Take a fresh look at your lifestyle.

నవ పుష్ప విలాపం

బతుకమ్మ’  పండుగంటే
శిశిర, హేమంత ఋతువుల హేల
ప్రకృతిలో విరగ పూసిన
రంగు రంగుల పూల వసంత కేళి
బతుకమ్మ అంటే
సృష్టికి బ్రతుకును దానం చేసిన
బంగారు తల్లుల ఆనందపు
‘ఉయ్యాల’ పాట, ఆట
కాల ధర్మం ననుసరించి
పుడమి ఒడలంతా పచ్చదనంతో
విచ్చుకుని తన్మయత్వంతో
వయ్యారంగా ఒళ్ళు విరుచుకున్నా
నేడు కరోనా మహమ్మారి
కరాళ నృత్యానికి జడిసి
పూబోడులు గడప దాటకున్నారు
సుతారంగా దోసిళ్ళలో తమను తడిమే
సున్నితపు చేతులు తాకలేకున్నందుకు
విచ్చిన పువ్వులన్నీ విలపిస్తున్నాయి
కన్ను మిన్ను కానక
కన్నె మొగ్గలనూ తుంచి
అమానుషంగానలిపేసే
రాక్షసాధములకు జడిసి,
కామ మధాంధుల ‘కబంద‘
హస్తాలకు చిక్కి
మాన ప్రాణాలను పోగొట్టుకుంటూ
చితిలో కాలి బూడిదవుతున్న
నిర్భాగ్య స్త్రీమూర్తుల రోదనకు
తల్లడిల్లిన బ్రతుకుల్ని చూసి…
అన్నదాతలు తమ అస్తిత్వంకోరి
అలుపెరగక ఉద్యమాలు చేస్తూ
అసువులుబాసిఅమరులవుతుంటే
నేల తల్లి శోకంతో తల్లడిల్లుతుంటే
‘బతుకమ్మ’ కంట కన్నీరు కాలువలై
నేడు  ‘నవ పుష్ప విలాపం ‘ గా
లోకమంతా విలపిస్తోంది
బ్రతుకులు పండే సిసలైన
బతుకమ్మ పండుగ కావాలని
పూచిన ప్రతిపువ్వు కలవరిస్తోంది

– డా. కె. దివాకరా చారి, 9391018972

Leave a Reply