Take a fresh look at your lifestyle.

నల్లగొండ పేదల దావాఖానాపై.. ప్రభుత్వానికి కక్ష ఎందుకు .?

“హైదరాబాద్‌ ‌కేంద్రంగా యశోద, కామినేని, కేర్‌, అపోలో, కిమ్స్ ‌లాంటి కార్పొరేట్‌ ‌దవాఖానాలు రోజుకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని అనేక ఆధారలతో సహా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అసంఖ్యాకంగా రోగులు పిర్యాదులు చేస్తే పోలీసులు ఎంతమంది డాక్టర్లను అరెస్ట్ ‌చేసారు? ఎన్నిసార్లు,
ఏ హాస్పిటల్‌లకు నోటీసులు ఇచ్చారు..? ఎన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.? ఎంతమంది సిబ్బందిని అరెస్ట్ ‌చేశారు? మాకు కట్టాల్సిన డబ్బులు కడితేనే శవాలు  ఇస్తామన్న దవాఖానాలపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నది.? పేదల దవాఖానా లకు ఒక న్యాయం, కార్పొరేట్‌ ‌దవాఖానాలకు మరొక న్యాయమా.! ఇది చట్టవిరుద్దమైన చర్య కాదా! ప్రభుత్వాస్పత్రులలో వందలమంది  కోవిడ్‌ ‌పేషంట్లకు సరైన వైద్యం అందించలేక, చేయాల్సిన పరీక్షలు సకాలంలో చేయకపోవడంతో అనేక మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పొతున్నది నిజం కాదా.!”

నల్లగొండ ప్రజలు పేదల దవాఖానాగా పిలుచుకునే డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ (‌నవ్య హస్పిటల్‌) ఆస్పత్రిపై పోలీసులు ఆకస్మికదాడి చేసి, మూసివేయడంతోపాటు, సుధాకర్‌ ‌కుమారుడు డాక్టర్‌ ‌సుహాస్‌ను, ఆస్పత్రి సిబ్బంది మరో నలుగురిని శనివారం (22-08-2020) అరెస్ట్ ‌చేసి నాన్‌ ‌బెయిలెబుల్‌ ‌కేసులు పెట్టారు. ఏ నేరం చేసారని అంత హడావిడిగా పోలీసులు తొందరపడ్దారు. ఆ దవాఖానా వైద్య నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్య శాఖ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తెలంగాణ విద్యావంతుల వేదిక అంగీకరిస్తుందని, కాని అక్కడ దవాఖానా మూసివేసిన తీరుతెన్నులు గమనిస్తే నిబంధనలకు అనుకూలంగా ప్రభుత్వం అనుసరించలేదనితెలుస్తోంది.
రోగుల నుంచీ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ, పీడిస్తున్నారనే అరోపణలతో కొద్దిమంది (ముగ్గురు లేదా నలుగురు) సిబ్బందిపై డి.ఎమ్‌.‌హెచ్‌.ఓ ‌సిబ్బంది, డిఎస్పీ, సి.ఐ ఆధ్వర్యంలో పోలీసులు పదుల సంఖ్యలో నవ్య దవాఖానా వద్దకు వచ్చి యజమాన్యాన్ని భయబ్రాంతులు గావించి బీభత్సం సృష్టించి అక్కడ కంప్యూటర్లను స్వాధీనం చేసుకొని ఆస్పత్రి సిబ్బందిని అరెస్ట్ ‌చేసారు. దవాఖానా వద్ద గొడవ జరిగకుండా, రోగులుగాని వారి బంధువులు గాని ఏ ఫిర్యాదు చేయకుండా, వైద్యం విషయంలో పోలీసులు ఎలా కల్పించుకుంటారు. ఆసుపత్రి పోలీసులెలా స్వాధీనం చేసుకుంటారసలు. హాస్పిటల్‌పై రోగులెవరైనా జిలా వైద్యశాఖాధికారికి ఫిర్యాదు కూడా చేయలేదే. ఒక వేళ ఫిర్యాదు చేస్తే విచారణ చేయాల్సిన బాధ్యత వైద్యశాఖది కదా! ఏదీ లేకుండా పోలీసులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేసారంటే ఏదో రాజకీయ కుట్ర దాగివున్నదనేది నిస్సందేహం. ఆస్పత్రి తీరుపై వైద్య శాఖపై పోలీసులకు ఫిర్యాడు చేసిందా? అసలలా వైద్య శాఖ పోలీసు ఫిర్యాదు చేయవచ్చా.. చేస్తే ఏ సందర్భంలో చేయాలి. నిబంధనలకు అతిక్రమించి రోగుల నుంచీ ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు బిల్లులు ఉన్నాయా..! వాటిని పేర్కోంటూ ఆస్పత్రి యాజమాన్యానికి ముందస్తు నోటీసు ఇవ్వాలి అలా కూడా జరగలేదు.

nalgonda hospilat

ఈ ప్రక్రియ ఏదీ జరుగకుండా సరైన విచారన జరపకుండా దవాఖానా పై ఎలా దాడి చేసి స్వాధీనం చేసుకుంటారు? డాక్టర్‌ ‌ను ఎలా అరెస్ట్ ‌చేస్తారు..! అసలు డాక్టర్‌ ‌చేసిన నేరం ఏమిటి.? పేదలకు సేవ చేయడమా..! డాక్టర్‌ ‌ను అరెస్ట్ ‌చేసే సమయానికి ఐ.సి.యు. లో, జనరల్‌ ‌వార్డ్ ‌లో సుమారు పదిహేను మంది రోగులున్నారు. మరి, వారి పరిస్థితి ఏమిటి.? వారిని లోపలే ఉంచి ఆసుపత్రిని ఎలా స్వాధీనం చేసుకుంటారు? డాక్టర్‌ ‌ను అరెస్ట్ ‌చేయవద్దని రోగుల బంధువులు వేడుకున్నా పోలీసులు కనికరించకపోవడం దారుణం. ప్రభుత్వం ఈ దుందుడుకు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నట్లు.? తెలంగాణలో ఏ డాక్టర్‌ ‌నైనా, సిబ్బందినైనా ఈ విధంగా అరెస్ట్ ‌చేసారా..! పోలీసుల ఆరోపణలకు దవాఖానా సిబ్బందికి సంబంధం వుందా.! ఇదంతా కేవలం కుట్రపూరిత చర్య.! ఏ ఆస్పత్రిలోనైనా ఏవైనా సంఘటనలు జరిగినా, డాక్టర్ల పై దాడులు జరిగినా, హాస్పిటల్‌పై ఆరోపణలు వచ్చినా స్పందించి, విచారణ జరిపి వారి హక్కును కాపాడేందుకు ఐ.ఎమ్‌.ఎ (ఇం‌డియన్‌ ‌మెడికల్‌ ఆసోసీయేషన్‌ ) ‌సంస్థ ఉంది. ఒక పేదల దవాఖానాను పోలీసులు స్వాధీనం చేసుకుంటే, ఎం బి బి ఎస్‌ ‌డాక్టర్‌ ‌ను, సిబ్బందిని అక్రమంగా అరెస్ట్ ‌చేసి జైలుకు పంపితే ఐఎమ్‌ఏ ‌సంస్థ ఇంతవరకు స్పందించలేదు. గతంలో ఇదే నల్లగొండ లో గుమ్మి శ్రీకాంత్‌ ‌రెడ్డి దవాఖానాలో తప్పుడు పరీక్షలు చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నరని ఒక విలేకరి ఆధారాలు అందజేస్తే హుటాహుటిన నల్లగొండ పట్టణంలోని డాక్టర్ల బృందమంతా దిగి ఆ విలేకరి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆ శ్రీకాంత్‌ ‌రెడ్డికి అండగా నిలబడి ఒకరోజు మొత్తం నల్లగొండ పట్టణంలో దవాఖానాలు బంద్‌ ‌చేసారు.. కాని నేడు డాక్టర్‌ ‌చెరుకు సుహాస్‌ను అరెస్టు చేసి జైలుకు పంపితే ఐఎమ్‌ఏ ఇం‌తవరకు స్పందించలేదు. ఐ ఎం ఎ పాలకులకు అమ్ముడు పోయిందా, భయపడిందా అని అనుమానం వేస్తున్నది.

హైదరాబాద్‌ ‌కేంద్రంగా యశోద, కామినేని, కేర్‌, అపోలో, కిమ్స్ ‌లాంటి కార్పొరేట్‌ ‌దవాఖానాలు రోజుకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని అనేక ఆధారలతో సహా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అసంఖ్యాకంగా రోగులు పిర్యాదులు చేస్తే పోలీసులు ఎంతమంది డాక్టర్లను అరెస్ట్ ‌చేసారు? ఎన్నిసార్లు, ఏ హాస్పిటల్‌లకు నోటీసులు ఇచ్చారు..? ఎన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.? ఎంతమంది సిబ్బందిని అరెస్ట్ ‌చేశారు? మాకు కట్టాల్సిన డబ్బులు కడితేనే శవాలు ఇస్తామన్న దవాఖానాలపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నది.? పేదల దవాఖానా లకు ఒక న్యాయం, కార్పొరేట్‌ ‌దవాఖానాలకు మరొక న్యాయమా.! ఇది చట్టవిరుద్దమైన చర్య కాదా! ప్రభుత్వాస్పత్రులలో వందలమంది కోవిడ్‌ ‌పేషంట్లకు సరైన వైద్యం అందించలేక, చేయాల్సిన పరీక్షలు సకాలంలో చేయకపోవడంతో అనేక మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పొతున్నది నిజం కాదా.! నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అం‌దక చనిపోయిన రోగుల విషయంలో ఎంతమంది డాక్టర్లను, నర్సులను సస్పెండ్‌ ‌చేసారు? ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ‌పై ఏమి చర్యలు తీసుకున్నారో వైద్య శాఖాధికారులు చెప్పాలి కదా! ప్రభుత్వం కోవిడ్‌ ‌విషయంలో చేతులేత్తేసిన తీరును న్యాయవ్యవస్థ కూడ అనేకసార్లు మందలించిన సంగతి నిజంకాదా.! నల్లగొండలో ఆక్సిజన్‌ అం‌దక ఒకరు చనిపోయిన సంఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ‌సుమోటోగా తీసుకున్నది వాస్తవం కాదా! ప్రాణాపాయ స్థితిలోవున్న పేద ప్రజలను బతికించాలనే ఉద్దేశ్యంతో తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం డాక్టర్‌ ‌సుహాస్‌ ‌నేరమా.!

బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌తన కుమారుని చేత ఒక దవాఖానా పెట్టించి పేద ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్యం అందించడమే చేసిన నేరమా.! దీని వెనుకాల రాజకీయ కుట్ర దాగివున్నది. డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ‌పట్టభద్రుల ఎం.ఎల్‌.‌సి ఎన్నికలలో పోటి చేయడానికి సిద్దమవుతున్నారని, పట్టభద్రులు ఆయనకు ఎక్కడ పట్టం కడతారోనని భయంతో అధికార పార్టీ రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్దంగా కుట్రపూరితంగా దవాఖాన పై దాడిచేయించి భయబ్రాంతులకు గురిచేసి వారి కుమారుడిని, సిబ్బందిని అరెస్ట్ ‌చేయించడం ఏ రాజకీయ నీతికి నిదర్శనం.? ఆ కుటుంబం వైద్య సేవలతో పాటు అనేక సామాజిక సేవలు చేసిన విషయం యావత్‌ ‌సమాజానికి తెలుసు. ఇలాంటి సంఘటనలను ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, మేదావులు ఖండించారని గమనించాలి.

– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక

Leave a Reply