Take a fresh look at your lifestyle.

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య బహుముఖ ప్రజ్ఞశాలి

హైదరాబాద్‌, ‌పీఐబీ ,ఆగస్టు 02 : మన  దేశానికి జాతీయ జెండాను  రూపొందించటమే కాకుండా వ్యవసాయ, భూగర్భ, ఖనిజ శాస్త్ర రంగాలలో  విస్తృత పరిశోధనలు చేసి అనేక ఆధునిక పద్ధతులకు అంకురార్పణ చేసిన  అద్భుత ప్రతిభాశాలి , ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు  పింగళి వెంకయ్య అని ప్రముఖ సాహిత్య పరిశోధకులు కుర్ర జితేంద్ర బాబు అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్‌ ఔట్‌ ‌రీచ్‌ ‌బ్యూరో. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌బ్యూరో  సంయుక్తంగా ఆజాదీ కి అమృత్‌ ‌మహోత్సవాలలో భాగంగా పింగళి వెంకయ్య 145వ జయంతి  సందర్భంగా సోమవారం నిర్వహించిన వెబినార్‌ ‌లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జితేంద్రబాబు ప్రసంగిస్తూ  మన దేశానికి ప్రత్యేకంగా ఒక జెండా ఉండాలని  1906 లో కలకత్తా జాతీయ కాంగ్రెస్‌ ‌మహాసభలలో మొట్టమొదట ప్రతిపాదించిన మహనీయుడు పింగళి వెంకయ్య అని తెలిపారు. దేశంలో జాతీయ ఉద్యమం  తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో మన జాతి ఔన్నత్యాన్నిప్రతిబింబించే విధంగా జాతీయ జెండా ఉండాలని 1916 లో ఇండియన్‌ ‌నేషనల్‌ ‌ఫ్లాగ్‌ అనే పుస్తకాన్నిరచించారని తెలిపారు.  దేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబంలా , సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచేవిధంగా పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను కొన్ని మార్పులతో 1921 ఏప్రిల్‌ ఒకటవ తేదీన విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌  ‌మహాసభలలో జాతిపిత మహాత్మాగాంధీ ఆమోదించారని తెలిపారు.

వ్యవసాయరంగలో విస్తృత పరిశోధనలు చేసి అనేక ఆధునిక పద్ధతులకు అంకురార్పణ చేశారని వివరించారు. వ్యవసాయరంగంలో  ఆయన అవలంభించిన ఆధునిక పద్ధతులు ముఖ్యంగా పత్తి, నూనె గింజల పంటలు ప్రకృతి వ్యవసాయం  గురించి తాను కనుగొన్న విషయాలు భావితరాలకు ఉపయోగపడేవిధంగా పుస్తకం వ్రాశారని, నేటికీ  ఆ సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. వెంకయ్య గారు 30 పైగా దేశాలలో పర్యటించారని, రాయల్‌ అ‌గ్రికల్చర్‌ ‌సొసైటీ లో సభ్యత్వం కూడా పొందారని తెలిపారు. పి.ఐ.బి •ఆర్‌.ఓ.‌బి డైరెక్టర్‌  ‌శ్రీమతి శృతి పాటిల్‌ ‌ప్రారంభోపన్యాసం చేస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు ఈ ఏడాది మార్చి 12 వ తేదీ నుంచి 75 వారాలపాటు నిర్వహిస్తున్నామని, దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకునే అద్భుత అవకాశం మనకు లభించిందని  ప్రధానమంత్రి  నరేంద్ర మోడి అన్నమాటలను ఉటంకించారు.

Leave a Reply