Take a fresh look at your lifestyle.

నాగార్జున సాగర్…ప్రకాశం బ్యారేజి వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి అనువయినవి..! కేంద్ర ప్రభుత్వం వెల్లడి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూదిల్లీ: నాగార్జున‌సాగ‌ర్..ప్రకాశం బ్యారేజీలు వాట‌ర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి అనువైనవి అని కేంద్రం గుర్తించింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఉడాన్‌ పథకంలో భాగంగా వాటర్‌ ఏరో డ్రోమ్‌ నిర్మాణానికి తెలంగాణలోని నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీలను గుర్తించినట్టు కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్‌ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరీ రాజ్య‌స‌భ‌లో రాత‌పూర్వక సమాధానం ఇచ్చారు. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇప్పటికే 778 రూట్లను గుర్తించామని స్ప‌ష్టం చేశారు. అందులో 323 రూట్లలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 వాటర్‌ ఏరో డ్రోమ్‌లు గుర్తించామని, అందులో 2 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని స‌భ‌కి వివ‌రించారు.

పీఎంఎవై కింద 20 లక్షల ఇళ్లు ..

  • ఆంద్రప్రదేశ్ లో దాదాపు 20 ల‌క్ష‌ల ఇల్లు
  • పీఎంఏవై కింద ఇచ్చాం అని కేంద్రం ప్రకటించింది.

ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 20,28,899 ఇండ్లు మంజూరు చేశామని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి 3,60,325 ఇండ్ల‌ నిర్మాణం పూర్తయిందని కేంద్రం తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణం కోసం 89,377.00 కోట్ల రూపాయల పెట్టుబడిలో కేంద్ర వాటా 30,731.00 కోట్ల రూపాయలుగా ఉందని, అందులో ఇప్పటివరకు కేంద్ర తన వాటగా 9,311.00 కోట్లు విడుదల చేసిందని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుండి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మధ్య మంజూరు చేసిన 12,32,237 ఇళ్లలో 6,22,716 ఇండ్ల‌ లబ్ధిదారులు లబ్ధిదారులు వివాదాస్పద భూమిలో నివసిస్తున్న కారణంగా, లేక ఇతర కారణాలతో రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని మంత్రి తెలిపారు.

అంతేగాక రాష్ట్రప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్ళు పథకంలో మొత్తం 6,09,521 ఇళ్ళు మంజూరు అయ్యాయని, వీటి నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 13,76,480 ఇళ్ళకు గుర్తించిన లబ్ధిదారులకు గతేడాది డిసెంబర్‌ 25 నుంచి ఈ ఏడాది జనవరి మధ్య భూమిని అధికారికంగా కేటాయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతేగాక 2019లో సమగ్ర సర్వే చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి గృహ నిర్మాణానికి భూమిని కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చిందన్నారు. వీటిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 24.10 లక్షల్లో, 15.10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస యోజనలోని లబ్ధిదారుల నిర్మాణ వాటా కింద ఇప్పటికే ఇళ్ళు మంజూరు చేసినట్లు వివరించారు. అయితే నూతనంగా మంజూరు చేసే ముందు ఇప్పటికే మంజూరు చేసిన 20.29 లక్షల ఇళ్లలో కనీసం 95% ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, వాటిలో 75% పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించినట్లు కేంద్రమంత్రి హర్దీప్‌ పురీ తెలిపారు.

స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌లో ఆంధ్రప్రదేశ్ కు 567.36 కోట్ల రూపాయలు ..!
స్వచ్ఛ భారత మిషన్‌(అర్బన్‌)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటివరకు 567.36 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వెల్లడించారు. రాష్ట్రంలో 2,43,764 వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం, 17,797 కమ్యూనిటీ పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం పూర్తయిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్‌ వ్యర్థాల సేకరణ 2017లో 8 శాతం ఉండగా, 2021 జనవరి నాటికి 64 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పీఎం శ్ర‌మ్ యోగి మ‌న్ ధ‌న్ పెన్ష‌న్ అమ‌లు చేస్తున్నాం..!
ప్రధాన్‌మంత్రి శ్రమ్‌ యోగి మన్‌–ధన్‌ పెన్షన్‌ యోజన విజయవంతంగా అమలు అవుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,50,505 మంది నమోదు చేసుకొని, రూ.16.49కోట్లు తమ వాటా కింద చెల్లించారని కేంద్రం కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 33,148మంది నమోదు చేసుకొని, 4.85 కోట్ల రూపాయలు తమ వాటా చెల్లించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకానికి 39.72 లక్షలమంది నమోదు అయి 588.73కోట్ల రూపాయలు వాటాగా చెల్లించారని మంత్రి తెలిపారు. అత్యధికంగా రాజస్థాన్‌ రాష్ట్రంలో 33.44లక్షల మంది నమోదు చేసుకున్నారని వివరించారు.

Leave a Reply