మున్సిపల్ ఎన్నికల కౌంటర్ కేంద్రాల్లో సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఇ. శ్రీధర్ హెచ్చరించారు. కౌంటింగ్ విధులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూలు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలోనే నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లకు శిక్షణ పొందిన వారిని కౌంటింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పేపర్లను ఏ విధంగా లెక్కిస్తారు. చెల్లని ఓటుపై, పోస్టల్ బ్యాలెట్‌పై, సందేహం కల్గిన ఓటుపై తీసుకోవాల్సిన చర్యలు, మల్టీపుల్ ఓటుపై శిక్షణ పొందిన వారి నుంచి సమాధానాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఇ.శ్రీధర్, హాజరైన కౌంటింగ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ఉండాలని, కేంద్రాల్లో మొబైల్స్ ఉపయోగించరాదన్నారు. ఒకవేళ ఫోన్లు తీసుకొచ్చినా కౌంటర్లో అప్పజెప్పాలన్నారు.
కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సిబ్బంది కౌంటర్ కేంద్రాల నుంచి బయటికి వెళ్లడం నిషిద్దమని, ఇతరులతో పరిచయం ఉన్నా కూడా మాట్లాడటం చేయవద్దన్నారు. మీరు పొందిన శిక్షణతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన మెటీరియల్స్ చదువుకోవాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటలకే తప్పనిసరిగా విధిగా హాజరు కావాలని, ఎవరైనా సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం కౌంటింగ్ మూడు రౌండ్లు పూర్తవుతుందని మొదటి రౌండ్లో 8 వార్డులకు సంబంధించిన మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించి మొదటి రౌండు 8 వార్డులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించిన తర్వాతనే, మొదటి రౌండ్ కి సంబంధించిన సిబ్బంది మరియు పార్టీ ఏజెంట్లు బయటికి వెళ్ళిన తర్వాత 2 వ రౌండ్ కు సంబంధించిన 8 వార్డుల సిబ్బంది మరియు ఎన్నికల ఏజెంట్లను అనుమతించి రెండో రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియను మొదలు చేయాలన్నారు. రెండో రౌండు ఎనిమిది వార్డుల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడించి ప్రకటించిన తర్వాత చివరి మూడవ రౌండు కౌంటింగ్ మొదలుపెట్టాలన్నారు. బ్యాలెట్ బాక్సుల సీల్స్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపించి వారి సందేహాలు నివృత్తి చేసిన తర్వాతనే బ్యాలెట్ బాక్సులను తెరవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నాగలక్ష్మి, మున్సిపాల్ కమీషనర్ జయంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులు ప్రశాంత్ గౌడ్, ప్రసాద్, మహేష్, ట్రైనర్ వెంకటయ్య, రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags: venkataiah trainer, rdo nagalakshmi, municipal commissioner, jayanthi kumar reddy