Take a fresh look at your lifestyle.

నా వేదన

అమాయకులను
అడుగడుగునా అణగదొక్కుతూ
వారి కుత్తుకలను కత్తిరిస్తోన్న,
కబందహస్తాల
ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కిన
సమాజమిది,
కంపుకొడుతున్న వాస్తవమిది.
వివక్ష చూపెడి మూర్ఖుల ముంగిట
విచక్షణ నశించిన హీనులు,
పరితపించి పరితపించి
సాగిలబడుతోన్న ఈ సమాజంలో
అవమానపు అమాసలు
ఎడతెరిపి లేక పలకరిస్తూ
నిశీధిపొద్దుల్లోకి ఆహ్వానిస్తోంటే,
నా తనువుని నిలువెల్లా
నిరాశ తీగలు అల్లుకుంటున్నాయి.
అవమానాల చేదు మింగిన
నా స్వాభిమానం చేతనతెడ్లు
మొలిపించుకొని
వెలుగు తీరాల్ని ముద్దాడాలనుకొన్నా
నా ఆశయం న్యూనత అంచున
నలిగిపోతోంది.
విధి వింత శత్రువై
సతతం పోరు సల్పుతోంటే,
సమస్యలు మర్రిచెట్టు ఊడలై
నా వికాసానికి ఉరి వేస్తోంటే,
మనుగడే ప్రశ్నార్ధకమై
నా కోసం నేను, నాతో నేను
నిత్యం నను కమ్మేసే ఆలోచనలు
వదలట్లేదు
ఏకాంతంలో మరీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ.
మొద్దుబారిన అవకాశాల పాదాలు
వెక్కిరిస్తున్నాయి
ముందడుగు వేస్తావా
మౌనం వహిస్తావా అంటూ…

నా ఈ హృదిలో సమస్యలెన్నో
సమాధానం లేని ప్రశ్నలు ఇంకెన్నో…

 – వేమూరి శ్రీనివాస్‌
                     9912128967
                      ‌తాడేపల్లిగూడెం

Leave a Reply