Take a fresh look at your lifestyle.

‌బహు భాషా కోవిదుడు ‘‘మౌలానా’’

‘‘‌వెలకట్టలేని సంపదను వదిలేసి, భౌతిక సంపదలకోసం ఆరాటపడుతూ, మానవుడు సృష్టించిన కరెన్సీకి మానవులే బానిసలై స్వార్థపరులుగా, అవినీతి పరులుగా తయారౌతున్నారు. మానవ కల్పిత కరెన్సీకున్న విలువ, మేథా సంపదకు లేకపోవడం దురదృష్టకరం. చోరుల పరంకానిది, పంచితే పెరిగేది, జ్ఞానాన్ని ప్రసాదించేది కేవలం విద్యాధనమే తప్ప మరొకటి కాదు. అలాంటి తరగని ధనం కోసం ఆరాటపడాలి. జ్ఞాన సముపార్జనకు పోరాడాలి. జ్ఞానం జనన మరణాలకతీతం. ఈ విషయాన్ని గుర్తించిన నాటితరం విద్యార్జన కోసం తమ జీవితకాల సమయాన్ని వెచ్చించింది. నాటి విద్యావేత్తలు, రాజకీయ నాయకులు విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి, విద్యావ్యాప్తి కోసం అనేక విధాలుగా అహరహం శ్రమించారు. అలాంటి విశిష్ఠమైన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు మౌలానా అబుల్‌ ‌కలాం అజాద్‌.’’

(రేపు జాతీయ విద్యా దినోత్సవం)

ప్రపంచంలో ప్రతీ ఒక్క రూ అసలైన ధనాన్ని వదిలేసి, కాగితాలపై ముద్రించిన కృత్రిమమైన సంపదకోసం వెంపర్లాడుతున్నారు. వెలకట్టలేని సంపదను వదిలేసి, భౌతిక సంపదలకోసం ఆరాటపడుతూ, మానవుడు సృష్టించిన కరెన్సీకి మానవులే బానిసలై స్వార్థపరులుగా, అవినీతి పరులుగా తయారౌతున్నారు. మానవ కల్పిత కరెన్సీకున్న విలువ, మేథా సంపదకు లేకపోవడం దురదృష్టకరం. చోరుల పరంకానిది, పంచితే పెరిగేది, జ్ఞానాన్ని ప్రసాదించేది కేవలం విద్యాధనమే తప్ప మరొకటి కాదు. అలాంటి తరగని ధనం కోసం ఆరాటపడాలి. జ్ఞాన సముపార్జనకు పోరాడాలి. జ్ఞానం జనన మరణాలకతీతం. ఈ విషయాన్ని గుర్తించిన నాటితరం విద్యార్జన కోసం తమ జీవితకాల సమయాన్ని వెచ్చించింది. నాటి విద్యావేత్తలు, రాజకీయ నాయకులు విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి, విద్యావ్యాప్తి కోసం అనేక విధాలుగా అహరహం శ్రమించారు. అలాంటి విశిష్ఠమైన వ్యక్తుల్లో అగ్రగణ్యుడు మౌలానా అబుల్‌ ‌కలాం అజాద్‌. ‌మక్కాలో జన్మించినా భారతీయ మూలాలను గ్రహించి భారత దేశం కోసం నిరంతరం తపించిన బహు భాషా కోవిదుడు ‘‘మౌలానా’’.

ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది ‘‘మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌’’ ‌జయంతిని జాతీయ విద్యాదినోత్సవంగా 2008వ సంవత్సరంలో అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రకటించింది. మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపి)లో భాగంగా తిరిగి విద్యా శాఖగా మార్పుచేయడం జరిగింది. మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌స్వతంత్య్ర భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి విద్యా శాఖా మంత్రిగా దశాబ్దకాలానికి పైగా పని చేసారు. మొహియుద్దీన్‌ అహ్మద్‌ అనే పేరు కాలక్రమంలో జరిగిన పరిణామాలను అనుసరించి, మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌గా స్థిర పడి పోయింది. పెరిగిన కీర్తి ప్రతిష్ఠల ఆధారంగా ఆయనకున్న బిరుదు, కలం పేరు కలగలిసి ‘‘మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌’’‌గా ప్రజలకు సుపరిచితమైనది. ఆజాద్‌ ‌జాతీయ వాది, ఆంగ్లేయుల కుటిలయత్నమైన హిందూ, ముస్లిం విభజనకు వ్యతిరేకంగా పోరాడి, వారి మధ్య ఐక్యతకు కృషిచేసి, పలువురి మన్ననలు పొందాడు.

మత ప్రాతిపదికన భారత్‌ ‌నుండి ముస్లింలను విభజించి, పాకిస్తాన్‌ అనే ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడాన్ని మౌలానా వ్యతిరేకించాడు. అతను గాంధీ, నెహ్రూ, పటేల్‌ ‌వంటి వారితో కలిసి పనిచేసి, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేసాడు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రముఖ నాయకులతో సైతం సైద్ధాంతిక పరంగా విభేదించాడు. మౌలానా రచించిన ‘‘ఇండియా విన్స్ ‌ఫ్రీడమ్‌’’ ఒక వివాదాస్పద పుస్తకంగా మిగిలింది. తాను బ్రతికున్న కాలంలో ఈ పుస్తకాన్ని ప్రజాబాహుళ్యంలోకి తెచ్చి వివాదాలను కొని తెచ్చుకోలేక తన మరణానంతరం తన రచన బహిర్గతం కావాలని మౌలానా వాంఛ. తాను మరణించిన  చాలా కాలం తర్వాత  ‘‘ఇండియా విన్స్ ‌ఫ్రీడమ్‌’’ ‌పలు వివాదాల, కోర్టు వ్యాజ్యాల తర్వాత ప్రజల్లోకి వొచ్చింది. అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌వ్యక్తిగతంగా ఎవరికీ శతృవు కాదు. సైద్ధాంతిక భావజాలం వలన కొన్ని సంఘటనలు జరిగినా ఆజాద్‌ ‌దేశభక్తి శ్లాఘించదగ్గది. ఆజాద్‌ ‌విద్యా శాఖా మంత్రిగా ప్రాథమిక, ఉన్నత విద్యల్లో అనేక సంస్కరణలు చేపట్టి విద్యా రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఆంగ్లేయుల పాలనలో అడుగంటిన భారతీయ విద్యావ్యవస్థను గాడిలో పెట్టి, భారతీయ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, కళలను కాపాడడానికి కృషి చేసిన భారత రత్న మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని జాతీయ విద్యాదినోత్సవంగా ప్రకటించడం సందర్భోచితం..సముచితం.

– సుంకవల్లి సత్తిరాజు.
  ఫోన్‌ : 9704903463

Leave a Reply