Take a fresh look at your lifestyle.

నా తెలంగాణా ప్రభుత్వం అన్నింటా నం.1…!

  • ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత అద్భుతం..
  • అన్ని రంగాల్లోనూ గణనీయ వృద్ధి
  • విద్యుత్‌, ‌తాగు, సాగునీటి రంగాల్లో విప్లవం
  • దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌
  • ‌పచ్చగా కళకళలాడుతున్న గ్రామాలు
  • అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో దళితుల స్వావలంబన అభివృద్ధికి కృషి
  • అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళి సై ప్రసంగం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. దేశ ధాన్యాగారంగా రాష్ట్రం ఆవిర్భవిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ‌పరిపాలన దక్షత, ప్రజా ప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్‌ ‌సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతుందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడిందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ గ్రామాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని హార్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో దళితుల స్వావలంబన అభివృద్ధికి కృషి జరిగిందని తమిళి సై సౌందరరాజన్‌ అన్నారు. ఇక సీఎం కేసీఆర్‌ ‌సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్‌ ‌తమిళిసై మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం..కోర్టు జోక్యంతో బడ్జెట్‌ ‌సమావేశాలకు ఆహ్వానం..గవర్నర్‌ ఏం ‌మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గవర్నర్‌ ‌తమిళిసైకి నమస్కరించి స్వయంగా స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం మారిందన్నారు. పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతుందని, దేశం నివ్వెరబోయే అద్భుతాలను రాష్ట్రం ఆవిష్కరిస్తుందని గవర్నర్‌ అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగిం దన్నారు. వ్యవసాయరంగంలో గొప్ప స్థిరీకరణను తెలంగాణ సాధించింది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగింది. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందుతుంది. పంటపెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల పంట పెట్టుబడి సాయం. రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. 2020-21 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్‌ ‌వినియోగం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ ‌దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ ‌పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ ‌సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల..నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు.

ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. 2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు.

Leave a Reply