- అందుకు పోరాట వేదికగా హుజారాబాద్
- కుటంబ పాలన నుంచి కాపాడాలన్నదే నా యత్నం
- కెసిఆర్ అహంకారం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తా
- వందలు, వేలు కోట్లు ఖర్చు పెట్టి గెలిచే యోచనలో టిఆర్ఎస్
- ప్రజలు నాకు అండగా ఉన్నందున వారికి గెలుపు సాధ్యం కాదు
- అమరవీరుల స్థూపం వద్ద ఈటల తదితరుల నివాళి
- ఢిల్లీకి వెళ్లనున్న ఈటల..రేపు నడ్డా సక్షంలో బిజెపిలో చేరిక
రాష్ట్రంలో మరో యుద్ధానికి తెరలేచిందని, సిఎం కెసిఆర్ కుటంబపాలన అంతమే తన లక్ష్యమని మాజీమంత్రి ఈటల రాజేందర్ సిఎం కెసిఆర్‌పై,టిఆర్ఎస్పై యుద్దభేరి మోగించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ఈటల నినాదం ఇచ్చారు. అహంకారంతో రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తే తన అజెండా అన్నారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన అనంతరం ఆయన తన పోరాటానికి వేదికగా బిజెపిని ఎంచుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో సమరశంఖం పూరించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన తనతో పాటు బిజెపిలో చేరబోతున్న తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, గండ్ర నళిని, వందలాదిగా హుజారాబాద్ నుంచి వొచ్చిన అనుచరలుతో కలసి ర్యాలీగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరులకు నివాళి అర్పించారు. యుద్దానికి దిగుతున్నానని ప్రకటించారు. కెసిఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తా చేయడమే లక్ష్యంగా తన పోరాటం ఉంటుందని ప్రకటించారు. హుజురాబాద్ కురుక్షేత్రంలో రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమే గెలుస్తుందని అన్నారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల రాజేందర్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఓటమి లేకుండా 17 ఏళ్లుగా ప్రజలు గెలిపించారన్నారు.
సమైక్య రాష్ట్ర పాలకుల వి•ద అసెంబ్లీలో గర్జించానన్నారు. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాని అన్నారు. టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చి ఉండొచ్చు కానీ గెలిపించింది ప్రజలేనన్నారు. ఇతర పార్టీల నుంచి వొచ్చిన వాళ్లు మంత్రులుగా ఉన్నారన్నారు. జనాన్ని మాయ చేసి గెలుస్తున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వాన్ని జనం ఛీ కొడుతున్నారని..అసహ్యించుకుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మధ్య ఘర్షణే హుజురాబాద్ బైపోల్ అని అన్నారు. వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఎలా గెలవాలా అని ప్రభుత్వం చూస్తున్నదన్నారు. వందల కోట్లతో తన కార్యకర్తలను,నాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. నిర్బంధాలను, బెదిరింపులను హుజురాబాద్ ప్రజలు తొక్కి పడేస్తారన్నారు. సాధించుకున్న తెలంగాణ అనుకున్న లక్ష్యాలను సాధించలేదని, ఓ కుటుంబం చేతిలో బందీ అయ్యిందని..అందుకే కెసిఆర్ అహంకారంపై ధర్మయుద్ధం చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
తన సొంత నియోజకవర్గ ప్రజల ఆశిస్సులతో..వారి ఆదేశాలతో టిఆర్ఎస్ బి ఫామ్‌పై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించానని అన్నారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారు రాజీనామా చేయకుండానే..నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. హుజురాబాద్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతున్నదని.. కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుందని ఈటల పేర్కొన్నారు. అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు. లెప్ట్, రైట్ కాదు..కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తానన్నారు. తనకు జైళ్లు, కేసులు కొత్త కాదని…తన డీఎన్ఏలోనే లౌకికవాదం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టాలని చాలామంది శ్రేయోభిలాషులు తనను కోరారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉన్నాయని..ఓడగొడతారని.. రాజీనామా చేయవొద్దని చాలా మంది తనకు తెలిపారని ఈటల వెల్లడించారు.
యావత్ తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేస్తున్నానన్నారు. వడ్లు తడిచి మొలకలు వొచ్చినా పట్టించుకోరని విమర్శించారు. యువతకు ఉపాధి లేకపోయినా వారు పట్టించుకోరని, కానీ ఈటలను చక్రబంధంలో పెట్టాలని మాత్రం పోలీసు అధికారులను వాడుతున్నారన్నారు. నిర్బంధాలు కొత్త తనకు కాదని.. వాటిని తొక్కి పడేస్తానన్నారు. నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని ఈటల పేర్కొన్నారు. మేథావులు అంతా తనకు మద్దతు తెలపాలన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వొచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామిక విధానం లేదని..అందరూ హుజూరాబాద్ వొచ్చి ప్రజలకు అండగా ఉండాలని ఈటల పిలుపునిచ్చారు. అమెరికా వారు కూడా తనను గెలిపించాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు గౌరవం లేదని..మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకోసం పోరాటం చేయడానికి ముందుకు పోతున్నానని ఈటల పేర్కొన్నారు. అనంతరం ఈటల అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు.
ఢిల్లీకి వెళ్లనున్న ఈటల..రేపు నడ్డా సక్షంలో బిజెపిలో చేరిక
ప్రజాతంత్ర, హైదరాబాద్ : టిఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఈ రేపు సోమవారం జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఈటల నివాసంలో శుక్రవారం బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్‌తో అశ్వత్థామరెడ్డి మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు.