Take a fresh look at your lifestyle.

మితిమీరుతున్న ‘తారక’మంత్రం..

nara lokesh, ktr, kcr, chandrababu naidu, over respectఉండ్రాళ్ళ మీద భక్తితో వినాయకుణ్ణి పూజించినట్టు తెలంగాణలో పదవుల మీద ఆశతో పార్టీ అధినేతను, ఆయన కుమారుణ్ణి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాము చేస్తున్న భజన వల్ల పార్టీకీ, పార్టీ అధ్యక్షునికీ ఎంత హాని జరుగుతుందో వారు ఆలోచించడం లేదు. అధినాయకుడు కూడా మొదట్లో వారించినా   ఇప్పుడు మిన్నకుంటున్నారు. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే( కేసీఆర్‌ ‌కుమారుడు కే తారకరామారావు) అని బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేసీఆర్‌ ‌పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనను వెన్నంటి ఉండి పార్టీ కోసం ఎన్నో సేవలు అందించిన సీనియర్ల మనసును గాయపర్చినట్టు అవుతుందన్న ధర్మాన్ని కూడా పాటించకుండా  కేటీఆరే కేసీఆర్‌ ‌వారసుడని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో, కేంద్రంలో రాజకీయాలు చేసే అవకాశం ఇప్పుడు కె చంద్రశేఖర్‌ ‌రావుకు లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ‘ఫెడరల్‌ ‌ఫ్రెంట్‌’ ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో చక్రం తిప్పుదామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌ ‌రావు ఆలోచన సాధ్యం కాలేదు. ఆ అవకాశం ఉంటే రాష్ట్రంలో కుమారుడు కె టి రామారావు ముఖ్యమంత్రి అన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సంపూర్ణ ఆరోగ్యంతో రాష్ట్ర పరిపాలనకు పరిమితం కావడం తెలిసి కూడా మంత్రులు కెటిఆర్‌ ‌భజన చేయడం సమంజసంగా లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమై ఉండవచ్చు. కానీ పార్టీలోని ముఖ్యులను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. ఈ ప్రకటనలను కేటీఆర్‌ ‌ఖండించినా,  కేసీఆర్‌ ఇం‌కా ఖండించకపోవడం గమనార్హం. అది కేసీఆర్‌ ‌మనసులో మాట  అని జనం అనుకునేట్టు కేసీఆర్‌ ‌మౌనం పాటిస్తున్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్‌ ‌చివరి అంకంలో ధైర్యాన్ని, వజ్ర సంకల్పాన్ని ప్రదర్శించిన మాట నిజమే. నిరాహార దీక్ష ద్వారా జనం గుండెలకు దగ్గరైన మాట నిజమే. అందుకే ఆయనను విశ్వసించి రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు. ఆయన ప్రారంభించిన పథకాలు నచ్చి రెండో సారి అవకాశం ఇచ్చారు. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. .

 

వాటిని పూర్తి చేసే వరకూ ఆయనే ఉండాలన్నది ప్రజల  అభిమతం, అందుకే ఆయనకు రెండో సారి అధికారం ఇచ్చారు. మధ్యలో కేటీఆర్‌కి వారసత్వం ఇవ్వాలన్న డిమాండ్‌ ఎక్కడి నుంచి వొచ్చిందో తెలియదు. ఒకరు అందుకుంటే మిగతా వారు కోరస్‌  అం‌దుకుంటున్నారు. కేటీఆరే స్వయంగా అన్నట్టు ప్రస్తుతం అది అసంగతం. అయితే, కేటీఆర్‌ ‌మరో అడుగు ముందుకు వెళ్ళి మరో దశాబ్దం పాటు కేసీఆరే ఉంటారని అన్నారు. కేటీఆర్‌ ‌కాబోయే ముఖ్యమంత్రి అనడం ఎంత అతిగా ఉందో, కేసీఆర్‌ ‌మరో పదేళ్ళ పాటు ముఖ్యమంత్రి అన్న మాట కూడా అంత అతిగానూ ఉంది. గత డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తి అయ్యే వరకూ ఆగకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల తాము ఎవరినైతే ఆకాశానికి ఎత్తాలని అనుకుంటున్నారో ఆ కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు హాని చేస్తాయి. వొచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో ఇలాంటి ప్రకటనల ప్రభావం ఎంతో ఉంటుంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరించిన సాచివేత ధోరణికి ఆర్టీసీ కార్మికులు లోలోపల కుతకుత ఉడుకుతున్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన పడుతున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వారు తమ మనసులో మాట బయట పెట్టవొచ్చని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఆర్టీసీ సమ్మె విసిరిన సవాల్‌తో ప్రజల్లో పలుచన  అయిన ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రకటనలు మరింత పలుచన పరుస్తాయి. అంతేకాక, కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీనీ, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కించ పర్చేలా ప్రకటనలు చేయడం తెరాసకు నష్టం. మునిసిపల్‌ ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలను నివారించకపోతే ఎన్నికల్లో పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. అయినా ఇది ప్రజా స్వామ్య యుతం కూడా కాదు.   మంత్రులనూ, నాయకులనూ కేసీఆర్‌ అదుపులో పెట్టలేకపోతున్నారనే భావం వ్యాప్తం కావడానికి ఇలాంటివి దోహదం చేస్తాయి.

Tags: nara lokesh, ktr, kcr, chandrababu naidu, over respect

Leave a Reply