Take a fresh look at your lifestyle.

నమ్మకాలు వమ్ము అయిన వేళ…!

దశాబ్ధాలతరబడి పార్టీలకు, నాయకులకు సేవ చేసినా చివరకు మిగిలేది అపనమ్మకమేనా ! ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని పలువురు అధికార పార్టీ నాయకుల్లో చెలరేగుతున్న ప్రశ్న. ఎంతో విశ్వాసంగా పార్టీ ఏది చెబితే దాన్ని విజయవంతం చేస్తూ, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించడంలో శక్తిమేర కృషిచేసిన వారికి పార్టీ ఇచ్చే పారితోషకం ఆ వ్యక్తులపై అపనమ్మకమనే కితాబేనా..! తాజాగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇదే అంశం పై ఇద్దరు సీనియర్‌ ‌నాయకులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాల పర్వం ఇంతటితో ఆగిపోతుందా, మరి కొందరి రాజీనామాలకు బాట వేస్తుందా ఇప్పుడప్పుడే చెప్పలేముకాని, పార్టీలో అసంతృప్తి శాతం పెరుగుతుందన్నది బహిరంగ రహస్యమే. ప్రజా సమస్యలను, పార్టీలో క్రిందిస్థాయి నాయకులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదన్నది చాలా కాలంగా నలుగుతున్నది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇది ప్రతిధ్వనించింది. ముఖ్యంగా కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహావేశాలు వెలుబుచ్చిన విషయం తెలియందికాదు. పాలనలో తమకు సరైన ప్రాతినిథ్యం లభించడం లేదని, సరైన నిధులు సమకూర్చక పోవడంతో తమ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేక పోతున్నామన్న తీవ్ర నిరాశ, నిస్రృహ వారిని ఆవరించింది.

వాస్తవంగా స్థానిక సంస్థల్లో అధికార టిఆర్‌ఎస్‌కే ఎక్కువ మెజార్టీ ఉంది. పార్టీ పరంగా నిలబడిన ఎమ్మెల్సీ అభ్యర్థులు సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. అది తెలిసికూడా కొందరు అధికార పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారంటే వారు ఎంతటి అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది అర్థం చేసుకోవొచ్చు . అలాగే పార్టీని, పార్టీ సారథిని నమ్ముకుని ఏళ్ళుగా సేవలందించినా ఫలితం లేకుండా పోతున్నదన్నది సీనియర్‌ ‌నాయకుల్లో బయలు దేరింది. గురువారం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ ‌నాయకుడు గట్టు రామచందర్‌రావు, కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన సర్దార్‌• ‌రవీందర్‌ ‌సింగ్‌ ‌రాజీనామాలు పార్టీలో ఉన్న అసంతృని బహిర్ఘతం చేస్తున్నాయి. వీరిద్దరుకూడా పార్టీ రథసారధులైన కెసిఆర్‌, ‌కెటిఆర్‌కు అత్యంత సన్నిహితులుగా, నమ్మకస్తులుగా మెదిలినవారు. ముఖ్యంగా రవీందర్‌సింగ్‌ ‌పార్టీ పరంగా చేపట్టిన అనేక కార్యక్రమంలో కెసిఆర్‌కు, కెటిఆర్‌కు కుడిభుజంగా ఉంటూ, వారి నోట్లో నాలికగా మెదిలిన విషయం కరీంనగర్‌తోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడాయన అలిగి పోవడానికి కారణం తనకు ఇస్తానన్న ఎమ్మెల్సీ టికట్‌ను కేటాయించడంకన్నా, పార్టీ అధినేతను కలుసుకునే అవకాశంకూడా లేకపోయిందన్నదే ఆయన్ను ఎక్కువగా బాధిస్తున్న విషయం. కరీంనగర్‌ ‌మేయర్‌గా పనిచేసి, ప్రస్తుతం కార్పొరేటర్‌గా కొనసాగుతున్న రవీందర్‌సింగ్‌కు స్థానిక సంస్థలతో మంచి అనుబంధముంది. అయన తనకున్న అధికార పరిధిలో మృతిచెందిన వారి అంతిమ యాత్ర విషయంలో ‘ఆఖరి సఫర్‌’ ‌పేరున కేవలం ఒక రూపాయకే అంత్యక్రియల వినూత్న పథకాన్ని కరీంనగర్‌లో ప్రవేశపెట్టి పలువురి మన్నలను పొందిన వ్యక్తి. అలాగే రూపాయకే రోగ నిర్థారణ పరీక్షలు, స్మార్ట్‌సిటీ పేరున ప్రజలకు చేరువయ్యే అనేక ఆసక్తి పథకాలను ప్రవేశపెట్టడంద్వారా పలువురితో శభాష్‌ అనిపించుకున్న వ్యక్తి. అలాంటి తనకు గతంలో పార్టీ అధినేత కెసిఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంతో అసంతృప్తి చెంది గురువారం పార్టీకి రాజీనామా చేశాడు.

ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో నిలిచాడు. పార్టీ సీనియర్‌లంతా ఆయన అభ్యర్థిత్వాన్ని విరమించుకోవాలని ఎంత బతిమిలాడినా ససేమిరా అని పోటీ పడుతున్నాడు. గతంలో తనకిస్తానన్న ఎమ్మెల్సీ స్థానాన్ని స్వామిగౌడ్‌ ‌కు కేటాయించిన, ఆ తర్వాత కూడా మరొకరికి కేటాయించిన వారి గెలుపుకు శక్తిమేర కృషిచేసిన తనను పార్టీ అధినేత పట్టించుకోక పోవడంవల్లే తానిక పార్టీలో ఇమడలేనన్నది అర్థమయి, పార్టీ వీడుతున్నట్లు స్వయంగా పార్టీ అధినేతకు లేఖ ద్వారా తెలిపాడు. అలాగే మరో నేత గట్టు రామచందర్‌రావు.. ప్రతిపక్షాల విమర్శలను పార్టీ ప్రతినిధిగా మీడియా సమావేశాల్లో తిప్పి కొట్టి పార్టీపై, అధినాయకుడిపై ఈగ వాలకుండా తన మాటల చాతుర్యంతో నెట్టుకొస్తున్న రామచందర్‌రావు కూడా పార్టీ అధినేత తనకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ టికట్‌ను కేటాయించకపోవడంతో తాను అందుకు తగిన వ్యక్తిని కాదని అధిష్టానం భావించి ఉండవచ్చని, అలాంటప్పుడు తాను ఇంకా ఆ పార్టీలో కొనసాగడం అంత సమంజసమైనది కాదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయనకూడా పార్టీ అధినేతకు గురువారం నాటి లేఖలో పేర్కొన్న తీరు ఇప్పుడు పార్టీ వర్గాల్లో కాస్తా అలజడిని లేపుతున్నది. ఇద్దరూ పార్టీకి నమ్మిన బంటు లాంటి వాళ్ళే అయినా, తాము నమ్మకాన్ని కోల్పోయామేమోనంటూ సుతిమెత్తని వ్యాఖ్యలతో తమ నిరసనను వ్యక్తంచేశారు. అధికార పార్టీలో ఉండి, అది కూడా తిరుగలేని మెజార్టీతో ఉన్న పార్టీని వీడిపోవడమంటే వారు ఎంతో మానసిక వేదన అనుభవించి ఉండవచ్చన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply