Take a fresh look at your lifestyle.

విజ్ఞానం నిరంతర జీవనదీ ప్రవాహం

(ఫిబ్రవరి 28, జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం)

మన మస్తిష్కంలో జనించే ఆలోచనలు కార్యరూపం దాల్చి, ఆవిష్కరణలకు దారితీస్తే అలాంటి ప్రక్రియను విజ్ఞానం అని చెప్పవచ్చు. నిప్పు పుట్టించడం, వంటచేయడం, గృహాలు నిర్మించుకోవడం, ఆయుధాలను తయారు చేయడం… ఇలా ఒకటేమిటి ప్రతీ ఆలోచన అర్ధవంతమైన ఫలితాలకు దారితీయడాన్ని “సైన్స్” గా పేర్కొనవచ్చు.విజ్ఞానం అంటే ఏమిటో కనీస నిర్వచనం తెలియని రోజుల్లోనే భారత దేశంలో పలు రూపాల్లో విజ్ఞానం వెల్లి విరిసింది. మేథస్సుకు, నాగరికతకు,విజ్ఞానానికి భారత దేశం పెట్టింది పేరు. అయితే అప్పటి పరిస్థితుల్లో భారతదేశం తన ప్రతిభను ప్రపంచానికి చాటలేకపోయింది. భారతీయుల విజ్ఞానం విదేశాలకు పేటెంట్ హక్కుల రూపంలో తరలిపోయింది. అయినప్పటికీ భారతీయుల ప్రతిభ కనుమరుగు కాలేదు. భారతీయుల సైన్స్ పరిజ్ఞానం దశదిశలా వ్యాపించే రోజులు నెలకొన్నాయి. పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రం కూడా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం గర్వకారణం. ప్రపంచానికి శస్త్రచికిత్స అంటే ఏమిటో తెలియని కాలంలో “ధన్వంతరి” ప్రాకృతిక ఓషధులతో శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు స్వస్థత చేకూర్చడం జరిగింది.

క్రీ.పూ 6 వ శతాబ్ధానికి చెందిన శుశృతుడు భారతీయ ఆయుర్వేద శస్త్రచికిత్సలో నిపుణుడు. 7 వ శతాబ్ధానికి చెందిన భాస్కరుడు ఖగోళ,గణితశాస్త్రాల్లో ప్రముఖమైన స్థానం సంపాదించాడు. రెండవ భాస్కరుడు కూడా ఖగోళ,గణిత శాస్త్ర ప్రావీణ్యుడు. ఆర్యభట, శూన్య విలువ ప్రాముఖ్యతను తెలియచెప్పిన ప్రాచీన గణిత,ఖగోళ శాస్త్రజ్ఞుడు. గతంలో ఇప్పటి మాదిరిగా పరిశోధనలు చేయడానికి అనువైన వాతావరణం,సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు.ప్రాచీన కాలంలో ప్రపంచంలో నెలకొన్న అంధ విశ్వాసాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు ప్రతిబంధకాలుగా ఉండేవి. ప్రపంచ గతిని మార్చడానికి ప్రయత్నించిన పలువురు మేథావులు,తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అనేక కఠిన శిక్షలకు గురికావడం జరిగింది. కాలం గడిచే కొద్దీ ప్రజల,పాలకుల ఆలోచనల్లో,మత విశ్వాసాల్లో వచ్చిన పెను మార్పులు విజ్ఞాన శాస్త్ర రంగంలో పలు ఆవిష్కరణలకు నాంది పలికాయి. భారత దేశం నాగరికతకు పుట్టినిల్లు. ప్రాచీన కాలంలోనే విజ్ఞానశాస్త్రం వికసించిన భారత దేశంలో అనేక మంది శాస్త్రవేత్తలు తమ అనన్య సామాన్యమైన ప్రతిభతో అనేక ఆవిష్కరణలకు నాంది పలికారు.

కేవలం కంటి చూపుతో గ్రహాల గమనం గురించి,నక్షత్ర రాశుల గురించి, ఖగోళ రహస్యాలను చేధించి అబ్బుర పరచిన విధానం నభోతోనభవిష్యతి. అప్పట్లో ముద్రణా సాధనాలు అందుబాటులో లేకపోవడం వలన భారతీయ పరిశోధనలు ప్రపంచానికి తెలియ లేదు. ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనం మరుగున పడిపోయింది. అనేక దాడులతో,దండయాత్రలతో,వలస పాలనతో భారతీయ మేథాసంపత్తి కొల్లగొట్టబడి,పాశ్చాత్య దేశాల పేటెంట్ హక్కుగా మారిపోయింది. అయినప్పటికీ భారతీయ మేథావుల విజ్ఞాన జిజ్ఞాస నశించలేదు. నిరంతర పరిశోధనలతో ప్రపంచానికి తమ సత్తా చూపించగలిగారు. ముద్రణా యంత్రాలు రావడంతో, ఇతర దేశాలకు రాకపోకలు సాగడంతో భారతీయ శాస్త్రపరిజ్ఞానం వివిధ మాద్యమాల ద్వారా ప్రపంచానికి విస్తృతంగా పాకింది. ఎంతో మంది భారతీయ శాస్త్రవేత్తలు విశ్వవిఖ్యాతమైన పరిశోధనలతో ప్రపంచ విజ్ఞాన శాస్త్ర రంగానికి తలమానికంగా మారారు. విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం భౌతిక,రసాయన,జీవ శాస్త్రాలు మాత్రమే కావు. గణిత శాస్త్రం కూడా విజ్ఞాన రంగానికి తలమానికం. అందుకే గణిత శాస్త్రాన్ని సకల విజ్ఞానానికి మాతృక గా భావిస్తారు.గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ బహుముఖ ప్రజ్ఞాశాలి.తత్వశాస్త్రం లోనే కాదు సకల విజ్ఞాన ప్రపంచంలో అత్యంత మేథావిగా పేరు గాంచాడు. భారత దేశం లో కూడా అనేక మంది శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.భారత దేశంలో సర్.చంద్రశేఖర వెంకటరామన్ అనన్యసామాన్యమైన భౌతిక శాస్త్రవేత్త. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా,తండ్రి భౌతిక శాస్త్ర ప్రతిభను ఆసరాగా చేసుకుని చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభను కనబరిచాడు. అంచెలంచెలుగా ఎదిగి భౌతిక శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచి “రామన్ ఎఫెక్ట్” ద్వారా ప్రపంచానికి తన ప్రతిభను ప్రదర్శించాడు.

ఆధునిక విజ్ఞానశాస్త్రంలో భారతీయ ఉపఖండంలో ఆరాధ్యుడిగా ఆధునిక సైన్స్ వ్యవస్థాపకుడిగా సర్.సి.వి.రామన్ ప్రఖ్యాతి గాంచాడు. సర్. సి.వి.రామన్ పరిశోధనలను ధృవీకరించిన ఫిబ్రవరి 28 వ తేదీని భారత ప్రభుత్వం “జాతీయ విజ్ఞాన దినోత్సవం” గా ప్రకటించింది. నోబెల్ బహుమతి, లెనిన్ శాంతి బహుమతి వంటి అనేక గౌరవాలతో భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన సి.వి.రామన్ కు భారత ప్రభుత్వం అత్యున్నత భారత రత్న పురస్కారం తో పాటు, ఆతని భౌతిక శాస్త్ర ప్రజ్ఞాపాటవాలకు గుర్తింపుగా ఫిబ్రవరి 28 వ తేదీని “జాతీయ సైన్స్ దినోత్సవం”గా ప్రకటించి శాస్త్రవేత్తలుగా ఎదగాలనే వారికి స్ఫూర్తి నిచ్చింది. భారత దేశం అనేక మంది శాస్త్రవేత్తలకు నిలయం. జగదీష్ చంద్రబోస్, హోమీ జహంగీర్ బాబా, అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సహ వంటి పలువురు ప్రముఖులు ఆయా రంగాల్లో ఎంతో ప్రతిభ కనబరచి, విశేష ఖ్యాతి నార్జించిన భారతీయులుగా చరిత్ర సృష్టించారు.”పూవు పుట్టగానే పరిమళించును” అనే విధంగా బాల్యం లోనే భౌతిక శాస్త్రం లో అపారమైన ప్రతిభను గడించిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్.సి.వి.రామన్ కేవలం తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై వ్రాసిన పరిశోధనా వ్యాసాలు లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైనాయి. ఆకాశం నీలి రంగులో ఎందుకుంటుంది? సముద్రం నీలి వర్ణం ఎందుకు సంతరించుకుంటుంది? అనే జిజ్ఞాస సి.వి రామన్ కాంతి పరిశోధనలకు మార్గం చూపాయి. ” రామన్ ఎఫెక్టు” భారతీయ భౌతిక శాస్త్రానికి ఎనలేని ఖ్యాతినార్జించి పెట్టింది. ఆ మహనీయుని స్మృత్యర్థం 2022 వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన భారతదేశంలో జరిగే జాతీయ సైన్స్ దినోత్సవం “శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్థిరమైన భవిష్యత్తు కోసం సమీకృత విధానం” అనే థీమ్ తో జరగుతున్నది. రామన్ జీవితం యువ శాస్త్రవేత్తలకు ఆదర్శం కావాలి. యువత విజ్ఞాన శాస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలతో భారత దేశానికి వన్నె తీసుకురావాలి.అదే సి. వి.రామన్ కు మనం అర్పించే నిజమైన నివాళి.
Sunkavalli Sattiraju. Sangayagudem,

Leave a Reply