Take a fresh look at your lifestyle.

నవ భారతం..

తూరుపుకు ధీటుగా ఉత్తరం
ఎరుపెక్కింది!
గంగిగోవులు గాండ్రిస్తూ దుమికాయ్‌!
అన్నం ముద్దలు అగ్గిరవ్వలై
ఎగసి పడ్డాయ్‌!
‌దేశపు రైతులంతా ఒక్క తాటిపై నిల్చి
మట్టి చేతులు ఉక్కు పిడికిళ్లలా
బిగించేరు..
ఇప్పుడు కాక మరెప్పుడు అంటూ
నిప్పులాంటి నిజాల్ని నిగ్గదీయాలనీ
అగ్గితో కడిగైనా తరతరాల ఈ
దీనావస్థల తలరాతలు చక్క
దిద్దాలని సింహాల దండులా గర్జిస్తూ
కదలి వస్తున్నారు..
ఇది మరో స్వతంత్రపోరాటం
రైతు భారతాన్ని నవనవోన్మేషణంగా
ఔన్నత్యపు పట్టాలెక్కించే అలుపెరుగని
అంతిమ దీక్ష!
కొంపాగోడూ వదలి అన్నం నీళ్లు
మాని మన అన్నదాత రాజధాని
నడిబొడ్డున నిలబడి అందరికీ
పిలుపిస్తున్నాడు..!
పదుగురి ప్రాణాలు నిలిపే సాయం
వ్యవసాయంలో కార్పొరేట్‌ ‌విషం
కలపొద్దంటూ.. భవిష్యత్‌
‌భారతాన్ని అంధకారంలోకి నెట్టొదంటూ
ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాడు..
కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే
దిక్కుమాలిన చట్టాల్ని రద్దు చేసి..
కర్షకుల కాయకష్టానికి చట్టబద్ధత
కల్పించే శిలాశాసనం లాంటి
మద్దతు ధర చట్టం పొందేందుకు..
నవభారతాన్ని లిఖించేందుకు
ఐక్యతతో నడుం కడుతున్నాడు..
ప్రభుత్వంలో చలనం ప్రజల్లో చైతన్యం
తెచ్చేందుకు రైతుబాంధవుడు కదిలితే..
ఆ అడుగుల్లో ఐక్యమై అతడి వెన్నంటే
ఈ దేశం ఘర్మజలపు నదులన్నీ
కట్టలు తెగి కలిసి పొంగుకొస్తున్నాయ్‌..

‌భీమవరపు పురుషోత్తం,9949800253

Leave a Reply