Take a fresh look at your lifestyle.

నా నడక

కాలంతో పాటు నేను ముందుకు నడుస్తున్నానా
వెనక్కి నడుస్తున్నానా
నాలో సందేహం ..
నిరంతరం నన్ను దహించివేస్తున్నది

నిన్న
గుర్రపు డెక్కల చప్పుళ్ళు
రజాకార్ల పోలికేకల నడుమ
సొంతిల్లు , సొంతూరు,

సొంతవాళ్ళ నడుమ
భయంతో ..  అనుక్షణం భయంతో
నీ బాంచెన్‌ ‌కాల్మొక్త
అంటూ బతుకీడ్చిన దేహాలు
తలకిందులై ఎన్నాల్లిలా వేలాడడమని
నిట్టనిలువుగా నిలువ
కరకు గుండెలనెదురొడ్డాయనీ

ఆడ మగ తేడా లేకుండా
దొర ఎవ్వడురా .. దోపిడెందిరా అంటూ
నిరంకుశ దోపిడీ ప్రభుత్వాన్ని
దిక్కులు పిక్కటిల్లేలాప్రశ్నిచాయనీ
భూమి , భుక్తి , విముక్తి కోసం
మట్టిమనుషుల్లో  రగిలిన జ్వాల
ఏరులై ప్రవహించిందనీ
గొంతునిండా చైతన్యం
దేహం నిండా ధైర్యం నింపుకుని
అపూర్వ ఐక్యత ప్రదర్శించి
ముష్కర మూకల ధిక్కరించి
విమోచన జెండా ఎగురవేసిన దేహాల గురించి విన్నాను
ఆ ఫలాలను కొన్నైనా అనుభవిస్తున్నాను

మరి నేడు
గడీల ఏలుబడితో
బగీలా వ్యవస్థలోకి పోతుంటే…
ప్రజాస్వామ్యపు ముసుగులో
పరాయీకరణ దిశగా సాగుతుంటే..
వికేంద్రీకృతమైన భూముల్ని , వనరుల్ని
కేంద్రీకృతం చేస్తుంటే
అభివృద్ధి పేరిట
విస్థాపన, విధ్వంసం జరుగుతుంటే
నేనేం చేస్తున్నాను ..?
లోలోన గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్న
ఆక్రోశాన్ని, నిరాశ నిస్పృహల్ని
గుప్పెడుగుండెలో  దాపెట్టి బీగమేస్తున్నానేమిటి..?
గల్లా నింపుకునే వాళ్ల గల్లా పట్ట్టాలిగా…

ఎద్దుకు జ్వరమొస్తే
బర్రెకు వాతలు పెట్టడం తప్పని చెప్పబోతే
తెల్లనివన్నీ పాలు కాదంటే
నిరంకుశ ధోరణులపై
గళం విప్పితే కదం కదిపితే
ఎదలో కత్తులు దూస్తూ
నాలుకపైబెల్లపు మాటల చొంగకారుస్తూ
నా చర్యలపై ఒళ్ళంతా కళ్లుచేసుకుని
డేగలా నిఘాకన్నుతో  వేటాడుతూ
వెంటాడుతూ పంజా విసురుతూనే ..
నిరసన గళాల వెన్ను విరిచే యత్నం  చేస్తూనే ..
కుట్రదారులను చేసి చీకటి కొట్టాల్లోకి తోసి
స్వేచ్చా ప్రపంచంలో ఆంక్షల కత్తులు వేలాడేస్తుంటే
ధనస్వామ్యపు నియంతల కబంధహస్తాలు
ప్రజలంటే బానిస గాళ్ళని
నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుంటే..
తల్లికోడి రెక్కల చాటున ఎన్నాళ్ళని దాక్కోను..?

ఆనాడు
వేగుచుక్కలై వెలుగురవ్వలై
మట్టిమనుషులు వెలిగించిన ఆ పోరాట స్ఫూర్తి
నాలో ఏదీ ..
సంస్కృతీ సంప్రదాయపు వేడుకలలో
పండుగల్లో మునిగితేలడంలో
నాలోని నిలువెత్తు చైతన్యం నీరుగారిపోయిందా ..?

కళ్ళున్న కబోదిలా కిమ్మనకుండానో
మన్నుదిన్న పాములానో
పడిఉండలేను..
నేనుండలేను..
నిద్రలేవాలి.. జాగృతమవ్వాలి
నాతో మీరూ నిద్ర లేస్తారా..కలిసి అడుగేద్దాం

రండి .. మనదేహం నిండా ధైర్యం ఒంపుని
ఒకనాటి అపూర్వ ఐక్యతకు వారసులమవుదాం
వాక్స్వాతంత్య్రం ఉన్నదేశంలో వ్యక్తీకరణ స్వేచ్ఛకోసం
కలాల్లోని సిరాలా  ప్రవహించే చోదకశక్తిగామారదాం

ప్రజాసామ్య నియంతల పాదముద్రల నుంచి
విముక్తి కోసం విమోచన కోసం
యుద్ధనౌకలమై గమ్యంకేసి  మనం అడుగు వేస్తుంటే
ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ మరుసటిరోజ
చుక్క చుక్క కలిసి చెరువు
అయినట్లు

గింజ గింజ కలిసి రాశి అయినట్లు
ఆ అడుగులన్నీ మారాకులు వేసి వేనవేల మొగ్గలు తొడిగి
బతుకుపూల ఫలాలతో ముందుకు నడిపించవా..
బెల్లంమాటల నాలుకలని కత్తిరించవా ..
డేగల, గద్దల కథ కంచికెళ్ళదా ..

– వి. శాంతిప్రబోధ

Leave a Reply