Take a fresh look at your lifestyle.

‌ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన జాతీయ పార్టీలు

దేశంలోని రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయాయి. దేశ రాజకీయాలన్నీ రాజధాని అయిన ఢిల్లీతోనే ముడివడి ఉంటాయి. ఏ రాజకీయ పరిణామానికైనా ప్రజలందరి చూపు ఢిల్లీపైనే ఉంటుంది. అలాంటి ఢిల్లీలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలను తిరస్కరించారు. కనీసం బిజెపి అయినా సింగిల్‌ ‌డిజిట్‌ను తెచ్చుకోగా, కాంగ్రెస్‌ ‌సున్నా సీట్లను సాధించుకోవడం ఆ పార్టీ పరువు పూర్తిగా దిగజారడానికి కారణమైంది. దేశాన్ని ఇంతవరకు పాలించిన రాజకీయ పార్టీలేవైనా ఉన్నాయంటే ఈ రెండింటినే పేర్కొంటారు. ఈ రెండు పార్టీలను కాదని కొంతకాలం జనతాపార్టీ అధికారాన్ని చేపట్టింది. ఇప్పుడు అలాంటి ప్రత్యమ్నాయ జాతీయ పార్టీలు లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే ఆ తంతును కానిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన దివంగత షీలా దీక్షిత్‌ ‌నిరాఘాటంగా పదిహేనేండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగింది. అలాంటి ఢిల్లీ అసెంబ్లీకి గడచిన రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకో లేకపోయిందంటే ఆ పార్టీ ఏస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెట్టుపేరుచెప్పి కాయలమ్ముకున్నట్లు ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లు చెప్పి వోట్లను దండుకునే రోజులు పోయాయన్న విషయాన్ని ఆ పార్టీ అర్థంచేసుకోలే కపోవడం వల్లే ఈ దురవస్థ ఏర్పడిందన్న ఆరోపణలు లేకపోలేదు.మన్‌మోహన్‌సింగ్‌ ‌రెండుసార్లు ప్రధాని అయిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్‌ ‌ప్రధాని ఎవరన్న విషయాన్ని గట్టిగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఆపార్టీ. భారతీయ జనతాపార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌పార్టీకి పెద్దదిక్కు ఎవరన్న విషయంలో ఆ పార్టీ వర్గాలకే ఆయోమయ పరిస్థితి.

అలాంటి స్థితిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో గొప్పగా చెప్పుకునే విజయాలేవీ సాధించలేకపోయిందాపార్టీ. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికేలేకుండా పోవడానికి సరైన నాయకత్వం లేకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ ‌పార్టీ 66 సీట్లకు పోటీచేస్తే, 63 మంది అభ్యర్ధుల డిపాజిట్లు గల్లంతైనాయంటే ఎంత హీన స్థితిలో ఆ పార్టీ కొనసాగు తుందో అర్థమవుతున్నది. కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రమే డిపాజిట్లను దక్కించుకుందా పార్టీ. ఇక భారతీయ జనతాపార్టీ విషయానికొస్తే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండీ ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టుకుంటూనే ఉంది. ఆమ్‌ ఆద్మీ అధినేత వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే ఇందుకు ఉదాహరణ. కేంద్రంలోని బిజెపికి, ఢిల్లీలోని అధికార ఆప్‌ ‌పార్టీకి మొదటి నుండి చుక్కెదురే. ఢిల్లీ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రిగా అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఏ ‌నిర్ణయం తీసుకున్నా పక్కనే ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎదో ఒంకతో అది అమలు కాకుండా చేయడంతో ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ ఉప్పులో నిప్పులా ఉంటూ వస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలుకూడా ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక పథక రచనలు చేసినా సామాన్య జనం మాత్రం ఆప్‌ ‌పార్టీకే పట్టం కట్టారు. సామాన్యుల జీవన విధానాన్ని అవగాహన చేసుకున్న కేజ్రీవాల్‌ ‌దైనందిక జీవితంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై దృష్టిపెట్టడంద్వారానే ఆయన ఈ అఖండ విజయాన్ని మూటకట్టుకున్నాడన్నది స్పష్టం. ఒక విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేజ్రీవాల్‌ ‌పథకాలు మార్గదర్శకాలు అవుతాయనడంలో ఏమాత్రం సందేహంలేదు.

ప్రజలకు అతి ముఖ్యమైనది నీటి సమస్య. ప్రతీ కుటుంబానికి ఇరవై వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందజేస్తున్న కేజ్రీవాల్‌ ‌పట్ల ప్రజలు తమ కృతజ్ఞతను వోటు రూపంలో తెలియజేశారు. అలాగే 200 యూనిట్ల వరకు కరెంట్‌ ‌వాడకాన్ని కూడా ఉచితంగా అందజేస్తోంది ఆప్‌ ‌ప్రభుత్వం. నిరుపేద వర్గాల పిల్లలుకూడా కార్పొరేట్‌ ‌స్థాయి విద్యను పొందేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడం, ప్రభుత్వ బస్సుల్లో విద్యార్ధులకు, మహిళలకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించడం లాంటి పథకాలే ఆ పార్టీకి పట్టంకట్టాయనడంలో అతిశయోక్తిలేదు. దానికి తగినట్లు మూడు సార్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేజ్రీవాల్‌ ‌ప్రభుత్వంపై అవినీతి ఆరోపణ లేకపోవడంకూడా మరో అదనపు అర్హతైంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌లాగా సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని పథకాలు రచించ•క పోవడంవల్లే ఆ పార్టీని అక్కడి ప్రజలు తిరస్కరించారన్నది స్పష్టమవుతోంది. దేశంలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జర్చజరుగుతున్న సిఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌ ‌లాంటి విషయాలేవీ సామాన్యుడికి పట్టేవికావు. 370వ అధికరణను రద్దుచేయడం ద్వారా కాశ్మీర్‌ ‌సమస్యకు ఓ పరిష్కారం లభించడం లాంటివే అయినప్పటికీ సామాన్య ప్రజలను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. పెద్దనోట్లరద్దు, బ్యాంకు విధానాల్లో తీసుకొచ్చినమార్పులకారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులు,, తాజా బడ్జెట్‌లో ఉపాధి కల్పన, ఆర్థిక సంక్షోభ నివారణ, ధరల పెరుగుదల ఊసే లేకపోవడం లాంటి పరిణామాలు ఢిల్లీ వోటర్లను ఆ పార్టీకి దూరం చేశాయన్న వాదన ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జంఢాను ఎగురవేస్తామని కలలు కంటున్న బిజెపి ఇప్పటికైనా సామాన్య ప్రజలను దృష్టిలోపెట్టుకుని పథకాలను రచిస్తేతప్ప వోట్లను పొందలేదన్న విషయాన్ని గ్రహించాల్సిఉంది.

Leave A Reply

Your email address will not be published.