రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీల జాడే కరువైపోయింది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ధాటికి జాతీయపార్టీలు తట్టుకోలేకపోయాయి. తెలంగాణలో టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామంటే తామంటూ విస్తృత ప్రచారం చేసుకున్న ఈ పార్టీలను వోటర్లు పెద్దగా ఆదరించలేదు. అధికారపార్టీ వైఖరిని దుయ్యబడుతూ ఈ పార్టీలు గత కొంతకాంగా చేసిన ప్రచారాన్ని ప్రజలేమాత్రం పట్టించుకోలేదన్నది దీనివల్ల స్పష్టమవుతోంది. ఫలితంగా అత్యధిక స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాల్టీలకుగాను అధికార టిఆర్ఎస్ 107 మున్సిపాల్టీలను గెలుచుకోగా, కాంగ్రెస్ ఏడు మున్సిపాల్టీలను, భాజపా రెండు, ఎంఐఎం రెండు మున్సిపాల్టీలను గెలుచుకుంది. కాగా తొమ్మిది కార్పొరేషన్లకుగాను టిఆర్ఎస్ ఎనిమిదింటిని కైవసం చేసుకుంది. అక్కడక్కడ బిజెపి, కాంగ్రెస్ అధికారపార్టీకి గట్టిపోటీనే ఇచ్చినప్పటికీ ఒకటిరెండు తప్ప పెద్దగా మున్సిపాల్టీలను ఆపార్టీలు కైవసం చేసుకోలేకపోయాయి. అలాగే కొన్ని మున్సిపాల్టీలు, నగరపాలికల్లో నువ్వానేనా అంటూ ఈ పార్టీలు పోటీ పడడంతో ఎవరికీ పూర్తిస్థాయిలో మెజార్టీ రాలేదు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఈ ఎన్నికల ప్రారంభంలోనే పార్టీని కాదని రెబల్స్‌గా పోటీచేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ హెచ్చరించినప్పటికీ చాలాచోట్ల అభ్యర్థులు పట్టించుకోలేదు. చివరికి టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా పోటీచేసిన వారే విజయం సాధించారు. ఇప్పుడు ఆ అభ్యర్థులే కీలకంగా మారే అవకాశం ఏర్పడింది. తమను ధిక్కరించి పార్టీ అభ్యర్థులతో పోటీపడిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోమని ప్రకటించిన టిఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు వారితో మంతనాలు చేయకతప్పని పరిస్థితి. అలాంటప్పుడు వారిని తిరిగి పార్టీలో చేర్చుకోక తప్పని పరిస్థితి కొన్నిచోట్ల ఏర్పడనుంది.
టిఆర్ఎస్లో కీలకనేతగా కొనసాగి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జూపల్లి కృష్ణారావు స్వయంగా తనకు సంబంధించిన వారిని టిఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీలో నిలబెట్టారు. ఆయన సిఫారసుచేసినప్పటికీ తన వారికి టికెట్లు ఇవ్వలేదన్న కోపంతోనే ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో (సింహం గుర్తు)వారిని నిలబెట్టిన విషయం తెలిసిందే. విచిత్రకర విషయమేమంటే వారిలో చాలామంది విజయం సాధించారు. జాపల్లికి సంబంధించి కొల్లాపూర్ మున్సిపాల్టీలో 20 స్థానాలుండగా ఆయన పదహారు మందిని గెలిపించుకున్నారు. అలాగే ఐజా మున్సిపాల్టీలో ఇరవై వార్డులకుగాను పదిమంది జూపల్లి వర్గీయులే గెలవడంతో ఆ రెండు మున్సిపాల్టీలు జూపల్లి వర్గీయుల కైవసం అయినాయి. అంతెందుకు టిఆర్ఎస్ అగ్రనేతలైన కెసిఆర్, కెటిఆర్ ఇలాఖాలో కూడా ఇదే పరిస్థితి. కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఇరవై స్థానాలుండగా అక్కడ కూడా రెబల్ అభ్యర్థులతో కలిపి ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. అదే విధంగా కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నలభై వార్డులకు పన్నెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పోటీచ•సి గెలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. పలుచోట్ల నువ్వానేనా అని పోటీపడి సమాన అభ్యర్థులను గెలిపించుకున్న టిఆర్ఎస్, భాజపా లేదా టిఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇప్పుడా గెలిచిన స్వతంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాగా, టిఆర్ఎస్, ఆపార్టీ అధినాయకుడంటేనే నిప్పులుగక్కే కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి తన స్వంత నియోజకవర్గంలోనే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయాడు. ఆయన రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన కొడంగల్ మున్సిపాల్టీలో పన్నెండు వార్డులకుగాను కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలనే గెలుచుకుంది. టిఆర్ఎస్కు కనీస పోటీని కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. ఇక్కడి ఎన్నికలపై రేవంత్‌రెడ్డి ఎక్కువ సమయాన్ని కేటాయించినా ప్రజలు కాంగ్రెస్ వెంట నిలబడలేదు. శాసన సభలో బయట అధికార పార్టీపై విరుచుకుపడే కాంగ్రెస్ సభాపక్షనేత భట్టి విక్రమాదిత్య ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాల్టీలో కూడా ఆ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఇక్కడ ఆ పార్టీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కాగా, టిఆర్ఎస్ పన్నెండు స్థానాలను గెలుచుకుంది. అయితే యాదగిరి గుట్ట మున్సిపాల్టీలో మాత్రం అధికార పార్టీని కాంగ్రెస్ మట్టికరిపించింది. టిఆర్ఎస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. యాదగిరి దేవస్థానం రూపురేఖలు మారుస్తూ కోట్లాది రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. దీని అభివృద్ధి పనులను పర్వవేక్షించేందుకు ఇంచుమించు ప్రతీ పదిహేను ఇరవై రోజులకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రావడం, స్థానిక ప్రజానాయకులతో చర్చలు జరుపడం లాంటి ప్రక్రియ కొనసాగించినా ఇక్కడి వోటర్లు మాత్రం టిఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. ఇక్కడ పన్నెండు స్థానాలుండగా కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోగా, టిఆర్ఎస్ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ మరో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేవలం రెండవ స్థానానికే పరిమితమైందని చెప్పవచ్చు. కాగా భాజపా దరిదాపులోకి కూడా రాలేకపోయింది.
Tags: Nationalist parties, telangana, municipal elections, trsparty