Take a fresh look at your lifestyle.

నవయుగాల బాట నార్ల మాట

బాల్యం నుండే సామాజిక స్పృహ కలిగి ఎన్నో వ్యాసాలను విభిన్న పత్రికలలో రాస్తూ ఉండేవారు..  తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి  నార్ల.

నేడు నార్ల జయంతి

ప్రజాస్వామ్యం విజయ వంతం కావాలన్నా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుండి ప్రజలు రక్షణ పొందాలన్నా పత్రి కలు అత్యంత అవ కశ్యకం అంటూ ’’పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో.. ’’ అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి పత్రికా రంగంలో   అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టిన పాత్రికేయుడు.
1908 డిసెంబర్‌1‌వ తేదీన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. ఆరేళ్ల వయస్సు వచ్చాక ఆయన కృష్ణాజిల్లా ’’ కవుతరం ’’ అనే గ్రామానికి వచ్చారు. తొలి సారిగా జర్నలిజంలోకి 1930లో స్వతం త్రభారత్‌ అనే పత్రికద్వారా ప్రవేశించారు. బాల్యం నుండే సామాజిక స్పృహ కలిగి ఎన్నో వ్యాసాలను విభిన్న పత్రికలలో రాస్తూ ఉండేవారు..  తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి  నార్ల.ముఖ్యంగా ప్రజా పాత్రికేయానికి శ్రీకారం చుట్టి పత్రికా రంగానికే వెలుగులు పంచారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ముఖ్యంగా పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేయడంలో ఆయన విశేష కృషి జరిపారు. ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి,నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీ కతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు. సంపాదకీయం ఆంటే పత్రికకు ప్రాణ దీపము వంటిదని సంపాదకీయానికి గొప్ప గుర్తింపు తీసుకు వచ్చినది మాత్రం నిస్సం దేహంగా నార్ల. ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చ రించిన యోధుడు నార్ల.
ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల. ‘‘నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా’’ అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. ‘‘ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్‌ ‌కానేకాడు.’’ అని నిష్కర్షగా చెప్పేవారు. ఎడిటర్‌ ‌గా అలాగే నిష్కర్షగా తన వృత్తి బాధ్యతలను ముక్కు సూటిగా వ్యవహరీంచే వారు. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ‘బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా’ అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత నార్ల. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, ఎన్‌ ‌జి రంగా, కాసు బ్రహ్మానందరెడ్డి మొదలైన పెద్దలందరూ నార్ల కలంపోటుకు గురైనవారే. తేడా వస్తే, పతాక శీర్షికల్లో వాళ్ళ గురించి ధ్వజమెత్తేవారు. అంతటి ధైర్యశాలి నార్ల. జీవిత కాలం అంతా ఆయన ఏ ఒక్క ‘ఇజమ్‌‘‌కూ లొంగకుండా, దేనికీ తలవంచకుండా స్వేచ్ఛగా వృత్తిని కొనసాగించి ఆదర్శ ప్రాతికేయులయ్యారు. పాత్రికేయానికి మార్గదర్శకులయ్యారు.
పత్రికా ఎడిటర్‌ ‌గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యలు పరిష్కరింప బడ్డాయి. పత్రికకు దర్పణంగా చెప్పుకునే సంపాదకీయాల స్థాయిని విశిష్ట ప్రాధాన్యత ఇచ్చిన ఘనత నార్లదే. కేవలం నార్లవారి సంపా దకీయాల కోసమే పత్రికలు చదివే వారంటే- అది నార్లవారికే చెల్లింది. కలంయోధుడు అనే మాట అక్షరాలా నార్లకు సరిపోతుంది.  కత్తి కంటే కలం శక్తివంతమైందని నార్ల తన అక్షర యజ్ఞం ద్వారా నిరూపించారు. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ‘కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత ‘కారం’ ఉందో తెలియజెప్పినవాడు’ నార్ల.విరామమెరుగని రాక్షసుడు నార్ల’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు. పుస్తక సమీక్షలును కూడా సంపాదకీయాలుగా రాసే కొత్త సంస్కృతికి తెర తీశారు నార్ల.అంతే కాదు వీటిని ఇంగ్లిష్‌ ‌లో కూడా అనువాదం చేయించడం వలన ఎందరో తెలుగు రచయితలకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించడానికి వీలు కలిగింది. నార్లవారి పాత్రికేయ జీవితాన్ని పరిశీలిస్తే, తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆత్మగౌరవం, సిద్ధాంతం పట్ల గౌరవంగా వీటిని భావించాలి.
నార్ల కేవలం పాత్రికేయుడు మాత్రమే కాదు సాహిత్యవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు, హేతువాది, మానవవాది గా తన ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నాడు. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు ఎన్నో రాశారు.వివిధ దేశాల చరిత్రలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు గురించి రచనలు చేసి విజ్ఞానాన్ని నైతిక విలువలు గురించి సామాన్య ప్రజానికి పరిచయం చేశారు నార్ల.ఏది ఏమైనా నార్ల ఏవి రాసినప్పటికి అందులో సామాజిక ప్రయోజనం ఉండేది.దానికి భిన్నంగా ఏనాడూ తన రచనలు చేపట్టలేదు.ఎప్పుడూ రాజీ పడలేదు.
ఆయనకు తెలుగుపైనే కాదు ఆంగ్లంపైన కూడా మంచి పట్టు ఉంది.ఆంగ్లంలో కూడా అనేక రచనలు చేసి పలువురు ప్రశంసలు కూడా పొందారు.ప్రదానంగా  భగవద్గీతపై ఆంగ్లంలో ఆయన చేసిన విమర్శనాత్మక రచన ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది.అంతే కాదు ఆ రచన అనేక విదేశీ జర్నల్స్ ‌కూడా ప్రచురితం అయ్యింది అంటే ఆంగ్ల రచనలో ఆయనకు గల పటుత్వం తెలుస్తుంది.అంతే కాదు నార్లవారు ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు సృష్టించారు. మాండలీకాలకు పెద్దపీట వేశారు. ఇంగ్లీష్‌ ‌పదాలకు సమానార్ధకాలు నిర్దేశించే క్రమంలో, తిరోగమనం, ఐక్య రాజ్య సమితి, దిగ్బంధనం మొదలైనవాటిని ఎన్నింటినో ఉదాహరణగా చెప్పవచ్చు. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన సొత్తు. వారు ఒక కదిలే విజ్ఞాన భాండాగారం. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత.
ఆయన జీవిత చరమాంకం వరకూ మూఢ నమ్మకాలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే వచ్చారు.సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ సీతజోస్యం రాశారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ శంబూక వధ రాశారు.ఆయన చివరి వరకూ కూడా హేతువాదిగా, మానవవాదిగా జీవిం చారు. విశ్వనాథ సత్యనారాయణ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వంటి వారి ఆస్తిక, ఛాందస భావజాలాన్ని, మూఢ విశ్వాసాలను నార్ల తీవ్రంగా విమర్శించేవారు.
బాలలకు కుడా సాహిత్యాన్ని అందించాలని ఆ సాహిత్యం ద్వారా చిన్న వయసు నుండీ వారిని మూఢ నమ్మకాలు నుండి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత
నవయుగాల బాట నార్ల మాట’గా మార్చి ఆ మకుటంతో 700కుపైగా సందేశాత్మక పద్యాలు ఆటవెలిది లో రాశారు. సామాజిక రుగ్మతలపై తన అక్షరాలతో పోరాటం చేయడంలో ఆయన వేమనను ఆదర్శంగా తీసుకున్నారు.
నవయుగాల బాట నార్ల మాట లో వారి హేతువాద భావజాలం మనకు ఎక్కువ కనపడుతుంది.
బౌద్ధమతాన్ని నమ్మడమే కాకుండా ఆచరించి స్వచ్ఛమైన హేతువాదిగా చివరి వరకూ జీవించారు.ఆయన జీవిత కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించి వచ్చాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విద్యాలయం డి.లిట్‌ ‌ప్రదానం చేసాయి.  కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ సభ్యులుగా, రాష్ట్ర సంగీత నాటక కళా అకాడమీ సభ్యులుగా, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా కూడా నార్ల పనిచేసారు.ఆయన రచించిన సీతజోస్యం అనే నాటికకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినా కొన్ని అనివార్య కారణాల వలన ఆయన పురస్కారాన్ని స్వీకరించలేదు.
1958 ఏప్రిల్‌3‌వ తేదీనుండి 1970 ఏప్రిల్‌ 2‌వ తేదీన వరకు ఆయన రాజ్యసభ సభ్యులుగా (రెండు సార్లు) ఎన్నికయ్యారు. ఎన్నో అర్ధవంతమైన చర్చలను సభలో జరిపారు. పార్లమెంట్‌ ‌సభ్యుడిగా రాజకీయాలను ప్రత్య క్షంగా చూసిన తరువాత రాజకీయ కాలుష్యంపై ప్రజాస్వామ్యంపై వోటు  హక్కు విషయమై రాజకీయ నాయకుల అవినీతిపై సామాన్యుల కు కూడా అర్ధమయ్యే రీతిలో ఆయన  నవాయు గాల బాట నార్ల మాట పేరుతొ పద్యాలు రాశారు. జర్నలిస్ట్ ‌గా సాహిత్యవేత్తగా, కవిగా, రచయితగా ఉద్యమకారుడుగా, హేతువాదిగా, మానవవాదిగా అందరి మదిలో చిరస్మరణీ యుడిగా నిలచిన నార్లవారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిద్దాం.
image.png
రుద్రరాజు శ్రీనివాసరాజు.
9441239578

Leave a Reply