Take a fresh look at your lifestyle.

‌గణపతి లొంగుబాటు హై టెన్షన్‌ ‌కల్పిత కథ

  • ఇది ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర
  • ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతాం
  • మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ ‌గణపతి లొంగిపోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఇది ఒక హై టెన్షన్‌ ‌కల్పిత కథగా పేర్కొంది. ఈమేరకు గురువారం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ‌మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఫాసిస్టు మోడీ, అమిత్‌ ‌షా, కేసీఆర్‌, ‌కేంద్ర ఇంటలిజెన్స్ ‌సంస్థ, ఛత్తీస్‌గఢ్‌ ఇం‌టలిజెన్స్ ‌సంస్థలు కలిసి ఈ కట్టుకథను తయారు చేసి మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారనీ, ఇలాంటి నీచమైన, దుర్మార్గమైన చౌకబారు ఎత్తుగడల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. నర హంతక మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయిందనీ, నిరుద్యోగం తారాస్థాయికి చేరి ప్రజల సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయని పేర్కొన్నారు.

హిందుత్వ ఎజెండాలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలోకి దిగారని చెప్పారు. జనవరి నెలలో కోవిడ్‌ 19 ‌గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించినప్పటికీ మోడీ ప్రభుత్వం ప్రపంచ టెర్రరిస్టు ట్రంప్‌ ‌సేవలో మునిగిపోయిందని విమర్శించారు. మార్చి నెలలో ఆకస్మికంగా విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పతనపు అంచులకు చేరిందనీ, ఈ సమయంలోనే దేశ వనరులను, సంపదను, దేశ, విదేశీ కార్పొరేట్‌ ‌శక్తులకు అప్పజెప్పే చర్యలను మోడీ ప్రభుత్వం చేపట్టిందనీ దీనికి ముందే ప్రశ్నించే గొంతులను, సామాజిక కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించిందని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పోలీసు, మిలటరీ యంత్రాంగాలు, ప్రచార అంగాలన్నీ ఫాసిస్టు కాషాయ భావజాలంతో కూడిన వ్యక్తులతో నిండిపోయాయనీ, దేశభక్తి పేరుతో రోజుకో పథకం, పూటకో నినాదంతో మోడీ ప్రచార దాడిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వరవరరావు, సాయిబాబా, ఆనంద్‌తేల్‌ ‌తుమ్డే, సుధా భరద్వాజ్‌ ‌వంటి ప్రముఖులను జైళ్లలో నిర్బంధించినందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయని స్పష్టం చేశారు.

కామ్రేడ్‌ ‌గణపతి వయసు, చిన్నచిన్న ఆనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకుని ఇతరులకు అప్పగించారని ఈ సందర్భంగా అభయ్‌ ‌స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలోని పోరా• సంస్థలలో ఇలాంటి మార్పులు సహజమేననీ, సిద్ధాంతపరంగా, రాజకీయంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం దృఢంగా, పటిష్టంగా ఉండి పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో మావోయిస్టు పార్టీ నాయకత్వపు ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి కూడా ఇటువంటి కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ భక్తులు, ప్రగతిశీల శక్తులు, ఇంకా ఇతర పీడిత సెక్షన్లు ఈ ప్రభుత్వాల దుర్మార్గ కుట్రలను అర్థం చేసుకుని తిప్పికొట్టాలనీ, ప్రభుత్వాల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో అనుభవం కలిగి, నిస్వార్థ, సిద్ధాంత, రాజకీయ పటుత్వం కలిగిన కేంద్ర కమిటీ నాయకత్వంలో ఉద్యమాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు తీసుకు పోతామనీ, అంతిమ విజయం సాధిస్తామని ఈ సందర్భంగా అభయ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply