పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జయ్యారం గ్రామ వాసులు, ఇతర కవులు, తెలంగాణ వాదులు ముక్తకంఠంలో నిజాం ముర్దాబాద్‌ ‌నినాదాలు చేస్తూ మరో వైపు మహాత్మగాంధీజీకి జిందాబాద్‌ ‌నినాదాలు చేశారు. ఇదే సమయంలో రజాకారులను తమ గ్రామానికి అడుగుపెట్టనివ్వబోమని స్థానిక ప్రజలు ప్రతినబూనారు. సభ ముగిసేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. అదే రోజు దాశరథి పక్కనే ఉన్న చిన్నగూడూరుకు కాలినడకనే బయలు దేరారు. చిన్నగూడూరుకు చేరిన విషయం గూఢచారుల ద్వారా నిజాం ప్రభుత్వానికి తెలిసింది. అక్కడే దాశరథిని బంధించి తీసుకెళ్లారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో బంధించారు. ఖైదీ ముద్రవేసి దాదాపు పది మైళ్ల దూరం నడిపించారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ ‌నుంచి వరంగల్‌ ‌జైలు తరలించే క్రమంలో పోలీసుల కళ్లుగప్పి దాశరథి తప్పించుకున్నారు .నిజం సైన్యం వెంబడించినా వారికి దొరకకుండా వెళ్లిపోయారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1947 అజ్ఞాత వాసంలో ఉంటూ కవిత్వం రాసేవారు. ఆ రోజుల్లో హిందువులను ముస్లింలుగా మార్చడానికి నిజాం రాజు చేస్తున్న ప్రయత్నాన్ని స్వామి రామానందతీర్థ అడ్డుకున్నారు. వ్యతిరేకించారు. ఆయన నాయకత్వంలో అజ్ఞాతంలో ఉండి కూడా కవితలను వినిపించారు దాశరథి. ‘ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను కదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను జగత్తంతా రగుల్కొన్న కృధా జ్వాలా వృధా పోదు.. దగాకోరు బడా చోరు రజాకారు పోషకుడవు దిగిపొమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్‌ ‌తెగిపోనోయ్‌ ’ ‌ప్రేక్షకుడి వలే కాక ప్రజల కష్టనిష్టూరాలతో తానొకడుగా కలిసిపోయాడు. అజ్ఞాతవాసం గడిపిన అనంతరం భారత స్వాతంత్య్రానికి ముందు 1947 ఏప్రిల్‌మాసం నుంచి మొదలుకొని 16 నెలలు పాటు జైలు జీవితం గడిపారు.

వట్టికోట అళ్వారు స్వామి తో పరిచయం..
1948లో దాశరథితో పాటు మరో ముప్పై మంది ఖైదీలను వరంగల్‌ ‌జైలునుంచి నిజామాబాద్‌ ‌జైలుకు తరలించారు. అక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదట ఆయనకు కనిపించిన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి. ఆ సమయంలో అళ్వారు చిన్నటోపీ పెట్టుకుని చాలీచాలని గీట్ల అంగీ(చొక్కా) వేసుకుని నీళ్ల పంపు వద్దకు వచ్చాడు. నీళ్ల పంపు వద్ద ఏర్పడిన పరిచయం తెలంగాణ సాధన, నిజాం పాలన విముక్తి కోసం పథకాలు వేసేవారు. ఆళ్వారు కవులంటే అమితమైన అభిమానం.. ఆయనకు నిజాంకు వ్యతిరేకంగా రాసిన విప్లవాత్మక రచనల కోసం కుతూహలపడేవారు. విప్లప రచనలపై ఆమితమైన ఆసక్తి కనబరుస్తూ కవులను మరో మారు వినిపించాలని కోరేవారు. వట్టికోట ఆళ్వారుస్వామి కోరిక మేరకు .. దాశరథి నిజామాబాద్‌ ‌జైల్లో పలు కవితలను గోడలపై రాసి నిరసన వ్యక్తపరచేవారు. ఓ రోజు జైలు గోడపై ‘ ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలిన రాజు మా కెన్నడేని తీగెలను తెంపి అగ్నిలోకి దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఓ పద్యం రాశాడు. ఈ పద్యాన్ని ఆళ్వారు కంఠస్తం చేశారు. గోడ మీద రాసిన పద్యాన్ని జైలు అధికారులు చెరిపేవారు. ఇలా చెరవడం వారి వంతు అయితే ఇదే పద్యం మరో గోడమీద ప్రత్యక్ష్యం కావడం మరో వంతు.. ఇలా రాసిన పద్యాలు దాశరధి రాస్తున్నారని జైలు అధికారులు భావించేవారు. చివరకు ఈ పద్యం ఎక్కువ సార్లు రాసింది ఆళ్వారు అని జైలు అధికారులు గ్రహించారు. ఇలా మూడు నెలల పాటు వారిరువురు నిజామాబాద్‌ ‌జైల్లో గడిపారు. చివరకు అళ్వారు గుల్బర్గా జైలుకు, దాశరథిని హైదరాబాద్‌ ‌జైలుకు పంపించారు. ఆళ్వారు మరణించినా .. దాశరథి హృదయపలకంపై నిలిచి ఉంటాడని ఆయన అభిప్రాయం. వారిద్దరు స్నేహానికి గుర్తుగా అగ్నిధార కవితను అంకితమిచ్చారు.

 

Today is Dasharathi Jayanti

ఆకాశవాణి నుంచి చిత్రరంగం వైపు..
ఎన్నో జీవన సంఘర్శనలు ఎదుర్కొన్న కవితాచార్యుడు తదనంతరం చలన చిత్రరంగం వైపు దృష్టి మరల్చాడు. సిని కవిగా, విప్లవకవిగా, ప్రజాకవిగా, మధుర కవిగా కవితాభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. దాశరథి 1960లో చిత్రసీమ ప్రవేశం చేశారు. 1960 నుంచి 1980 వరకు చిత్ర పరిశ్రలో దాదాపు 600 పాటలను స్వయంగా రచించారు. ఖవ్వాలి పాటలు రాయడంలో ఆయన దిట్ట. ఇద్దరు మిత్రులు సినిమాలో ‘నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి’ అనే పాట మొదటిది. వీటితో పాటు దాశరథి ప్రజాదరణ పొందిన పాటలు అనేకం రాశారు.భక్తి గీతాలు రాయడంలో కూడా విశేష ప్రతిభ చూపారు. భక్తి గీతాల్లో ఒకటైన రంగుల రాట్నం చిత్రంలోని నడిరేయి ఏ జామునో అనే గీతం నేటికి మన గ్రామాల్లోని దేవాలయాల్లో తరచుగా వింటూనే ఉంటాం. బుద్ధిమంతుడు చిత్రంలో మరో పాట నను పాలింపగా వచ్చితివా అనే పాట కూడా ప్రాచుర్యం పొందినది.

ఈయన రాసిన విప్లవ పాటలు నాటి విప్లవకారుల కూడా సరళతరంగా పాడుకునే వారు. అందుకు ఉదాహరణ మనసు మాంగళ్యం చిత్రంలో ఆవేశం రావాలి ఆవేదన కావాలి అనే పాట జనాదరణ పొందినది. వీటితో పాటు యుగళ గీతాలు అద్భుతంగా రాశారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ అనే పాట నేటికి సంగీతాభిమానుల్లో చెరగని ముద్ర వేసింది. పాత తరాలకు కాకుండా నేటి యువతరం కూడా ఈ పాటను వినేందుకు ఉత్సాహం చూపడం గమనార్హం. మనసు మమతలో వెన్నెలలో మల్లియలు గుమగుమలు అనే పాట, మహాకవి క్షేత్రయలో జాబిల్లి చూసేను నిన్ను, నన్ను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు ఉన్నాయి. కుటుంబ బాంధవ్యాలను వర్ణిస్తూ, అన్న చెల్లెల ప్రేమ అనురా గాలకు చిహ్నంగా కూడా పాటలు రాసిన ఘనత దాశరథికి దక్కుతుంది. ‘ ఆడప డచు’ సినిమాలో అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్న గీతానికి ప్రజలు జేజేలు పలికారు. పండంటి కాపురంలో అన్నాద•మ్ముల బంధానికి నిదర్శనంగా ‘బాబు వినరా … అన్న తమ్ముల కథ ఒకటి’ అన్న పాట హిట్టుకొట్టింది. ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే, అమాయకురాలు చిత్రంలో పాడెద నీ నామమే గోపాల అంతా మనమంచికే చిత్రంలో నేనే రాధనోయ్‌ అనే గీతం, జమీందారి గారి అమ్మాయి చిత్రంలో మ్రోగింది వీణ పదే పదే హృదయాల లోన అనే పాటలు రాశారు. ఇలా ఎన్నో పాటలు సంగీతాభిమానులకు వీనుల విందు కలిగించారు.

కుటుంబ సభ్యులతో అనుబంధం…
దాశరథి కుటుంబ సభ్యులతో గడిపింది కాస్త తక్కువే అని చెప్పడం సమంజసమే.. . దాశరథి వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు క్షేమ సమచారాలు తెలుసుకునేందుకు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానే జరిగేవి. దాశరథి సతీమణి లక్ష్మి, కుమార్తె ఇందిర, కుమారుడు ఉన్నారు. అల్లుడు గౌరీశంకర్‌ ఉన్నారు. వారు మద్రాసులో స్థిరపడ్డారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

చిన్నగూడూరుతో అనుబంధం…
దాశరథి కుటుంబ సభ్యులకు చిన్నగూడూరుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు గ్రామంలో అనేక మంది కి అయన అంటే ఎనలేని అభిమానం. 1980 దశకంలో దాశరథి సోదరులిద్దరిని ఆ గ్రామ వాసులు ఘనంగా సన్మానించారు. వారి పేరిచెబితే స్పందించిన వ్యక్తులు ఉండరనటంలో అతిశయోక్తిలేదు. వారి పేరుపై గ్రామ కూడలిలో దాశరథి గ్రంథాలయంగా నామకరణం చేసి నడిపిస్తున్నారు. ప్రతిగా దాశరథి కుటుంబ సభ్యులు ఆ గ్రంథాలయానికి ఎన్నో సాహిత్య పుస్తకాలను వితరణగా ఇచ్చారు. 2012లో కుటుంబ సభ్యులందరూ ఆ గ్రామాన్ని సందర్శించి వారి తాతల నాటి ఇళ్లను పరిశీలించారు. స్థానిక పాఠశాల ఆవరణలో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అడ్డగోడ నరేష్‌ ‌దాశరథి కృష్ణమాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అదే సంవత్సరం కొద్ది రోజులకే దాశరథి కృష్ణమాచార్యుల సతీమణి లక్ష్మీ స్వర్గస్థులయ్యారు..
– భర్తపురం వెంకటమల్లేష్‌
9949872371

Leave a Reply