కోవిడ్19 వైరస్‌పై పోరాటం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. దేశంలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పన కోసం 15వేల కోట్ల ఎమర్జెన్సీ ప్యాకేజీని ప్రకటించింది. నూరుశాతం కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులను విడుదల చేస్తుంది. అయిదేళ్ల పాటు కొనసాగే ఈ స్కీమ్‌లో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందించేందుకు డబ్బును ఖర్చు చేయనున్నారు. మొత్తం మూడు దశల్లో కోవిడ్19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీని అమలు చేస్తారు. జనవరి 2020 నుంచి జూన్ 2020 వరకు, ఆ తర్వాత జూలై 2020 నుంచి మార్చి 2021 వరకు, ఏప్రిల్ 2021 నుంచి 2024 వరకు నిధులను ఖర్చు చేస్తారు. కోవిడ్ హాస్పిటళ్ల అభివృద్ధి, ఐసీయూల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం ఈ ప్యాకేజీ నిధులను వినియోగిస్తారు.
ఎమర్జెన్సీనిధులతో ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్ తెలిపారు. తొలి దశలో హాస్పిటళ్లు, గవర్నమెంట్ అంబులెన్స్‌లను డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. వీటితో పాటు పర్సనల్ ప్రొటెక్షన్ ఇక్విప్మెంట్, ఎన్95 మాస్క్‌లను కూడా ఖరీదు చేస్తారు. కరోనాపై పోరుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ప్రదాని మోదీ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం 7774 కోట్లు కేటాయించారు. మిగతా నిధులను మరో నాలుగేళ్లలో ఖర్చు చేస్తారు. అంటువ్యాధులు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ల్యాబరేటరీల ఏర్పాటుకు కూడా నిధులను ఖర్చుచేస్తారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ సుమారు 4113 కోట్లను రాష్టాల్రు, యూటీలకు రిలీజ్ చేసింది.