Take a fresh look at your lifestyle.

నష్టాల నట్టేట్లో రైతులు..

ప్రకృతి వైపరీత్యం ఒక వైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు..
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌
‌సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలంటున్న రైతు సంఘాలు

( మండువ రవీందర్‌రావు )
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పంట నష్టానికి ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, ప్రభుత్వ జాప్యం మరోవైపు కారణంగా మారాయి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అదిగమించి, ఆరుగాలం కష్టించి కన్న బిడ్డలా పెంచిన పంట చేతికి వొస్తుందనుకున్న తరుణంలో మాయదారిలా ఆకాల వర్షాలు రైతులను నష్టాల నట్టేట్లో ముంచుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే  మూడు సార్లు వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. వర్షానికి తోడు ఈదురు గాలులు, రాళ్ళ వాన, ఉరుములు, పిడుగు పాటుతో రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాలకు పైగా నష్టాలను చవిచూడాల్సి వొచ్చింది. పిడుగుపాటుకు మనుష్యులతో పాటు అనేక జీవాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నెల రోజుల కింద పడిన వడగండ్ల వాన రైతాంగాన్ని ముంచేసిందంటే, గత శుక్రవారం, సోమ, మంగళ వారాలు పంటలను అతలాకుతలం చేశాయి. నెల రోజుల క్రితంనాటి నష్టాన్ని స్వయంగా పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎకరానికి పదివేల రూపాయలను నష్టపరిహారంగా అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత సంభవించిన మరో పరిణామానికి లక్షలాది ఎకరాల పంటలు నాషనమైనాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నట్లు వాస్తవంగా రైతులు కోల్పోయిన నష్టాన్ని పూడ్చడమన్నది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రభుత్వం అందించే తాత్కాలిక సహాయం కేవలం ఉపశమనం మాత్రమే. అయితే ప్రభుత్వం కూడా సకాలంలో చర్యలు చేపట్టినట్లైతే గుడ్డిలో మెల్లగా కొంత నష్ట నివారణ జరిగేదన్నది రైతులు అభిప్రాయం. రైతుల కళ్ళాల వద్దనే వారు పండించిన ధాన్యాన్ని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేస్తుండడం నిజంగా హర్షించదగిన విషయమే. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును నేరుగా రైతు ఖాతాలోకే రావడాన్ని కూడా హర్షించకుండా ఉండలేము. అయితే కొనుగోలు కేంద్రాలను నెలకొల్పడంలో యంత్రాంగం చేస్తున్న జాప్యం కారణంగా కూడా రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడడమేకాకుండా, నష్టపోతున్నారు. యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా ఈ నెల రెండవ వారంలో రాష్ట్ర పిఎస్‌కు, సివిల్‌ ‌సప్లై అధికారులను స్యయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆ సమాచారాన్ని అన్ని జిల్లా కలెక్టర్లకు చేరవేసినప్పటికీ అనేక గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. ధాన్యం కోసి దాదాపు పదిహేను రోజులు దాటుతున్నా కొనుగోళ్ళను ప్రారంభించని గ్రామాలున్నాయి. ఫలితంగా మూడు సార్లు వెంటదివెంట వొచ్చిన గాలి వానలకు ధాన్యం తడిసి ముద్ద అయింది. కొన్ని ప్రాంతాల్లో నైతే ధాన్యం మొలకలు వొచ్చాయంటే ఎంత కాలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. కొనుగోలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఐకెపి వారిని అడిగితే స్థానిక ఎంఎల్‌ఏ ‌వొచ్చి ప్రారంభించిన తర్వాత కొనుగోలు చేస్తామని సమాధానమిస్తున్నట్లు కొన్ని గ్రామాల రైతులు చెబుతున్నారు. అయ్యగారు వొచ్చేవరకు అమావాస్య అగుతుందా అన్నట్లు ఎంఎల్‌ఏలకు తీరిక దొరికినప్పుడు వొచ్చే దాకా కొనుగోలును నిలిపితే అకాల వర్షానికి తడిచే ధాన్య నష్టాన్ని ఎవరు భరిస్తారు. ప్రతీ సంవత్సరం జరుగుతున్న తంతే అయినప్పటికీ ధాన్యాన్ని త్వరగా తరలించాలన్న ఆలోచన ప్రజా ప్రతినిధులకు లేకపోవడం కూడా ఈ నష్టాలకు కారణంగా మారుతున్నది. ఒక వైపు ఇంకా కోత దశలో ఉన్న ధాన్యం వానలకు పొలాల్లోనే నేలకొరిగి పోతే, మరో వైపు కోసి ఎండబెట్టిన ధాన్యాన్ని కొనుగోలుచేయడంలో సంబంధిత యంత్రాంగం చేస్తున్న జాప్యం కూడా కారణంగా మారుతున్నది. కొనుగోలులో కూడా బస్తాకు ఇంత అంటూ ఎక్కువ తూచటం, హమాలీల ఛార్జీలు కూడా రైతులనే భరించాలనడం ద్వారా రైతులు మరింత నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వొస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగిలో కోటి 58 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేసింది. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏర్పాటు చేసిన ఏడు వేల కొనుగోలు కేంద్రాలకు మించి ఈ సారి మరో 550 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే మరికొన్ని కేంద్రాలను పెంచేందుకు కూడా సిద్ధపడింది. అయితే ఇప్పటి వరకు లక్ష్యంలో సగం కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసిందంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు రైతాంగానికి నష్టం వాటిల్లిందన్నది అర్థమవుతున్నది. అయితే ఇంకా వర్షాల తాకిడి మరి కొద్ది రోజులవరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న తరుణంలో, కొనుగోలు పక్రియను వేగవంతం చేయని పక్షంలో మరెంతగా నష్టం జరుగుతుందోనన్న భయంలో రైతులున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నష్టాల నుండి రైతులను రక్షించేందుకు ఇప్పటికైనా రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టాలని రైతు సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply