Take a fresh look at your lifestyle.

అతిపెద్ద గిరిజన జాతర నాగోబా

(పుష్య అమావాస్య నాగోబా కొలువు)

నాగోబా జాతర అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి.రాష్ట్ర పండుగ నాగోబా జాతరలో సర్పజాతిని పూజించడమే ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్య మవుతాడని గిరిజనుల విశ్వాసం. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ ‌దగ్గర కెస్లాపూర్‌ ‌గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ ‌జనాభా 400కు మించకున్నా పండగనాడు లక్షలాది మందితో జనారణ్యమవుతుంది. ఫిబ్రవరి 11 నుంచి నిర్ణీత రోజులు గిరిజనులు పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాస అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.

నాగోబా చరిత్రను పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైందని చెపుతారు. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చు కోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ ‌నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరి లోనే సత్యవసి గుండంలో కలిసి పోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం.

Mesram-adilabad-nagoba-jatara

ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) ‌చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ ‌గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ ‌గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మిం చారు. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.

వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మోస్త్రం వంశస్థులలోని కటోడా దివాకర్‌ ‌గారికి , ఘాడియా సంకేపాయిలర్‌ ‌వాడే శాఖల వారు కేస్లాపూర్‌ ‌జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి గోదావరి జలం తేవడానికి కాలినడకన వెళతారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్లదూరంలో ఉన్న హస్తమడుగులో పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమయిందనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా భావిస్తుంటారు.

కడెం మండలం లోని గొడిసిర్యాల ప్రాంతాల్లో గోదావరి జలాన్ని తెచ్చేందుకు బయలు దేరడంతో జాతర ప్రారంభమైనట్టే. కెస్లాపూర్‌ ‌జాతర ప్రాంగణంలో గిరిజనుల ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వంట చేసుకునేది 22 పొయ్యిల మీదే.

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రం నాగోబా కోసం కుండలు తయారు చేయడం ఆచారం. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వెళ్ళి, అక్కడి గుగ్గిల్ల వంశ కుమ్మరి ఇళ్ళకు వెళ్లి, కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర, దీపాంతలు, నీటికుండలు కలిపి తయారు చేస్తారు..

nagoba-jatara-idol-keslapur

కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఇంద్రవెల్లిలో వెలసిన ఇంద్రాదేవికి సామూహిక పూజలు జరుపుతారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్‌ ‌మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్ర పరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి ఒక పుట్ట తయారు చేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు.

గోదావరి జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్ర పరచి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవ ధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులోని పాలు నవ ధాన్యాలు, మొలకలు, అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. నాగ దేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిది. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్ళి వారిచేత దేవునికి పూజ చేయించి పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్‌ ‌కీయ్‌వాల్‌’ అం‌టారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్‌’ అని పిలుస్తారు. పూజలకు ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేసి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్‌) ‌జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

గతంలో ఈ గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించడంతో ఉలిక్కిపడి నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ‌హైమన్‌డార్ఫ్ ‌ను ఆదిలాబాద్‌ ‌జిల్లాకు పంపారు. గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ను ప్రొఫెసర్‌ 1942‌లో మొదట నిర్వహించాడు. నీటినుంచీ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బర్బార్‌ ‌సాగుతోంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల నుంచి గిరిజనులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతరలో , ఈ సారి కొవిడ్‌-19 ‌నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజ, కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయని, మెస్రం వంశీయులు నిర్వహించే మహా పూజలతో పాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని, ప్రజా దర్బార్‌ను రద్దు చేస్తున్నట్టు మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌ ‌పటేల్‌, ‌పెద్దలు చిన్ను పటేల్‌ ఆధ్వర్యంలో తీర్మానించారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply