Take a fresh look at your lifestyle.

జిహెచ్‌ఎం‌సి ఎన్నికలవేళ జాతీయ రాజకీయాల ప్రస్తావన

‌”కేంద్రంలోని బిజెపి సర్కార్‌నే నేరుగా టార్గెట్‌చేస్తూ, వివిధ రాష్ట్రాలను కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా కూడగట్టుకునే పనిని తన భుజానికెత్తుకోనున్నట్లు స్పష్టంచేశారు. ఇంతవరకు  బిజెపి కేంద్ర నాయకత్వంతో సయోధ్యను కొనసాగిస్తున్నట్లుగా కనిపించిన టిఆర్‌ఎస్‌, ‌భాజపా రాష్ట్ర నాయకులతో మాత్రం
ఉప్పులో నిప్పులా ఉండేది. కాని ఇప్పుడు ఏకంగా కేంద్రంపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్‌ ‌స్థానంలో బిజెపి ఎదగిరావడమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.”

ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తరుణంలో టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అందరి దృష్టిని మరోసారి జాతీయ రాజకీయాలవైపు మళ్ళించే ప్రయత్నం చేపట్టారు. ఒక పక్క  జిహెచ్‌ఎం‌సి ఎన్నికల నోటిఫికేషన్‌  ‌హడావిడిగా విడుదలచేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్‌ల ప్రక్రియలో తలమునకలవుతున్న తరుణంలో మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకురావడమేగాక ఏకంగా కేంద్రంలోని బిజెపి నాయకత్వంపై బాణం ఎక్కుపెట్టడంతో  రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల నాయకులు సవాల్‌ ‌ప్రతి సవాల్‌లు విసురుకుంటున్నారు. ఈ ఎన్నికలు నాలుగు ప్రధాన పార్టీల మధ్య తీవ్రపోటీ కొనసాగునున్నప్పటికీ, జిహెచ్‌ఎం‌సిపై జెండా ఎగురవేసేది మాత్రం తామేనంటున్నాయి అధికార తెరాస, భారతీయ జనతాపార్టీలు. ఈ రెండు పార్టీల మధ్యే ఇప్పుడు ప్రధాన పోటీ కనిపిస్తోంది. పాతబస్తీలో పట్టున్న ఎంఐఎంతోపాటు టిడిపి, జనసేన, లెఫ్ట్‌పార్టీలు కొన్ని స్థానాలకే పరిమితవుతుండగా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు మాత్రం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి తమ సత్తాచాటుకోవాలని తీవ్రంగా పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌కూడా ఈసారి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించినప్పటికీ తుది జాబితా ప్రకటిస్తేగాని ఎన్ని డివిజన్‌లలో పోటీచేసేది తేలదు.

ఒకపక్క అభ్యర్థుల ఎంపిక, నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రధాన పార్టీలు మాటల తూటాలను పేలుస్తున్నాయి. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల మొదలు జిహెచ్‌ఎం‌సి ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్య పంచ్‌ ‌డైలాగులు వినిపిస్తున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోమన్నట్లుగా ఒకరిపై ఒకరు సవాళ్లు  ప్రతి
సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే ఈ సవాళ్ళు కాస్తా శృతిమించి, సభ్యతను కోల్పోతున్నట్లుగా కనిపిస్తూ రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. తనకు ప్రధాన పోటీదారు బిజెపి కావడంతో  కెసిఆర్‌ ‌తన బాణాన్ని సరాసరి కేంద్రంపైనే ఎక్కు పెట్టినట్లు కనిపిస్తున్నది. జాతీయ రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని గతంలో కాంగ్రెస్‌, ‌బిజేపి ఏతర కూటమిని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామంటూ మధ్యంతరంలోనే ఆ ప్రయత్నాలను విరమించుకున్న కెసిఆర్‌ ఇప్పుడు మరోసారి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటూ ప్రకటించారు.
అయితే ఈసారి కేంద్రంలోని బిజెపి సర్కార్‌నే నేరుగా టార్గెట్‌చేస్తూ, వివిధ రాష్ట్రాలను కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా కూడగట్టుకునే పనిని తన భుజానికెత్తుకోనున్నట్లు స్పష్టంచేశారు. ఇంతవరకు  బిజెపి కేంద్ర నాయకత్వంతో సయోధ్యను కొనసాగిస్తున్నట్లుగా కనిపించిన టిఆర్‌ఎస్‌, ‌భాజపా రాష్ట్ర నాయకులతో మాత్రం ఉప్పులో నిప్పులా ఉండేది. కాని ఇప్పుడు ఏకంగా కేంద్రంపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్‌ ‌స్థానంలో బిజెపి ఎదగిరావడమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దుబ్బాక ఎన్నికలు మొదలు స్థానిక బిజెపి నాయకులు టిఆర్‌ఎస్‌ ‌తప్పులను ఎత్తిచూపుతూ ఏకరువు పెడుతున్నారు.  కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ ప్రజలసానుభూతిని వోట్ల రూపంలో దండుకుంటున్నదంటూ ఇటీవల బిజెపి రాష్ట్ర నాయకత్వం కోడై కూస్తుండడంతో  కెసిఆర్‌ ‌సరాసరి కేంద్రంపైన తనబాణాన్ని ఎక్కుపెట్టి ఉంటాడనుకుంటున్నారు.

గతంలో లాగానే వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ మేరకు సంప్రదింపులు జరిపానంటూ, అరవింద్‌ ‌క్రేజీవాల్‌, ‌మమత బెనర్జీ, కుమారస్వామి, నవీన్‌ ‌పట్నాయక్‌, ‌శరద్‌ ‌పవార్‌లాంటి హేమాహేమీల పేర్లను కెసిఆర్‌ ‌వెల్లడించారు. వామపక్షాలు కూడా తమతో కలిసి వొస్తాయన్న విషయాన్ని వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్‌ ‌చేయడంతోపాటు, రైతులకు, వ్యవసాయరంగానికి, యువతకు చేసిందేమీలేదంటూ, కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద యుద్ధమే చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆయన వాడిన పదజాలంతో పాటుగా, కేంద్ర విధానాలను తప్పుపట్టడాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. మోదీ ప్రభుత్వం చతికిల పడిందన్న కెసిఆర్‌ను దేశద్రోహిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముద్రవేయడంతో రెండు రాజకీయ పార్టీల మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి.

Leave a Reply