- ప్రజల సొమ్మును గౌతం అదానికి దోచిపెడుతున్నారు
- 2022 కల్లా రై•తుల ఆదాయం డబుల్‌చేస్తా అన్నరు…
- ఎనిమిది ఏండ్లల్లో ధరలు పెంచిన గొప్ప పాలన
- ఈటల తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుంది
- జమ్మికుంట సభలో మంత్రి కెటిఆర్
నరేంద్రమోడిది దుర్మార్గమైన పాలన అని, ప్రజల సొమ్మును గౌతం అదాని లాంటి బడాబాబులకు దోచిపెడుతున్నారని, 2022 కల్లా రై•తుల ఆదాయం డబుల్ చేస్తానని రైతుల వ్యవసాయ బావుల దగ్గర మోటర్లు బిగించడానికి పూనుకున్నారని రాష్ట్ర ఐటీ. పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కెటిఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. హుజురాబాద్ నుండి జమ్మికుంట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణానికి చేరుకున్న కెటిఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్సీలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి ప్రజల సొమ్మును గౌతం అదాని లాంటి బడాబాబులకు దోచిపెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టాడని, 2022 కల్లా రైతుల ఆధాయం డబుల్‌చేస్తానని చెప్పారని, ఎనిమిది ఏండ్లల్లో ధరలు పెంచిన గొప్ప పాలన ప్రధాని మోడీదని ఎద్దేవా చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపారని అన్నారు. ఇక ఈటల వ్యవహరిస్తున్న తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లుందని, గెలిచి 14 నెలలైనా హుజురాబాద్‌లో ఒక్క పని కూడా చేయలేదన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన బిఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్న ఈటలకు రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం చెప్తారన్నారు. బండిసంజయ్ గెలిచి ఒక్క పైసా అభివృద్ధి పనిచేయలేదని విమర్శించారు. చేతనైతే ఒక మెడికల్ కళాశాలను తీసుకొచ్చి విద్యార్థులకు న్యాయం చేయమని అన్నారు. దమ్ముంటే హుజురాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్‌కు పునాదులు తీద్దాం వొస్తావా అని సవాల్ విసిరారు. కెసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, తాడికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పిచైర్‌పర్సన్ కనుమల్ల విజయ, టిఆర్‌ఎస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్‌రావు, జడ్పిటిసి డా।। శ్రీరాంశ్యామ్, ఎంపీపీలు దొడ్డే మమత ప్రసాద్, సరిగొమ్ముల పావని వెంకటేష్ ,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పొనగంటి మల్లయ్య తో పాటు కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.