Take a fresh look at your lifestyle.

నేమ్‌ ‌బోర్డు

చేతులు కట్టుకోవాలి
భుజాలు వంగిపోవాలి
పెదవులకు కుట్లు వేసుకొని

బానిసత్వపు దారులను వెతుక్కోవాలి
అప్పుడు నువ్వు..
..ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోగలవు, పల్లకి ఎక్కగలవు, ఇతరుల కలలను దోచుకొని మనిషితో పాటు మట్టిలోకి తొక్కడానికి సహాయపడగలవు.

ఇప్పుడంతా రాజకీయమే
బలమైన అక్షరాలను పక్కకు నెట్టేసి
ఊరి చివర బిక్కుబిక్కుమంటూ ఎండిపోయిన చెట్టు మీద కూర్చున్న పిట్టను జనంలోకి తెస్తారు, కొత్తగా, వింతగా… పిట్టకు రెక్కలు కుడతారు, రెక్కల కింద కొన్ని అక్షరాలను స్వయంగా పేర్చి ఆహా… ఓహో… అంటారు.

పిట్ట రంగులు పులుముకుంటుంది, ఒద్దికగా మసులుకుంటుంది, విరిగిపోయిన నడుముతో పాదక్రాంతమౌతుంది.

పిట్ట తల నిమురుతారు, రెక్కలపై బిరుదులు, పురస్కారాలు అద్దుతారు, కాళ్లకు సంకెళ్ళు వేసి.. మెడలో గుర్తింపు కార్డును తగిలించి విహారానికి పంపుతారు.

ఎవరి నేమ్‌ ‌బోర్డునో…
..ఎన్ని రోజులని తగిలించుకోగలవు

ఎవరో కూత కూస్తే… ఆట మొదలవ్వాలి, మరెవరో సైగ చేస్తే ఒక ఉదయం నుండి మరో ఉదయానికి ప్రవహించాలి, ఇంకెవరో పది మందిలో కూర్చొబెట్టి రెక్కలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తేనే… నీలో కదలిక.
ఇంతకూ…
..వాళ్లు తెచ్చింది పిట్టనా లేదా కప్పనా?
– అఖిలాశ, బెంగళూరు, 7259511956

Leave a Reply