Take a fresh look at your lifestyle.

‌ప్రకృతి – పడతి

కాలచక్రం గతి తప్పి నువ్వు
రుతు చక్రం రూటు మారి నేను

ఆధిపత్యపు దోపిడీలో నువ్వు
అణచివేత చెరలో నేను

ఎండిన నదులు చెరువులతో నువ్వు
బిందెడు నీటి కోసం తల్లడిల్లే నేను

జీవజాతుల ఆపదలో విలవిలలాడే నువ్వు
బిడ్డకు బుక్కెడు బువ్వ పెట్టలేని నేను

కూకటివేళ్లతో మాయమైపోతూ నువ్వు
రూపుదిద్దుకోకనే ఛిద్రమై పోతూ నేను

మనుగడ కోసం నువ్వు
ఆహార భద్రత కోసం నేను

వాతావరణ సంక్షోభంలో నువ్వు
జీవన సంక్షేమం కోసం నేను

సకల జీవులకు ప్రాణం పొసే నువ్వు
సహజ వనరులను భద్రపరిచే నేను

నేల, నీరు, గాలి అంటిపెట్టుకునే నువ్వు
పచ్చని చెట్టును ఆలింగనం చేసుకునే నేను

మనలోని ప్రకృతితో మమేకమయ్యే నువ్వు
మనని కాపాడుకునే జీవన స్పృహలో నేను

వరదలా ముంచెత్తే లాభాల మార్కెట్‌ ‌కోరల్లో నువ్వు
శాసిస్తూ చుట్టూ వడిసెల విసిరే శక్తుల మధ్య నేను

మనలో అందరూ- అందరిలో మనం, వేరు కాదు నువ్వు నేను,
మసక చీకట్లలో ఉన్నాం, మన ఇంటి కోసం యుద్ధం చేయాలి నువ్వు నేను

– వి. శాంతి ప్రబోధ
(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)

Leave a Reply