ఆ నాలుగు వాక్యాల్ని
నమిలించి మింగించండి.
గట్టిగున్నాయన్నా వినొద్దు
చేదుగున్నాయన్నా ఆగొద్దు.
నోటికి పట్టకపోయినా
నాలుక్కి గుచ్చుకున్నా
గొంతులో దిగకపోయినా
జాలిచూపించవద్దు.
జోగాడే నాటి నుండి
పారాడే పదాల పరుగును చూపితే
ధారాళంగా ఎదిగే ధారణ దారిలో
తారాజువ్వలా ఎగిసేను.
పెట్రేగే యువతకు
ఎంచక్కని భావాలను ఎగబాకడం నేర్పితే
ఘోరాలు లేని నడతతో
శరవేగంతో గమ్యాన్ని చేరేను.
కాగితం జీవితంలోకి రాకముందే
మనిషి అనుభవానికి
పుట్టిన ఆ నాలుగు వాక్యాలు
నాలుకపై నర్తించేదే తెలుగు పద్యం.
నెమరవేసుకొనికొద్ది
గుండెకు సోకిన ఈ పాతకాలపు రుచి
ఆధునిక అనారోగ్యానికి ఔషధం.
జీవితారోగ్యానికి పునాది.
– చందలూరి నారాయణరావు
83094 6356