Take a fresh look at your lifestyle.

నా టార్గెట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డే

  • నా పరిస్థితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా మారింది
  • సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ‌మార్చి 22(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : తన పంచాయతీ రేవంత్‌తోనేననీ, తన పరిస్ధితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా ఉందనీ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌ ‌నాయకత్వాన్ని సమర్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడుకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్‌ ‌మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, మెదక్‌ ‌పర్యటనకు రేవంత్‌ ‌తనను పిలవలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు.

తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు దిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని అన్నారు. ఏపీ విభజన వద్దని నిజం మాట్లాడి తెలంగాణ ద్రోహిగా పేరు మోశాను. కాంగ్రెస్‌పై అభిమానంతోనే ఎప్పట్నుంచో ఇదే పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్‌ ‌పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. ఇది కాంగ్రెస్‌ ‌పంచాయితీ కాదు. రేవంత్‌రెడ్డితోనే నా పంచాయితీ. మెదక్‌ ‌పర్యటనకు వెళ్తే నన్ను రేవంత్‌ ఆహ్వానించలేదు. దీంతో నాకు కోపం వచ్చింది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్‌ ‌చేసి ట్రోల్‌ ‌చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్‌ ‌పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు.

పంచాయితీ రేవంత్‌తో మాత్రమేనని కాంగ్రెస్‌తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించాడు. 20 రోజుల క్రితం రేవంత్‌ ‌ఫోన్‌ ‌చేశారని, మెదక్‌ ‌సీఎస్‌ఐ ‌చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు. నాకేం చెప్పలేదని కోపం వొచ్చిందని అన్నారు. మహేష్‌ ‌గౌడ్‌కి ఫోన్‌ ‌చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారని చెడా మడా తిట్టానని తెలిపారు. తెల్లారి మళ్లీ ఫోన్‌ ‌చేసి నేను, నువ్వు, కుసుమ కుమార్‌ ‌కలిసి మెదక్‌ ‌వెళ్దామని చెప్పారు. దామోదరతో కలిసి వెళ్దాం అని నాకు చెప్పలేదన్నారు. తర్వాత పోదాం అని చెప్పి నాకు చెప్పలేదు. వీళ్ళంతా కలిసి సంగారెడ్డికి వెళ్ళారు. నాకు కోపం రాదా… నాకు చీము, నెత్తురు లేదా అన్నారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యేనీ, నన్ను గెలికితే ఏమైతాదో అన్నారు. రేవంత్‌ ‌నువ్వు పిసిసికి అర్హూడవా, సిఎల్పీ లోనే తేల్చుకుందాం అని వొచ్చినా అన్నారు. అక్కడే రేవంత్‌తో మాట్లాడాలని అనుకున్న కానీ నన్ను మాట్లాడవద్దని చెప్పడంతో ఆగడం జరిగిందన్నారు. అసెంబ్లీకి రేవంత్‌ ‌వొచ్చాడు, జగ్గన్న అంటే నేను కూడా కలిసిన. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్‌ అని అనుకున్నారు. లోపలికి రండి అని రేవంత్‌ ‌పిలిచాడు.

లోపల రేవంత్‌ ‌నాకు ఏం చెప్పాడు అనుకుంటున్నారని, అయన ఏం మాట్లాడింది చెప్పకపోతే నేనేదో తప్పు చేస్తున్నట్టు అనుకుంటారు. రేవంత్‌ అసలు స్వరూపం మీకు తెలియదు. జగ్గన్నా కలిసి పోదాం అని చెప్పలేదు. మెదక్‌ ఎపిసోడ్‌ ‌మాట్లాడలేదు. సీఎం సీరియస్‌గా ఉన్నాడు. ఏ సమయంలో ఏమవుతుంది అనేది తెలియదు. గవర్నర్‌ ‌ని అందుబాటులో ఉండాలని చెప్పారు. ఏమైనా అయితే మనం రెడీగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు కరెక్ట్ ‌ట్రైనింగ్‌ ఇవ్వలేదు రేవంత్‌ ‌రెడ్డికి అన్నారు. ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్‌ ‌టైపు అయ్యింది నా పరిస్థితి అన్నారు. నేను హీరోయిన్‌, ‌హీరో కాంగ్రెస్‌ ‌పార్టీ, విలన్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో మజా ఇంకో పార్టీలో ఉండదని తెలిపారు. రేవంత్‌ ‌పై బురద జల్లే అవసరం లేదని తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంతే అన్నారు. తాను కాంగ్రెస్‌ ‌లోనే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రేవంత్‌, ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌కలిసి గాంధీ భవన్‌ని కబ్జా చేశారని ఆరోపించారు. సోనియా, రాహుల్‌లకు తిట్టినట్టు వాళ్లకు తెలియదు. అరే తురే అంటే నా తోకలు పికేస్తరా, సోనియానీ తిట్టినా రేవంత్‌ ‌కె పిసిసి ఇచ్చారని అన్నారు.

Leave a Reply