Take a fresh look at your lifestyle.

జాతీయ విద్యా విధానం-2020 అమలుకు రాష్ట్రాల అభ్యంతరాలు సబబేనా..!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ ‌లిస్ట్) ‌చేర్చబడింది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ  (జాతీయ భాష)ని తప్పనిసరి చేయడంతో తమిళుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం జరిగింది. నాడు యన్‌ఈపీ-1968ని అన్నాదురై నేతృత్వంలో తమిళులు తీవ్ర ఆందోళనలు జరపడం, హిందీ సబ్జెక్టును తప్పనిసరి చేయడం తగదని ప్రజాందోశనలు పెల్లుబికడం, యన్‌ఈపీ-1968 అమలుకు అంగీకరించమంటూ హిందీ సబ్జెక్టు తమకు సమ్మతం కాదని భీష్మించుకోవడం చూసాం.
యన్‌ఈపీ అమలు ప్రశ్నార్థకం :
పలు రాజకీయ, భాషా, సామాజిక కారణాలతో యన్‌ఈపీ పూర్తి అమలు ప్రశ్నార్థకంగా మారింది. యన్‌ఈపీ-1986 ప్రకారం ప్రతి రాష్ట్ర ఒక ఓపెన్‌ ‌యూనివర్సిటీని ప్రారంభించాలని సూచించినప్పటికీ కేరళ మాత్రం 2020 వరకు ప్రారంభించనేలేదు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టిన ‘జవహర్‌ ‌నవోదయ విద్యాలయాల(జెయన్‌వి)’ స్థాపన ద్వారా హిందీ భాష తప్పనిసరి చేయడంతో నేటికీ తమిళనాడు రాష్ట్రంలో జవహర్‌ ‌నవోదయ విద్యాలయాలను ప్రారంభించనేలేదని తెలుసుకోవాలి. యన్‌ఈపీ-1986 ప్రతిపాదించిన ‘నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ‘ సంస్థను కేంద్ర ప్రభుత్వమే 2017 వరకు ప్రారంభించకపోవడం కూడా యన్‌ఈపీ-1986 పవిత్రతను నీరుగార్చినట్లు అయ్యింది. 1966లోనే ఆర్టికిల్‌-45 ‌ద్వారా 14 ఏండ్ల వరకు పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్య చట్టం తీసుకువచ్చినప్పటికీ నాడు ప్రాథమిక పాఠశాలలో 76.7 శాతం, ప్రాథమికోన్నత విద్యలో 30.8 శాతం, ఉన్నత పాఠశాలలో 16.2 శాతం నమోదు మాత్రమే గమనించారు. 2010లో విద్యను పిల్లల మౌళిక హక్కుగా ‘రైట్‌ ‌టు ఎడ్యుకేషన్‌ ‌బిల్‌’‌ను కూడా తీసుకురావడం జరిగిందని మనకు తెలుసు.
యన్‌ఈపీ-2020 అమలు పట్ల కొన్ని అభ్యంతరాలు :
యన్‌ఈపీ-2020లో ప్రతిపాదించిన నాలుగంచెల 5ం3ం3ం4 విద్యా విధానం (ఫండమెంటల్‌, ‌ప్రిపరేటరీ, మిడిల్‌, ‌సెకండరీ విద్య) ఫలితంగా నేడు మన రాష్ట్రాలు పాటిస్తున్న 10ం2 విధానానికి ప్రాధాన్యం కోల్పోవలసి వస్తున్నది. దీనికి విరుగుడుగా నేడు వివిధ రాష్ట్రాల తల్లితండ్రులు, పిల్లలు స్టేట్‌ ‌సెలబస్‌ ‌నుంచి సెంట్రల్‌ ‌సిబియస్‌సి విధానానికి మారడం చూస్తున్నాం. నేటి యన్‌ఈపీ-2020 విధానంలో ప్రతిపాదించిన ‘అకడమిక్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌క్రెడిట్స్ (ఏబిసి)’, ‘4-ఏండ్ల డిగ్రీ’, ‘మల్టీ ఎంట్రీ’, ‘మల్టీ ఎగ్జిట్స్’, ‘ఇం‌టిగ్రేటెడ్‌ ‌టీచర్‌ ఎడ్యుకేషన్‌ ‌ప్రోగ్రామ్‌’ ‌లాంటివి సముచితంగా, ప్రయోజనకరంగా ఉండడంతో అందరి ఆమోదం పొందుతున్నది. యన్‌ఈపీ-2020ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు కూడా కొన్ని ప్రతిపాదనలను ఆమోదించి పాటించడం కూడా జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా 4-ఏండ్ల డిగ్రీ విధానాన్ని అమలు చేయడం శుభపరిణామంగా తీసుకోవాలి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌ ‌లాంటి రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసాయి ..
రాజకీయ, సామాజిక కారణాలతో విద్యా విధానాలను వ్యతిరేకించడం సముచితం కాదని, మారుతున్న కాలంతో పాటు మన విద్యా విధానం కూడా మారాలని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలు పిల్లల చదువులకు అడ్డుపడకూడదు. ప్రాంతీయ భాషకు పట్టం కడుతూనే జాతీయ భాష హిందీలో కనీస పరిజ్ఞానం ఉండడం, గ్లోబల్‌ ‌లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్‌ ‌భాషలో పట్టు సాధించాలి. స్వభాషా మోజులో పరభాషలను వ్యతిరేకించరాదు. ఆంగ్ల భాష వ్యామోహంలో తమ ప్రాంతీయ భాషను చిన్న చూపు చూస్తున్న తెలుగు రాష్ట్రాలను కూడా చూస్తున్నాం. భూమి కుగ్రామంగా మారిన నేటి డిజిటల్‌ ‌యుగంలో త్రిభాషా సూత్రం దేశ యువతకు ప్రయోజనకారిగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply