Take a fresh look at your lifestyle.

వలస కార్మిక కుటుంబం హత్యపై వీడిన మిస్టరీ

  • ఒక నేరం నుండి తప్పించుకోవడానికి మరో తొమ్మిది దారుణాలు
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు – 72 గంటల్లో కేసును చేదించామన్న సిపి రవీందర్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట లో వలస కార్మికుల కుటుంబంతో పాటు మరో ముగ్గురి హత్యపై కొనసాగుతున్న మిస్టరీని పోలీసులు 72 గంటల్లోనే చేదించి నిందితుడిని అరెస్టు చేశారు. ఒక హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ నిందితుడు ఈ దారుణానికి పాల్పడి తొమ్మిది మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కేసు విచారణ, నిందితుడు అరెస్టు తదితర అంశాలను వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రవీందర్‌ ‌వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిపి మాట్లాడుతూ గొర్రెకుంట హత్యలకు ప్రధాన నిందితుడు ఒక్కడే సంజయ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ (24) అని అన్నారు. నుర్లపూర్‌ ‌గ్రామం, బిగుసరయి జిల్లా, బీహార్‌ ‌రాష్ట్రానికి చెందిన సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రస్తుతం వలస వచ్చి గీసుకొండ మండలం జానుపాకలో నివాసం ఉంటున్నాడన్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ ‌మసూద్‌ ఆలం (47), ఆయన భార్య నిషా ఆలం(40), వివాహిత కూతురు భూష కాటూన్‌ (20), ‌మనుమడు బబ్లూ (3), కుమారులు షాబాజ్‌ (19), ‌సోహేల్‌ (18)‌లు కాగా బీహార్‌కు చెందిన శ్యాం కుమార్‌ ‌షా(18), శ్రీ రామ్‌ ‌కుమార్‌ ‌షా (21), త్రిపురకు చెందిన మహమ్మద్‌ ‌షకీల్‌ (38)‌కరీమాబాద్‌లో నివనిస్తున్నారు. వీరిని సంజయ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఒక పథకం ప్రకారం హత్య చేశారన్నారు. జీవనోపాధి కోసం వరంగల్‌కు వచ్చిన నిందితుడు సంజయ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌మిల్స్ ‌కాలనీ ప్రాంతంలో శాంతినగర్‌లోని గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో పని చేస్తున్న క్రమంలో అదే కేంద్రంలో పని చేస్తున్న మృతి చెందిన మసూద్‌ అలం కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో మసూద్‌ ‌భార్య నిషా అక్క కూతురు పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రానికి చెందిన రఫీకా(37)తో సంజయ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌కు పరిచయం కావడంతో రఫీకాకు డబ్బు ఇచ్చి ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాను నిందితుడు సంజయ్‌ ‌పెళ్లి చేసుకుంటానని నమ్మించి జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయి తీసుకొని గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెతో నిందితుడు సంజయ్‌ ‌చనువుగా ఉండటాన్ని గమనించిన రఫీకా నిందితుడు సంజయ్‌తో పలుమార్లు గొడవ పడడినట్లు తెలిపారు. అయినప్పటికీ సంజయ్‌ ‌తన పద్ధతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా రఫీకా కుమార్తెతో వ్యవహరిస్తున్నాడన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కూతురుతో సన్నిహితంగా ఉంటున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించడంతో నిందితుడు ఆమెను అడ్డు తొలగించుకోవాలన్నాడు. ఇదే క్రమంలో నిందితుడు రఫీకాతో మా పెద్ద వాళ్ళతో మాట్లాడి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మార్చి 6న విశాఖపట్నం వెళ్ళే గరీభ్‌రథ్‌ ‌రైలులో వరంగల్‌ ‌నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి వెళ్ళారని తెలిపారు. మార్గమధ్యంలో రఫీకాకు మజ్జిగ ప్యాకెట్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి తన దగ్గర ఉన్న చున్నితో హత్య చేసి రైలు నుండి నిడదవోలు ప్రాంతంలో ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు నుండి తోసి వేసి ఏమి తెలియనట్టు గా తిరిగి మళ్ళీ వరంగల్‌ ‌కు చేరుకున్నాడని సిపి వివరించారు. నిందితుడు రఫీకా పశ్చిమబెంగాల్లోని తమ బంధువుల ఇంటికి వెళ్ళినట్లుగా రఫీకా పిల్లలను నమ్మించాడు.

కొద్ది రోజుల అనంతరం తన అక్క కూతురు బంధువుల ఇళ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందని మరణించిన మసూద్‌ ‌భార్య నిషా నిందితుడిని గట్టిగా నిలదీయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించారినట్లు సిపి తెలిపారు. దీంతో కంగుతిన్న నిందితుడు ఏదో విధంగా పోలీసులకు చిక్కు తానని భయపడి మసూద్‌ అలం, భార్య నిషాలను హత్య చేయాలని పథకం పన్నినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగా నిద్ర మాత్రలతో కలిపి వారిని చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. గత మే 16 నుండి 20 వరకు మసూద్‌ ‌పని చేస్తున్న గొర్రెకుంటలోని సంచులు తయారు చేసే గోదాంకు రోజు క్రమం తప్పకుండా వస్తూ పోతూ ఉన్న సమయంలోనే నిందితుడు గోదాం చుట్టూ పక్కల పరిశీలించాడని తెలిపారు. ఇందులో భాగంగా నిందితుడు మే 20న మసూద్‌ ‌పెద్ద కుమారుడైన షాబాజ్‌ ‌పుట్టిన రోజు అని తెలియడంతో అదే రోజు చంపాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. దీనికి గాను ఈ నెల18న నిందితుడు వరంగల్‌ ‌చౌరస్తాలోని ఓ మెడికల్‌ ‌షాప్‌లో సుమారు 60కి పైగా నిద్ర మాత్రలు కొనుగోలు చేశాడన్నారు. నిందితుడు 20 న సాయంత్రం 7:30 గంటలకు గోదాంకు చేరువలోని చాలాసేపు ముచ్చటించి తనకు అనుకూలంగా ఉన్న సమయంలో నిందితుడు ఎవరికి తెలియకుండా తాను తీసుకు వచ్చిన నిద్ర మాత్రలను భోజనంలో కలిపినట్లు పేర్కొన్నాడు. అక్కడే పక్క భవనంలో నివాసం ఉంటున్న శ్యాం, శ్రీరామ్‌ ‌రూమ్‌లో ఉన్న భోజనంలో కూడా నిద్రమాత్రలు కలిపి ఏమి తెలియనట్టు గా కిందికి దిగి వెళ్లిపోయాడన్నారు. మత్తుమందుతో కూడిన భోజనం చేసిన తొమ్మిది మంది అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో అదేరోజు రాత్రి 12:30 నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు నిందితుడు సంజయ్‌ ఒక్కొక్కరిని గోనె సంచిలో వేసుకొని తీసుకుపోయి బావిలో పడేసినట్లు సిపి తెలిపారు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నింది తుడు మృతుల గదుల నుండి వాల్‌మార్ట్ ‌లో కొనుగోలు చేసిన కిరాణా సామానుతో పాటు వారి సెల్‌ ‌ఫోన్లు తీసుకొని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు.ఈనెల 21, 22 తేదీల్లో వరుసగా తొమ్మిది శవాలు బావిలో తేలడంతో ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ ప్రత్యేక బృందాలు లోకల్‌ ‌పోలీస్‌ ‌సిసిఎస్‌, ‌టాస్క్ ‌ఫోర్స్, ‌టెక్నికల్‌ ‌టీం, హైదరాబాద్‌ ‌నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు హత్య ఉదంతాన్ని వెలుగు తీశాయని సిపి పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బృందాలు నిర్వహించిన దర్యాప్తులో గోదాం గొర్రెకుంట ప్రాంతంలోని సిసి పుటేజ్‌లను పరిశీలిం చడంతో నిందితుడిని గుర్తించామని పేర్కొన్నాడు. సోమవారం మధ్యా హ్నం 1:30 సమయంలో జాన్‌పాకలోని తన ఇంటిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో నిందితుడు తాను పాల్పడిన నేరాలను పోలీసుల ఎదుట అంగీకరించాడని సిపి రవీందర్‌ ‌తెలిపారు.ఈకేసు ఛేదించడంలో శ్రమించిన ఈస్ట్ ఇం‌చార్జి డిసిపి వెంకట లక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, ‌గీసుగొండ ఇన్సెస్పెక్టర్‌ ‌శివరా మయ్య, పర్వతగిరి ఇన్సెస్పెక్టర్‌ ‌కిషన్‌, ‌టాస్క్‌ఫోర్స్ ఐటి కోర్స్ ‌సిసిఎస్‌ ‌టీం ఇన్సెస్పెక్టర్లు నంది రామ్‌ ‌నాయక్‌, ‌జనార్దన్‌ ‌రెడ్డి, రాఘవేందర్‌, ‌రమేష్‌ ‌కుమార్‌తో పాటు వారి సిబ్బందిని సిపి అభినందించారు. నిందితుడు సంజయ్‌ ‌కుమార్‌ ‌నుండి మరి కొన్ని విషయాలు సేకరించే దిశగా పోలీస్‌ ‌కస్టడీకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. 10 మంది హత్య కు కారకుడైన సంజీవ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌పై త్వరలోనే చార్జిషీటు దాఖలు చేసి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని సిపి రవీందర్‌ ‌తెలిపారు. విలేకర్ల సమావేశంలో డిసిపి వెంకటలక్ష్మి, నందిరామ్‌నాయక్‌, ‌పర్వతగిరి ఇన్సెస్పెక్టర్‌ ‌కిషన్‌, ‌టాస్క్ ‌ఫోర్స్ ‌క్రైమ్‌ ఐటీ కోర్‌ ‌సిసిఎస్‌ ఇన్సెస్పెక్టర్లు జనార్దన్‌ ‌రెడ్డి, రాఘవేందర్‌ ‌తో పాటు సిబ్బందిలు పాల్గొన్నారు.

Leave a Reply