ప్రకృతి వైపరిత్యమైనా
మానవ తప్పిదమైనా
ప్రమాదాలు ఎప్పుడు
ఏ రూపంలోజరిగిన
ప్రాణాలు గాల్లో కలిసేవి
బతుకు భద్రత లేని
బడుగు జీవులవే
తుఫానులు వరదలు
కొండ చరియల మాటున ఒరిగే
బండ బతుకులు
అనుకోకుండా మీదపడే అగ్ని శిఖలు
నిత్యము మృత్యువుతో సావాసమైన శాపగ్రస్త జీవితాలు
ఎప్పుడూ చచ్చేవాడికై ఏడ్చేదెవరు అన్నట్లు
కర్కష హృదయాలపై అల్లుకున్న
దళసరి తోలుకు
కన్నీటీ సావాసమైన కమిలిన దేహ బాధకు
సమన్వయం కుదురని
సమాంతర రేఖల్లా సాగే పయనం
వడ్డించిన విస్తరిలాగుండే బతుకులకు
వాడి మ్రోడులై చిగురించక
చిద్రమైన జీవితాల పట్ల
ఎప్పుడూ చిన్న చూపే కదా
ఏడు పదుల దాటి వెలుగుతున్న
స్వేచ్వా భారతంలో
గుప్పెడు మంది దళారులు పిడికిట బట్టిన సంపదలో
పిండుకున్న స్వేదజలానికి
కుదురుగా ఖరీదు కట్టిన
షరాబెవ్వడున్నడు
కళ్ళముందు జరుగుతున్న
కల్లోలాల ఉపద్రవాల కాలంలోను
కన్నీటి జడుల్లో తడిసి ముద్దైనది
గాయాల పాలైన కష్టజీవి దేహమే
ఐదేండ్లకో సారి అబద్దాల చిట్టాను
అందంగా పేర్చుకొన్న
ఓట్ల గాలపు ఎరలకు
మోసపోయి గోస పడటమే
అలవాటైన అమాయకత్వం
నేతి బీర చందమైన నేటి
ప్రజాస్వామ్యపు డొల్లతనాన్ని
నిన్నటి వలస పక్షుల గోస
నిలువెల్లా తడిమింది
గన్ రెడ్డి ఆదిరెడ్డి
9494789731