Take a fresh look at your lifestyle.

మునుగోడుపై పెరిగిన పార్టీల లోడు

గెస్ట్ ఎడిట్‌ ‌మండువ రవీందర్‌రావు

అధికార టిఆర్‌ఎస్‌ ‌తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడంతో మునుగోడు ఇప్పుడు త్రికోణపోటీకి సిద్దమైంది. కాంగ్రెస్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానంగా ఉన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా ఇచ్చినప్పటినుండే మునుగోడు ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సిద్దమయ్యాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించగా, టిఆర్‌ఎస్‌ ‌మాత్రం నామినేషన్‌ల తేదీ ప్రారంభమైన అక్టోబర్‌ 7‌వ తేదీన తన అభ్యర్థిని ఖరారు చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీలో అనేక తర్జనబర్జనలు జరిగినప్పటికీ పార్టీ అధినేత కెసిఆర్‌ ‌మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరునే ఎంపిక చేయడంతో అతన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత• పార్టీ శ్రేణులపై పడింది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా కొనసాగుతున్న ప్రభాకర్‌రెడ్డి అ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కూడా. 2014లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందిన కూసుకుంట్ల ఆ తర్వాత 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పోటీపడి ఓటమి చవిచూశారు. అయితే ఆయన పట్ల నియోజకవర్గ ప్రజలు అయిష్టంగా ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటినుండి, ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో కూసుకుంట్లకు మరోసారి అవకాశం  ఇవ్వవద్దంటూ టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో పార్టీ అధినాయకుడికి, స్థానిక మంత్రులకు ఆ మేరకు విజ్ఞప్తులు చేస్తూ వొచ్చారు. అయినా పార్టీ ఆయన్నే అభ్యర్థిగా ఎంపికచేసింది. కాంగ్రెస్‌లోకూడా అభ్యర్థి ఎంపికలో అనేక తర్జనబర్జనలు చోటుచేసుకున్నప్పటికీ దివంగత మాజీ మంత్రి పాల్వాయి  గోవర్థన్‌రెడ్డి కూతురు  పాల్వాయి స్రవంతికే టికెట్‌  ‌ఖరారు చేసింది.

 

ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ   ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి పార్టీ మారి, పదవి వదిలి బిజెపి కండువ కప్పుకోవడంతో ఏర్పడిన ఈ ఖాలీ లో ఆయనే  భాజపా అభ్యర్థిగా పోటీని ఎదుర్కుంటున్నారు.  మూడు ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారు కావటంతో నియోజక వర్గంలో ప్రచారం ఇప్పుడు మరింత జోరందుకుంది.  కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందుండగా, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినప్పటికీ ఆయన నియోజకవర్గంలో చిరపరిచితుడు కావడం ఆ పార్టీకి కలిసివస్తోంది.  ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు, మంత్రుల ఇప్పటికే నియోజకవర్గాన్ని ఒకసారి చుట్టబెట్టి, ముఖ్యనాయకులను ఎన్నికల ప్రచారానికి సన్నద్దం చేశారు. ఇదిలా  ఉంటే  అధికార పార్టీ అభ్యర్థి టిఆర్‌ఎస్‌ ‌పేరున పోటీ చేస్తారా? లేదా బిఆర్‌ఎస్‌ ‌పేరతో పోటీ చేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కెసిఆర్‌ ‌తమ పార్టీ పేరు మార్పు ప్రకటన చేసి రెండు రోజులే అయింది.

టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా పేరు మార్పిడితోపాటు జాతీయ పార్టీగా గుర్తించే విషయంలో జాతీయ ఎన్నికల కమిషన్‌  ఇం‌కా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బిఆర్‌ఎస్‌కు అనుమతి లభిస్తే కొత్తగా గుర్తింపు పొందిన బిఆర్‌ఎస్‌ ‌మొదటిసారిగా ఈ ఉప ఎన్నికలతోనే తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. కాగా,  మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమని తెలిసినప్పటినుండి టిఆర్‌ఎస్‌ ఈ ‌నియోజకవర్గంలో అనేకసార్లు సర్వేచేయించింది. ప్రతీ సర్వేలో తమదే పై చెయ్యి అన్నట్లుగా రిపోర్టులు రావడంతో ఆ పార్టీ విజయం తమదేనంటోంది. అలా అని ఊరుకోకుండా గెలుపే లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తోంది. మునుగోడు వాస్తవంగా అటు కాంగ్రెస్‌కు, ఇటు కమ్యూనిస్టులకు కంచుకోట అయినప్పటికీ  కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతుండటంతో ఆ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు.

ఇదిలాఉంటే దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో మునుగోడులో ముందుకు వెళ్తోంది బిజెపి. ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం  ద్వారా తెలంగాణపై పట్టు సాధించవచ్చన్నది ఆ పార్టీ మొదటి నుండి లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవంగా ఈ ఉప ఎన్నికకు కారణంకూడా బిజెపినే అన్న వాదన లేకపోలేదు. కాంగ్రెస్‌ ‌నియోజకవర్గంగా ఉన్న మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి  కారణం లేకుండానే రాజీనామా చేయడం వెనుక బిజెపియే కారణమన్న ప్రచారం లేకపోలేదు. ఆయన తన స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేశాడేగాని, స్థానిక ప్రజల ప్రయోజనాలకోసం కాదన్నది వాదన. రాజగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్నట్లు తన రాజీనామా కారణంగా ఈ నియోజకవర్గం బాగుపడుతుందనుకుంటే ఆయన అధికార పార్టీలో కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీనుండి మరో ప్రతిపక్ష పార్టీలో చేరడంవల్ల నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందన్న విమర్శ కూడా లేకపోలేదు.

కాగా, కాంగ్రెస్‌పార్టీ ఈ నియోజకవర్గాన్ని కోల్పోవడంద్వారా మరోసారి తన నిరాసక్తతను మరోసారి నిరూపించుకుందన్న ఆరోపణను మోస్తున్నది. సిట్టింగ్‌  ఎంఎల్‌ఏ ‌రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పార్టీ కష్టకాలంలో ఉన్న ప్పుడు దాన్ని వదిలివెళ్తున్న వ్యక్తిని నిరోధించ  లేకపోయిందన్న అపవాదు  స్థానిక నేతలపై ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఆ పార్టీ తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఎలాగైనా నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply