Take a fresh look at your lifestyle.

‘నాయుడు’ స్ట్రాటజీ ఫెయిల్ ..!

“సింపుల్ గా మూడు రాజధానులు కాదు.. అమరావతి,  విశాఖ, కర్నూలు వీటిలో ఏదో ఒకదాన్ని రాజధాని చేయాలి అని చెప్పినా.. కూడా చంద్రబాబు జగన్ ని కొంచం కౌంటర్ చేయగలిగే వారు. ఆలా కాకుండా  అన్ని పదవులు తీసుకుని అమరావతి వదిలేయమని చెప్పడం ద్వారా బాబు ఓ మాజీ ముఖ్యమంత్రి లాగా కాకుండా ఓ కుల పెద్ద లాగా స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు రాజధానులు వద్దు అని చంద్రబాబు చెప్పి ఉంటే, ఉత్తరాంధ్ర, సీమ జనాలకి చంద్రబాబు కొంచం అర్ధం అయ్యేవారు. మూడు రాజధానుల ఎపిసోడ్ తో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఓ కులపెద్దగా తన పర్సనల్ ఎజెండా కోసం పనిచేయటం వలన ఉత్తరాంధ్ర, సీమ జనాలకి దూరం అయిపోయి.. కేవలం అమరావతిలో ఓ సామజిక వర్గానికి చెందిన కుల పెద్దగా అవతరించారు.”

aruna senior journalist delhi
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

ముప్పై ఎనిమిది ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎనిమిదిన్నర ఏళ్ళు ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయితే పదిహేను ఏళ్ళు కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి..అంటే ముప్పై ఎనిమిది ఏళ్లలో ఇరవై మూడున్నర ఏళ్ళు అధికారంలో..పదిహేను ఏళ్ళు కాలం ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వుంది. అధికకాలం అధికారంలో ఉండి తక్కువ కాలం ప్రతిపక్షంలో వుండే అనుభవం తెలుగుదేశం పార్టీకి ఉండటం వలన ఆ పార్టీకి ప్రతిపక్ష రాజకీయాలు చేయటం రావటం లేదు. 1984లో ముఖ్య మంత్రి అయిన ఎన్టీఆర్ 1994 వరకు కూడా ప్రజలపై ఆధారపడి రాజకీయం చేసారు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీద ఆధారపడి రాజకీయం చేయటం చేతకాని చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా మీద ఆధారపడి, టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ కన్నా కూడా ఎక్కువ కాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్ పాలన చూసి చూసి విసుగెత్తిన తెలుగు ప్రజల జీవితాల్లో తెలుగుదేశం పార్టీ ఓ స్థానం ఏర్పరుచుకోగలిగింది. నేటికీ కూడా టీడీపీకి ఓట్ బ్యాంక్ వుంది. దానికి అంటూ కేడర్ వుంది. మరో రెండేళ్లలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకునే తెలుగుదేశం పార్టీకి జనాదరణ కరువు.. మీడియా అండాదండా మెండు వున్నా చంద్రబాబు నాయుడు నాయకుడుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ వెనుక నీడలా పార్టీలో మసలిన చంద్రబాబు అనుకూల మీడియా, ఐటీ లాబీ వలన ఎన్టీఆర్ ను పక్కకు తప్పించి పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నాయుడు ఎదిగారు. ఆ తరువాత విదేశీ పెట్టుబడిని బలపరిచే ఎకానమీ పాలసీలను భుజాలమీద మోసిన బాబు జాతీయంగా, అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగారు. అంతర్జాతీయ ఐటీ సెక్టార్ కి భారతీయ చవక లేబర్ అందేలాగా హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలచి ఇటు ఆంధ్రప్రజలు..అటు అంతర్జాతీయ పెట్టుబడి దారులు అయిన బిల్ గేట్స్ మెప్పు పొందారు. ఇన్ని చేసినా లేటు వయసు వేళ చంద్రబాబు ఒంటరితనం అనుభవిస్తున్నారు. తన తరువాత పార్టీకి నాయకున్ని అందించలేని పరిస్థితి బాబుకి దాపురించింది. అంతేనా తనలో శక్తి యుక్తులు ఉడిగిపోకుండా వుండగానే మళ్లీ పార్టీని అధికారంలోకి తేవాల్సి వుంది. అలాగే వైభవం నిండిన పార్టీని కొడుకు లోకేష్ నాయుడును చేతిలో వుంచాల్సి వుంది. చంద్రబాబు ఈ రెండు పర్సనల్ ఎజండాలు 2019లోనే జరిగిపోతాయని ఆశ పెట్టుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. మీడియాని ఫుల్ వాడారు..ఆంధ్ర మహిళకి లంచంగా పసుపుకుంకుమలు వెదజల్లారు. ఆంధ్ర మహిళ మేము బుర్రతక్కువ మగాళ్ళం కాదు అని పసుపు కాళ్ళకి రాసుకుని కుంకుమ నుదిటి అద్దుకుని బాబు పర్సనల్ ఎజండాకి పచ్చడి కొట్టారు. దీనితో బాబు అధికార వారసుడు అవుతాడనుకున్న కొడుకు సైతం ఓటమి చవిచూసాడు.

ఇలాంటి నేపథ్యంతో ఓడిపోయిన బాబు మరో మూడు నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడై పోరాడాల్సి వుంది. 2024లో అధికారాన్ని సాధించి, టీడీపీని మళ్లీ పటిష్టంగా నిలబెట్టాల్సి వుంది. అటుపై లోకేష్ నాయుడిని వారసుడిగా తీర్చి దిద్దాల్సి వుంది. ఇవన్నీ జరుగుతాయా? అన్నదే తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు అయినా, వ్యతిరేకించేవారు అయినా, ఆలోచించేది. ప్రజలపై ఆధారపడి రాజకీయాలు చేయటం చేతకాని చంద్రబాబు ప్రతిపక్షం పీట మీద కూర్చున్నాక వేస్తున్న స్ట్రాటజీలనే రాజకీయ కుయుక్తులు బాబుకి వర్కౌట్ కావటం లేదు. పార్టీ ప్రయోజనాలు పండాలి అంటే తెలుగు జనాల బహు ప్రయోజనాలు దృష్టిలో వుంచుకుంటే సరైన ప్లాన్ బాబుకి తట్టేది.. ప్రజలా అబ్బే.. మీడియా వర్కౌట్ అయినట్టు మనకి ప్రజలు ఎక్కడ సహకరిస్తారు..? అనుకునే బాబు కేవలం అమరావతి అనే ఉయ్యాల జంపాల అని ఊగిపోయి అమరావతి అనే ఒక్క దాని కోసం చంద్రబాబు సర్వ శక్తులు ఒడ్డడంతో కుదేలై చతికిల పడ్డారు. ‘కావాలంటే మా పదవులు అన్నీ తీసేసుకోండి. కానీ అమరావతిని మాత్రం రాజధానిగా వదిలేయండి’ ఇదీ చంద్రబాబు వేడుకోలు. అమరావతి ఎంపిక సరైనదా? కాదా? దాని వెనుక ఏం జరిగింది? ఎవరి ప్రయోజనాలు వున్నాయి ఇవన్నీ పక్కన పెట్టి కాసేపు టీడీపీ పోషిస్తున్న ప్రతిపక్ష పార్టీ పాత్ర చూస్తే.. చంద్రబాబు.. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మాటా ‘మొత్తం రాష్ట్రము వద్దు ఐదు ఊళ్ళు చాలు’ అన్నట్టు మిషన్ అమరావతి బిల్డప్ ఇవ్వబోతే.. దూరదర్శన్ లో రామాయణం చూడటం మానేసి, నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ లో.. కొత్త కంటెంట్ చూస్తున్న ప్రజలు టీడీపీ వైపు, బాబు వైపు తల తిప్పి చూడటం లేదు.

‘రాజధానిగా విశాఖ ఎందుకు పనికిరాదు’ అన్న ప్రశ్నకు బాబు సమాధానం చెప్పలేక నానా యాతన అనుభవిస్తున్నారు. బాబుకి ఈ పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుపై బాబు స్టాండ్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా… తెలంగాణ ఏర్పాటు ఎలా సాధ్యంలే.. అనే ధీమాలో రాష్ట్ర విభజనపై ఓ లేఖ రాసేసి తల కడుగు కున్నారు. ఈ పిరికి రాజకీయ ఎత్తుగడల వలన రాజశేఖర్ రెడ్డి చనిపోయాక అందరికంటే ఎక్కువ నష్టం బాబుకే జరిగింది. సింపుల్ గా రాజధానిగా విశాఖ పనికి రాదు అని చెప్పాలి అంటే చంద్రబాబు తన పిరికి రాజకీయం చేసే అలవాటును మానుకోవాలి. సింపుల్ గా మూడు రాజధానులు కాదు.. అమరావతి, విశాఖ, కర్నూలు వీటిలో ఏదో ఒకదాన్ని రాజధాని చేయాలి అని చెప్పినా.. కూడా చంద్రబాబు జగన్ ని కొంచం కౌంటర్ చేయగలిగే వారు. ఆలా కాకుండా అన్ని పదవులు తీసుకుని అమరావతి వదిలేయమని చెప్పడం ద్వారా బాబు ఓ మాజీ ముఖ్యమంత్రి లాగా కాకుండా ఓ కుల పెద్ద లాగా స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు రాజధానులు వద్దు అని చంద్రబాబు చెప్పి ఉంటే, ఉత్తరాంధ్ర, సీమ జనాలకి చంద్రబాబు కొంచం అర్ధం అయ్యేవారు. మూడు రాజధానుల ఎపిసోడ్ తో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా.. ఓ కులపెద్దగా తన పర్సనల్ ఎజెండా కోసం పనిచేయటం వలన ఉత్తరాంధ్ర, సీమ జనాలకి దూరం అయిపోయి.. కేవలం అమరావతిలో ఓ సామజిక వర్గానికి చెందిన కుల పెద్దగా అవతరించారు. ఇలా చంద్రబాబు తనకున్న మాజీ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర..సీమ ఈ రెండు ప్రాంతాల ప్రజలకి దూరం అయిపోయి యెంత అనుకూల మీడియా దన్ను వున్నా కూడా ఏకాకి ఐపోతున్నారు. పర్సనల్ ఎజెండా వదిలి ప్రజా ఆధారిత రాజకీయాలు చేయటం చంద్రబాబు నేర్చుకోకపోతే అమరావతి కోసం బాబుగారు మరీ ఎందుకు ఇంతలా బేలగా ఐపోతున్నారు అని జనం ఆలోచించడం మొదలుపెడితే..? ఏ అమరావతి అయితే తన కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా వుండిపోయేలా చేస్తుంది అని చంద్రబాబు ఆశిస్తున్నారో.. అదే అమరావతి బాబుని తెలుగుదేశం పార్టీని నడిసంద్రంలో ముంచివేయవచ్చు.. చంద్రబాబు ప్రస్తుత జగన్ సర్కారుని ఎదుర్కొనే ప్రతిపక్షం లాగా ఎదిగేందుకు స్ట్రాటజీ అనే రాజకీయ ఎత్తుగడలు రచించకుండా 2024 ఎన్నికలలో వైస్సార్సీపీకి అనుకూలించే మార్గాలను రచించి ఆ పార్టీకి తనకి తెలియకుండానే సహకరిస్తున్నారా అనిపిస్తుంది. చంద్రబాబు అనుకూల మీడియా అండదండలు కులరాజకీయం కోసం, పర్సనల్ అజెండా కోసం వాడుకోకుండా.. ప్రజా పక్ష రాజకీయం కోసం వాడితే.. ప్రజలు బాబుకి దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుందేమో చంద్రబాబు పరిశీలిస్తే..కులం, కొడుకు కన్నా పెద్దది అయిన తెలుగు దేశం పార్టీని బతికించ గలుగుతారు.

Leave a Reply