Take a fresh look at your lifestyle.

‌గ్లోబల్‌ ఇమేజ్‌గామారిన ‘నమస్తే’

భారతదేశం సంప్రదాయం ‘నమస్కారం’ ఇప్పుడు గ్లోబల్‌ ఇమేజ్‌గా మారింది. ఆధునిక ప్రపంచంలో  హలోలు, షేక్‌ ‌హ్యాండ్స్‌ను మాడరన్‌గా భావించిన వారంతా నమస్తేను ఇంతకాలం పాత చింతకాయ పచ్చడిగా చూశారు. కాని, భారతీయ సంప్రదాయం కేవలం సంప్రదాయమే కాదు, శాస్త్రీయమైనదేనన్నదిప్పుడు కొరోనా కారణంగా  ప్రపంచవ్యాప్తమైంది. ఎదుటి మనిషిని గౌరవించే అతి చక్కని ముద్రగా ఇది పరిగణించబడింది. భారతదేశంలో ప్రాచీనకాలంనుండి గురువులు, పెద్దవారెవరైనా ఎదురుపడితే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, ఎంతో వినయంతో నమస్కరించడమన్నది ఆచారంగా వొస్తున్నది.  తాజాగా జరిగిన ఇండియన్‌ ‌గ్లోబల్‌ ‌వీక్‌-2020 ‌సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెన్నో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. అంతేగాక భారతీయులు సహజ సిద్దంగా సంస్కరణల కర్తలన్న విషయాన్ని దీనివల్ల మరోసారి ప్రపంచానికి చాటినట్లైందన్నారు మోదీ. అయితే భారతదేశం ఎప్పుడూ మానవతా దృక్పథంతో కూడిన సంస్కరణలనే ఆవిష్కరించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.

ఇతర దేశాల్లాగానే భారత దేశం గతంలో అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కుని నిలిచింది. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కునే సత్తా దేశానికుంది. అందుకు ఈ దేశ ప్రతిభా శక్తి, సాంకేతికతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నది. కొరోనా మహమ్మారి ఇతర దేశాల ఆర్థిక ప్రగతిని ఎలా దెబ్బదీసిందో భారత్‌ కూడా దాని ప్రభావాన్ని చవిచూసింది. అయితే త్వరలోనే భారత్‌ ‌తిరిగి ఆర్థికంగా పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తపరిచిన తీరు కొరోనా అనంతరం దేశాన్ని ప్రగతివైపుకు పయనింపజేసేందుకు పలు ప్రణాళికలను రూపొందిస్తున్న విషయం చెప్పకనే చెబుతోంది. భారత ఆర్థిక వ్యవస్థనేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో భారత్‌ ‌ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. అందులో భాగంగా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలనుకునే అంతర్జాతీయ కంపెనీలకు భారత్‌ ఎల్లప్పుడూ ఎర్ర తివాచి పరుస్తుందని చెబుతున్న మోదీ, ఇంత కష్టకాలంలోకూడా భారత్‌ ‌ఫార్మారంగం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజేసిన విషయాన్ని గుర్తుచేశారు. విపత్తుల వేళ భారత ఫార్మారంగం కేవలం మనదేశానికే కాకుండా ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.  ఔషధాల ధరలను తగ్గించడంతోపాటు,  అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ రంగం ఎంతో ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆదేశాల అభివృద్ధిలో భాగస్వామి అయిందన్న విషయాన్ని ఆ దేశాలు కూడా ఎన్నటికీ మరువలేవన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.
ఒకవైపు కొరోనా మహమ్మారితో పోరాడుతూనే మరోవైపు ప్రజారోగ్యం, ఆర్థిక పునరుద్దరణ అంశాలపై భారత్‌ ‌దృష్టిపెడుతూనేఉంది. ఇప్పటికే ప్రపంచంలో పిల్లలందరికీ కావాల్సిన వ్యాక్సిన్‌లో మూడింట రెండోవంతు వ్యాక్సిన్‌ను భారత్‌ ‌తయారుచేసింది. అలాగే  ప్రపంచ శాంతికోసం ఏం చెయ్యడానికైనా భారత్‌ ‌సిద్దంగానే ఉంటుంది.  ప్రపంచంలో వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అందుకే అంతర్జాతీయ కంనీలను భారత్‌ ఆహ్వానిస్తోంది. ఈ కంపెనీలకు భారత్‌లో లభించే సదుపాయాలు ఇతర దేశాల్లో చాల తక్కువగా లభించే అవకాశాలుంటాయి. అందుకే  పెట్టుబడులతో రావాలని గ్లోబల్‌ ‌కంపెనీలను భారత్‌ ఆహ్వానిస్తోంది. దేశంలో అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశముంది. ప్రధానంగా వ్యవసాయరంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో అనేక అవకాశాలేర్పడుతున్నాయి. స్టోరేజి, లాజిస్టిక్‌ ‌వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. చిన్న పరిశ్రమల రంగంలోకూడా చాలా అవకాశాలున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ ‌సెక్టార్‌లోకూడా పెట్టుబడులు పెట్టేవిధంగా సంస్కరణలు చేపట్టడం జరిగింది. అలాగే అంతరిక్ష రంగంలోకూడా దేశం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్పాదక, పోటీతత్వం కలిగిన దాన్నిగా మలిచే అవకాశముందంటున్నారు మోదీ.
తెలంగాణ ప్రభుత్వంకూడా అదే స్పీడ్‌లో ఉంది. పారిశ్రామికులు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ స్వర్గధామమంటోంది. ఇక్కడ కూడా ఒక వైపు కొరోనాతో పోరాటం చేస్తూనే మరోపక్క అర్థిక ప్రగతికి బాటలు వేస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ముందుకు వొస్తే ప్రభుత్వం వారికి అన్నివిధాలుగా అండగా ఉంటుందన్న భరోసా ఇస్తోంది. తెలంగాణ ఫార్మారంగం ఇప్పటికే ఎంతో ప్రగతిని సాధించింది. అమెరికాలాంటి దేశాలు  ఇక్కడ ఉత్పత్తిచేసే కొరోనా మందులపైనే ఆధారపడ్డాయంటే ఎలాంటి ప్రగతినిసాధించిందో అర్థమవుతోంది. ఔషధ, జీవశాస్త్రాలు, ఐటీ, జౌళి, వైమానిక, రక్షణ లాంటి పద్నాలు రంగాల్లో పెట్టుబడులను ఇక్కడి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. మొత్తంమీద భారతదేశం సంస్కృతీ, సంప్రదాయంతోపాటుగా, ఇక్కడి ప్రతిభ, శక్తి సామర్థ్యాలు విదేశీ పెట్టుబడిదారులను తప్పక ఆకర్షించే అవకాశాలే ఎక్కువున్నాయి.

Leave a Reply